
న్యూఢిల్లీ : యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయడానికే ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆగస్టు 2019– ఆగస్టు 2024 మధ్య యూపీఐ ట్రాన్సాక్షన్ల సంఖ్య ఏడాదికి 75 శాతం పెరిగిందని, ట్రాన్సాక్షన్ల విలువ ఏడాదికి 68 శాతం పెరిగిందని యాక్సిస్ సెక్యూరిటీస్ రిపోర్ట్ పేర్కొంది. కార్డ్ (క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్) పేమెంట్స్ పెద్దగా పెరగలేదని తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం, క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లతో పోలిస్తే 38.4 రెట్లు ఎక్కువ ట్రాన్సాక్షన్లు యూపీఐ ద్వారా జరిగాయి. రూ.2 వేల లోపుండే యూపీఐ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా జరిగాయి.
మొత్తం యూపీఐ పేమెంట్లలో ఈ సెగ్మెంట్ వాటా 33 శాతంగా ఉంది. మొత్తం డిజిటల్ పేమెంట్లలో 96 శాతం తక్కువ వాల్యూ ఉండే ట్రాన్సాక్షన్లు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. కానీ, కార్డుల ద్వారా జరిగే వినియోగం యూపీఐతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ఆగస్టులో నికరంగా 9,24,000 కార్డులు ఇష్యూ అయ్యాయని యాక్సిస్ సెక్యూరిటీస్ రిపోర్ట్ పేర్కొంది. అంతకు ముందు నెలలో నికరంగా 7,55,000 కార్డులు ఇష్యూ అయ్యాయి.
కానీ, ఏడాది ప్రాతిపదికన చూస్తే ఆగస్టులో ఇష్యూ అయిన కార్డులు 34 శాతం తగ్గాయి. ప్రభుత్వ, ఫారిన్ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకులు కార్డ్ సెగ్మెంట్‌లో ముందున్నాయని ఈ రిపోర్ట్ పేర్కొంది. పండుగ సీజన్ ఉండడంతో రానున్న నెలల్లో క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా వినియోగం ఊపందుకుంటుందని అంచనా వేసింది.