హైదరాబాద్, వెలుగు: రైళ్లు, బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, తాము చేరుకోవాల్సిన ప్రాంతానికి వెళ్లేందుకు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, బస్టాపుల్లో వెయిట్చేసే ప్యాసింజర్లకు తిప్పలు తప్పడం లేదు. సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కుర్చీలు సరిపోక నిల్చోవాల్సి వస్తోంది. రైల్వే స్టేషన్లలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ట్రైన్ మిస్ అవుతుందేమోనని ముందుగా స్టేషన్కు చేరుకొని వెయిట్ చేసేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. బస్సు, రైళ్ల ఛార్జీలు పెంచిన ప్రభుత్వాలు ఎందుకు సరైన ఫెసిలిటీస్ కల్పించడం లేదని ప్యాసింజర్లు ప్రశ్నిస్తున్నారు.
ప్రధాన స్టేషన్లలోనూ ఇంతే..
రైల్వే స్టేషన్లలో సరిపడా బెంచీలు, కుర్చీలు ఉండటం లేదు. సిటీలో ప్రధానమైన సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి. బెంచీలు లేక చాలామంది కిందే కూర్చుంటున్నారు. బస్టాండ్లలోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. సిటీ బస్టాపుల్లో కొన్నిచోట్ల సీట్లు ఖాళీగా లేకపోవడం, ఖాళీ ఉన్నచోట క్లీన్ గా లేకపోవడంతో జనం కూర్చోలేకపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్రైన్, బస్సుల ఛార్జీలు భారీగా పెంచుతున్నప్పటికీ రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో ప్రయాణికులకు మినిమమ్ ఫెసిలిటీస్ కల్పించడంలేదు. రైల్వే స్టేషన్లలో టికెట్ కౌంటర్లు తక్కువగా ఉంటున్నాయి. టికెట్ల కోసం అర గంటకు పైగానే వెయిట్ చేయాల్సి వస్తోంది. క్యూ ఎక్కువగా ఉండి టికెట్లు తీసుకునే లోపై ట్రైన్ వెళ్లిపోతోందని కొందరు ప్యాసింజర్లు వాపోతున్నారు. కౌంటర్లు పెంచాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు.
బస్ షెల్టర్ల దగ్గర చెత్త, మురుగు
సిటీలో బస్టాపులు క్లీన్ గా ఉండటం లేదు. బస్టాపుల్లోని షెల్టర్లలో చెత్త, మురుగునీరు చేరుతుండటంతో ప్యాసింజర్లు అక్కడ వెయిట్చేయలేకపోతున్నారు. బస్సులు వచ్చేంత వరకు నరకం చూస్తున్నామని వాపోతున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 1,050 రూట్లలో 2,350 బస్టాపులు ఉండగా.. 1,250 బస్టాపుల్లో మాత్రమే షెల్టర్లు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొన్ని చోట్ల షెల్టర్లు లేక, ఉన్న దగ్గర కూర్చునేందుకు సరిగాలేక ప్యాసింజర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలపై దృష్టి పెట్టాల్సిన జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిటిజన్లు మండిపడుతున్నారు.
ఫెసిలిటీస్ కల్పించాలి..
రైల్వే స్టేషన్లో కూర్చుందామంటే కుర్చీలు దొరకడం లేదు. కింద కూర్చోవాల్సి వస్తోంది. డైలీ లక్షల్లో ప్యాసింజర్లు వస్తున్నప్పటికీ ఇక్కడ అందుకు అనుగుణంగా సౌకర్యాలు లేవు. అధికారులు స్పందించి ఇబ్బంది లేకుండా చూడాలి. - శ్రీనివాస్, ప్యాసింజర్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
రాళ్లపై కూర్చున్నం..
నేను జిల్లా బస్సు కోసం వెయిట్ చేస్తున్నా. బస్టాప్ ఎక్కడో ముందుకు ఉంది. బస్సులు మాత్రం ఇక్కడే ఆగుతాయి. కానీ ఇక్కడ కూర్చునేందుకు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. ఇక్కడున్న రాళ్లపైనే ప్యాసింజర్లు కూర్చుంటున్నారు.
- సంతోషి, ప్యాసింజర్, నానల్నగర్
ఇక్కడ బస్టాపే లేదు..
ఈ ప్రాంతంలో బస్టాపే లేదు. రోడ్డుపై నిలబడలేకపోతున్నం. ఏండ్లుగా ఇదే ఇబ్బంది ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. వృద్ధులు నిలబడలేక రోడ్డుపైనే కూర్చుంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపితే బాగుంటుంది.
- సాయికుమార్, ప్రైవేటు ఎంప్లాయ్, లంగర్ హౌస్