తండ్రి రాజ్యసభ సభ్యుడు, కొడుకు కార్పొరేషన్ చైర్మన్, కూతురు మేయర్

  • విధేయతకు పట్టం
  • రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న కేకే
  • కార్పొరేషన్ చైర్మన్​గా ఆయన కొడుకు
  • ఇప్పుడు కూతురుకు మేయర్ పదవి

హైదరాబాద్, వెలుగు: చివరి క్షణం వరకు ఉత్కంఠ కలిగించిన జీహెచ్​ఎంసీ మేయర్​ పీఠం చివరకు టీఆర్ఎస్  సెక్రటరీ జనరల్ కె. కేశవరావు  కూతురు విజయలక్ష్మికి దక్కింది. కొంత కాలంగా సామాజిక సమీకరణల ఆధారంగా మేయర్​ ఎంపికపై ఊహాగానాలు జరుగగా.. ఇప్పుడు విధేయతకే పెద్దపీట వేసినట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. వారం రోజుల కింద  కేకేకు, ఆయన కూతురుకు మేయర్ ఎన్నిక కోసం రెడీగా ఉండాలని కేసీఆర్​ సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. రాజ్యసభ ఎంపీ హోదాలో కాంగ్రెస్ పార్టీ వీడి టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి కేకేకు కేసీఆర్ ప్రయార్టీ ఇస్తున్నారు. ముందుగా ఆయనను పార్టీ సెక్రటరీ జనరల్​గా నియమించారు. రాజ్యసభ ఎంపీ పదవీకాలం ముగియగానే 2014 ఏప్రిల్ లో టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు పంపారు. ఆ పదవీకాలం 2020 ఏప్రిల్​లో ముగియగానే మరోసారి రాజ్యసభ సీటు ఇచ్చారు. అయితే.. గత ఏడాది ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో సమ్మెకు మద్దతు ఇచ్చే విధంగా కేకే  మాట్లాడారు. సమ్మె చట్ట విరుద్ధమని కేసీఆర్ గట్టిగా వాదిస్తున్న టైంలో కేకే ఆ ప్రకటన చేయడం కేసీఆర్ కు చిరాకు తెప్పిచ్చిందని ప్రచారంలో ఉంది. ఆ ఒక్క ఇన్సిడెంట్ తప్ప టీఆర్ఎస్ పట్ల కేకే పూర్తి విధేయుడిగా ఉండటం వల్లే పదవులు దక్కాయని పార్టీ లీడర్లు భావిస్తున్నారు.

కేకే ఇంట్లో మూడు పదవులు

టీఆర్ఎస్ పార్టీ నుంచి కేకే రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన కొడుకు విప్లవ్ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్​మెంట్ కార్పొరేషన్  చైర్మన్ గా ఉన్నారు. గత ఐదేండ్లుగా ఆ పదవిలో ఉంటున్న విప్లవ్.. తదుపది ఉత్తర్వులు వచ్చే వరకు  చైర్మన్ గా కొనసాగే విధంగా ప్రభుత్వం జీవో ఇచ్చింది.  కేకే రాజకీయ వారసురాలిగా యూఎస్ నుంచి వచ్చిన కూతురు విజయలక్ష్మి గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే కార్పొరేటర్ గా గెలిచారు. అప్పుడే తన కూతురును మేయర్  చేసేందుకు కేకే తీవ్రంగా ప్రయత్నించినట్లు ప్రచారంలో ఉంది. అప్పుడు సక్సెస్​ కాలేకపోయారని, ఈ సారి మాత్రం సక్సెస్ అయ్యారని పార్టీ లీడర్లు చెప్తున్నారు.

విజయలక్ష్మి ఎంపికపై లీడర్లలో భిన్నాభిప్రాయాలు

కేకే కూతురు విజయలక్ష్మిని మేయర్ చేయడంపై జీహెచ్ఎంసీ పరిధిలోని టీఆర్ఎస్ లీడర్ల మధ్య భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు ఒకే ఇంటికి మూడు పదవులు ఎట్లా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ప్రస్తుత పరిస్థితుల్లో కేకే కూతురును మేయర్ చేయడం కరెక్ట్  అని అంటున్నారు. మేయర్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారంలో ఉంది. అందుకే గురువారం ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే ఆమె  కౌన్సిల్ హాల్ నుంచి బయటకు వచ్చినట్లు లీడర్లు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా అసహనంగా ఉన్నట్టు వారు మాట్లాడుకుంటున్నారు.

లాయర్‌ టు మేయర్‌

టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి హైదరాబాద్‌‌‌‌లోని హోలీ మేరీ స్కూల్‌‌‌‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు. రెడ్డి మహిళా కాలేజీలో డిగ్రీ, భారతీయ విద్యాభవన్‌‌‌‌లో జర్నలిజం చేశారు. సుల్తానా ఉల్ లూమ్ లా కాలేజీలో ఎల్ఎల్‌‌‌‌బీ చదివారు. తర్వాత బాబీ రెడ్డితో విజయలక్ష్మి పెండ్లి జరిగింది. 18 ఏళ్లు అమెరికాలోనే ఉండి అక్కడి పౌరసత్వం పొందారు. నార్త్ కరోలినా వర్సిటీలో పని చేశారు. 2007లో ఇండియాకు తిరిగొచ్చారు. తండ్రికి రాజకీయ వారసులుగా కొనసాగేందుకు యూఎస్ సిటిజన్ షిప్ వదులుకున్నారు. 2016 బల్దియా ఎన్నికల్లో బంజారాహిల్స్ నుంచి పోటీచేసి గెలిచారు. మేయర్ పీఠం దక్కుతుందని అనుకున్నా బొంతు రామ్మోహన్‌‌‌‌ను పార్టీ ఎంపిక చేసింది. మొన్నటి ఎన్నికల్లో బంజారాహిల్స్ నుంచి పోటీ చేసి మళ్లీ గెలిచారు. అయితే 300 పైచిలుకు ఓట్లతో గెలిచిన క్యాండిడేట్‌‌‌‌కు మేయర్ సీటు దక్కదనే విస్తృతంగా చర్చ జరిగింది. కానీ పార్టీ ఆమె వైపే మొగ్గు చూపింది.

ఉద్యమం నుంచి తోడుంటూ..

తెలంగాణ రాష్ట్రం కోసం భర్తతో కలిసి ఉద్యమంలో పాల్గొన్న శ్రీలతారెడ్డి 2001లో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరారు. మహిళలను ఉద్యమంలో భాగస్వాములను చేయడంలో కీలకంగా వ్యవహరించారు. 2002లో జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం వచ్చింది. తార్నాక నుంచి పోటీ చేశారు. అయితే టీడీపీ క్యాండిడేట్‌‌‌‌పై ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలం టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. పార్టీలో కొనసాగుతూనే 20 ఏండ్లుగా తార్నాకలో బొటిక్‌‌‌‌ వ్యాపారం చేస్తున్నారు. గతేడాది జరిగిన జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం తార్నాక సిట్టింగ్‌‌‌‌ కార్పొరేటర్‌‌‌‌ను మార్చి శ్రీలతరెడ్డికి అవకాశం ఇచ్చింది. బీజేపీ క్యాండిడేట్‌‌‌‌ బండ జయసుధారెడ్డిపై 2,500 ఓట్ల మెజార్టీతో శ్రీలతరెడ్డి గెలిచారు. ఇప్పుడు డిప్యూటీ మేయర్‌‌‌‌గా ఎన్నికయ్యారు. శ్రీలతారెడ్డి ఇద్దరు కూతుళ్లు విదేశాల్లో చదువుకుంటున్నారు.