సూసైడ్స్ పెరుగుతున్నయ్.. కనించని రౌండ్ ది క్లాక్ నిఘా

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి 15 మందిపైనే ఆత్మహత్య
  • రక్షణ చర్యలు తీసుకోని పోలీసులు, బల్దియా అధికారులు

మాదాపూర్, వెలుగు :  హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సూసైడ్ స్పాట్ గా మారింది. బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. లేక్ వద్ద పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసినా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. జీహెచ్ఎంసీ, పోలీసులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. దీంతో బ్రిడ్జి సూసైడ్ కు కేరాఫ్ గా తయారైంది. 

గత మూడేళ్లలో..

మాదాపూర్,​ జూబ్లీహిల్స్​ మధ్య దుర్గం చెరువు పై రూ.184 కోట్లతో 735 మీటర్ల పొడవునా కేబుల్​బ్రిడ్జిని జీహెచ్ఎంసీ, టీఎస్ఐఐసీ సంయుక్తంగా నిర్మించాయి. దీన్ని 2020 ఆగస్టులో మంత్రి కేటీఆర్​ ఓపెనింగ్​ చేశారు. ఆ తర్వాత నుంచి కేబుల్​ బ్రిడ్జిని చూసేందుకు అధికంగా సందర్శకులు వస్తుంటారు. ​బ్రిడ్జి ప్రారంభించినప్పటి నుంచి ఈ నెల13వ వరకు15 మందిపైగా వివిధ కారణాలతో​బ్రిడ్జి మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

పేరుకే పోలీస్ వాచ్ టవర్ 

చెరువు వద్ద పోలీసు శాఖ లేక్​పోలీస్​ సిస్టమ్ ను  ఏర్పాటు చేసింది.  పోలీస్​ వాచ్​టవర్​ను కూడా నిర్మించింది.  ఇందులో కమాండ్​కంట్రోల్​సెంటర్,  లేక్​, ఈ స్కూటర్​ పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. చెరువు చుట్టూ 66 సీసీ  కెమెరాలు,  కేబుల్ బ్రిడ్జిపై 10 సీసీ కెమెరాలను 2022, మే 2న డీజీపీ మహేందర్​రెడ్డి ప్రారంభించారు.  అయితే.. పోలీస్​ వాచ్​టవర్​ పేరుకే ఉంది. బైక్​ పెట్రోలింగ్​ కోసం ముగ్గురు కానిస్టేబుల్స్, బోట్​పెట్రోలింగ్ కు ఒక కానిస్టేబుల్,  వాచ్​టవర్​లో ఒక కానిస్టేబుల్ కేటాయిస్తూ.. వీరికి హెడ్​గా ఎస్ఐని నియమించారు.  షిఫ్ట్​కు 6  మంది కానిస్టేబుళ్లు​, ఒక ఎస్ఐ రోజుకు రెండు షిఫ్టులు విధుల్లో ఉండాలి.  ప్రస్తుతం రెండు షిఫ్టుల్లో నలుగరు కానిస్టేబుళ్లు మాత్రమే డ్యూటీలో ఉన్నారు.  ఎస్ఐ అప్పుడప్పుడు వచ్చిపోతుండగా పర్యవేక్షణ లోపించింది. పోలీసులు రౌండ్​ ది క్లాక్​ డ్యూటీ చేస్తారని ఉన్నతాధికారులు చెప్పినా.. క్షేత్రస్థాయిలో 
కనిపించడం లేదు.

ALSO READ :ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, చల్లా ధర్మారెడ్డిపై బీఆర్ఎస్​లో తిరుగుబాటు

పని చేయని వాటిపై..

చెరువు చుట్టూ 4.2 కిలోమీటర్ల వాకింగ్​ ట్రాక్ ఉంది.  మొత్తం 78 సీసీ కెమెరాలను అమర్చారు. వీటిని వాచ్ టవర్​లోని కమాండ్​కంట్రోల్, మాదాపూర్​ పోలీస్​ స్టేషన్​, సైబరాబాద్​ కమిషనరేట్​లోని కమాండ్​ కంట్రోల్​కు కనెక్ట్ చేశారు. బ్రిడ్జిపై నుంచి ఎవరైనా చెరువులోకి దూకిన వెంటనే కనిపెట్టేలా సీసీ కెమెరాలను అమర్చారు. రౌండ్​ ది క్లాక్​ పర్యవేక్షిస్తున్నామని ఉన్నతాధికారులు చెప్పారు.  కానీ కెమెరాల్లో 20 వరకు మాత్రమే పని చేస్తుండగా.. పనిచేయని వాటిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని తెలు స్తుంది.  బ్రిడ్జిపై నుంచి చెరువులోకి దూకకుండా రెండు వైపులా ఎత్తుగా ఉండేలా పొడవైన గ్లాసు షీల్డ్​ కానీ, ఫ్లై ఓవర్లపై ఇరువైపులా ఏర్పాటు చేసే ఐరన్​ షీట్లు కానీ ఏర్పాటు చేసి రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఆ విధంగా చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన యువతి పాయల్ (20) జాబ్ కోసం 3 నెలల కింద సిటీకి వచ్చింది. జూబ్లీహిల్స్ లో  బేబీ కేర్ టేకర్ గా పని చేస్తూ.. ఫెండ్ర్ తో  కలిసి ఉంటోంది. గత గురువారం మధ్యాహ్నం పాయల్ ఫ్రెండ్ తో కలిసి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి చూసేందుకు వెళ్లింది. ఇద్దరూ ఫొటోలు దిగుతుండగా.. ఒక్కసారిగా పాయల్ బ్రిడ్జి పై నుంచి చెరువులో దూకింది. వెంటనే పోలీసులు, బల్దియా డీఆర్ ఎఫ్ బృందాలు చెరువులో గాలింపు చేపట్టాయి. రాత్రయినా యువతి ఆచూకీ దొరకలేదు. దీంతో మళ్లీ శుక్రవారం ఉదయం నుంచి గాలింపు చేపట్టగా.. మధ్యాహ్నం పాయల్ డెడ్ బాడీ చెరువులో దొరికింది. ప్రేమించిన యువకుడితో పెళ్లికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతోనే సూసైడ్ చేసుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.

 అనౌన్స్ మెంట్ చేస్తాం

కేబుల్​ బ్రిడ్జిపై పటిష్ట నిఘాకు మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. బ్రిడ్జిపై స్పీకర్లు పెట్టి మైక్​ ద్వారా అనౌన్స్​మెంట్​ చేయడం, ఫుట్​పెట్రోలింగ్​ఏర్పాటుపై సైబరాబాద్​ సీపీ దృష్టికి తీసుకువెళ్లాం. దీంతో పాటు బ్రిడ్జిపై రక్షణ చర్యలు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్​అధికారులతో చర్చిస్తున్నాం.
 శిల్పవల్లి, డీసీపీ, మాదాపూర్​ జోన్