బయటపడని అత్యాచారాలు ఎన్నెన్నో

ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడే ఘటన హైదరాబాద్​ శివారుల్లో జరిగింది. పాతికేళ్ల వెటర్నరీ డాక్టర్​ను నలుగురు యువకులు దారుణంగా రేప్​ చేసి, తగులబెట్టేయడంతో… మహిళల భద్రత అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఏడేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ ఎపిసోడ్​ తర్వాత ఆ రేంజ్​లో కలవరం పుట్టించింది. పార్లమెంట్​లో పార్టీలకతీతంగా ఎంపీలు అందరూ స్పందించారు. రాజ్యసభ చైర్మన్​ వెంకయ్యనాయుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంపీలు మరోమాట లేకుండా నిందితులకు ఉరేయాలని డిమాండ్​ చేశారు. దేశం తలదించుకునేలా చేస్తున్న రేప్​ ఘటనలను ఇంకెంతకాలం భరిస్తామని, అవసరమైతే ఉన్న చట్టాలకు మార్పు చేయాలని కోరారు. చట్టాలను చేయాల్సిన పార్లమెంట్​లోనే సభ్యులు ఈ విధమైన డిమాండ్​ చేస్తున్నారంటే… సమస్య తీవ్రత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

జనంలోనూ, వాళ్లకు ప్రతినిధులైన ఎంపీలకు ఇంత ఆవేశం, ఆందోళన పుట్టించిన ‘దిశ’ ఘటన వెనుక ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న దాడుల నేపథ్యం ఉంది. వెలుగులోకి రాని మరెన్నో అత్యాచారాల ప్రతిధ్వని ఉంది. 2012 డిసెంబర్​లో నిర్భయ ఘటన జరిగాక, చాలా రేప్​ అండ్​ మర్డర్​ సంఘటనలు చోటు చేసుకున్నాయి. మొన్నటికి మొన్న తెలంగాణలో కుమరం భీమ్​ ఆసిఫాబాద్​ జిల్లాలోనూ ఒక దారుణం జరిగింది. పోయిన నెల 24వ తేదీన తలపిన్నులు, రిబ్బన్లు అమ్ముకుని జీవించే ఒక మహిళ అనే మహిళను పట్టపగలే లింగాపూర్​ మండలం ఎల్లాపత్తర్​ గ్రామంలో ముగ్గురు అడ్డగించారు. ఆమెను పొదలమాటుకు లాక్కెళ్లి, రేప్​ చేయడమేకాక, వంటిపైనున్న బంగారాన్ని దోచుకుని, కొట్టి చంపేశారు. ఇది జరిగిపోయి 10 రోజులు గడుస్తున్నా ఈ కుటుంబానికి ఇప్పటివరకు న్యాయం జరగలేదని సోషల్​ మీడియాలో ఆవేదన మొదలైంది. ఇలాంటివెన్నో వెలుగులోకి రానివి, మారు మూల పల్లెల్లో, తండాల్లో, గ్రామాల్లో జరిగిపోతున్నాయి. నగరాలకు దూరంగా జరగడంవల్ల వీటిపై జనం స్పందనకూడా ఉండడం లేదు. సాదాసీదా క్రైమ్​ మాదిరిగా చూస్తున్నారు.

వెలుగులోకి వచ్చేవి, అందరికీ తెలిసేవి కొన్ని సంఘటనలే. ఇటువంటివి బయటకు చెప్పుకోవడానికి భయపడుతున్నారు. పరువు పోతుందనే బెంగ, అమ్మాయికి ఎప్పటికీ పెళ్లి కాదనే బాధ, పోలీసులకు కంప్లైంట్​ చేస్తే  రేప్​ చేసినవాళ్ల బంధువులు ఏం చేస్తారోనని భయం, తమ చుట్టాల్లో కూడా అందరూ వెలేసినట్టు చూస్తారనే అనుమానం కారణంగా ఇలాంటి ఘటనలు బయటపడటం లేదు. కొన్ని సందర్భాల్లో బాగా తెలిసినవాళ్లే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడడం కూడా మరో కారణం.

రేప్​ సంఘటనలు రికార్డుల్లో ఉన్నవి 100 అనుకుంటే జనానికి తెలియకుండా పోతున్నవి వేలల్లో ఉంటాయి.  వెంటనే న్యాయం జరుగుతుందనే నమ్మకం, రేప్​ చేసిన రాక్షసుడిని బతకనివ్వరనే భరోసా ఉంటేనే అందరూ పోలీసుల దాకా వెళ్లగలిగే అవకాశం ఉంటుంది.  పలుకుబడి, డబ్బు ఉన్న వాళ్లను ఒక రకంగా, లేని వాళ్లను ఒక రకంగా పోలీసులు ట్రీట్​ చేస్తారనే ఉద్దేశంతోనే చాలా మంది ఉన్నారు. ఎవరిపై జరిగినా, ఎక్కడ జరిగినా, బాధితులు ఎవరైనా… వీటన్నింటినీ ఒకే తీరుగా ఇన్వెస్టిగేషన్​ జరపాలని అందరూ కోరుకుంటున్నారు.

  • మహిళలపై సెక్సువల్​ నేరాలకు సంబంధించి అనేక నిర్వచనాలను చట్టం సూచిస్తోంది.
  • ఆడవాళ్లను కించపరిచేలా సైగలు చేసినా, ఇబ్బందిపెట్టేలా ఓరకంట చూసినా నేరమే.
  • ఉద్దేశపూర్వకంగా కొన్ని శరీర భాగాలను టచ్​ చేసినాకూడా సెక్సువల్​ అఫెన్స్​ కిందకే వస్తుంది.
  • వర్క్​ ప్రదేశాలలో… అంటే ఫ్యాక్టరీ, కనస్ట్రక్షన్​, ఆఫీసు లేదా మరే ఇతర చోట్లనైనా పనిచేస్తున్న మహిళలకోసం ప్రత్యేక గ్రీవెన్సెస్​ సెల్​ ఏర్పాటు చేయాలనికూడా సూచించింది.

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాగానీ మహిళలకు సెక్యూరిటీ అనేది నూటికి నూరు శాతం దక్కకుండా పోతోంది.

దేశంలో రేపిస్టులకు త్వరగా శిక్షలు పడకపోవడం, దర్యాప్తు బాగా ఆలస్యంగా జరగడం, మధ్యలో పలుకుబడిగలవాళ్ల ప్రమేయం ఉండడం వగైరా కారణాలతో ఇలాంటి ఘటనలు పదే పదే జరుగుతున్నాయని అంటున్నారు. ప్రపంచాన్ని కుదిపేసిన ‘మీ టూ’ ఉద్యమం క్రమంగా చల్లారిపోవడానికికూడా ఇదే కారణం. పోయినేడాది రోజుకో మహిళ ముందుకొచ్చి ధైర్యంగా తనకు జరిగిన అన్యాయాన్ని మీడియాకి చెప్పుకుంది. ఎం.జె.అక్బర్​ లాంటి సీనియర్​ జర్నలిస్టు, కేంద్ర మంత్రి పదవి పోగొట్టుకున్నారు. ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత తెహల్కా డాట్​ కమ్​ ఎడిటర్​ ఇన్​ చీఫ్​ తరుణ్​ తేజ్​పాల్​పై ఒక కొలీగ్​ ఫిర్యాదు చేసి, అరెస్టు చేయించింది. అయితే, ఇలాంటి ప్రముఖులపై వచ్చిన కేసులు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్​ దశలోనే ఉన్నాయి. ఒంటరి అమ్మాయి కనిపిస్తే మీదపడిపోయేవాళ్లకు ఈ వివరాలు తెలిసే అవకాశం లేదు. మన దేశంలో ఎంత పెద్ద నేరానికి పాల్పడ్డ శిక్ష త్వరగా అమలు కాదు అనే అభిప్రాయంమాత్రం పాతుకుపోయింది.

The number of rape incidents that not in the records is more

ఇండియాలోకూడా రేపిస్టులకు ఉరి శిక్ష విధించాలని చట్టం చెబుతోంది. అయితే, అది కొన్ని సందర్భాల్లోనే.

  • రేప్​కు గురైన మహిళ చనిపోయినట్లయితే,
  • షాక్​కి గురై కోమాలోకి వెళ్లిపోయినట్లయితే,
  • లేదా రేపిస్టు పదే పదే ఇటువంటి వాటికి పాల్పడితే ఉరి శిక్ష వేయడానికి ఆస్కారముంది.
  • ఇండియన్​ పీనల్​ కోడ్​లోని ఆర్టికల్​–375 ఈ విషయంలో స్పష్టంగా ఆరేడు రకాల నిర్వచనాల్ని ఇచ్చింది.
  • తనతో రెగ్యులర్​గా సెక్స్​లో పాల్గొనే మహిళే (భార్య లేదా గర్ల్​ఫ్రెండ్​) అయినప్పటికీ, ఆమె ఇష్టపడని సమయంలో జరిపే శృంగారాన్నిసైతం రేప్​గా చూడాలని చెబుతోంది.
  • ఈ మధ్య చేసిన చట్టంతో మైనర్లపై అత్యాచారానికి పాల్పడితే మరణ శిక్ష విధించడానికి వీలు ఏర్పడింది.

గత అయిదారేళ్లలో రేప్​ కేసులు పెరుగుతున్నప్పటికీ, శిక్షలు పడే శాతం కొద్దిగా తగ్గుతూనే ఉంది. కోర్టులో వాదోపవాదనలు ముగిసిపోయి తీర్పులు వెలువడినవాటిని బట్టి కన్విక్షన్​ రేటుని పరిగణనలోకి తీసుకుంటారు.

  • దేశంలో సగటున అన్ని కేసుల్లోనూ 47 శాతం మందికే శిక్షలు పడుతుండగా, మహిళలపై అఘాయిత్యాల కేసుల్లో 19 శాతం మందికే శిక్షలు పడుతున్నాయి.
  • ఈశాన్య రాష్ట్రాల్లోనే 25 నుంచి 70 శాతం వరకు కన్విక్షన్​ రేటు ఉంది.
  • పశ్చిమ బెంగాల్​, గుజరాత్​, కర్ణాటక రాష్ట్రాల్లో మరీ దారుణంగా కేవలం 5 శాతం రేపిస్టులే శిక్షలకు గురవుతున్నారు .
  •  2016లో రేపిస్టుల విషయంలో ఆలిండియా కన్విక్షన్​ రేటు 25 శాతం వరకు నమోదైంది.
  •  పెండింగ్​ కేసులను చూస్తే… 2015 చివరికల్లా 1,18,537 రేప్​ కేసులు వేర్వేరు కోర్టుల్లో ఉన్నాయి.
  • 2016 చివరికి 12.5 శాతం పెరుగుదలతో 1,33,813 కేసులు నమోదయ్యాయి.