
- ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు డీపీఆర్‌కు టీఏసీ ఆమోదం
- 67.05 టీఎంసీల నీటి కేటాయింపులు
- మంత్రి ఉత్తమ్, అధికారుల ఏడాది శ్రమకు ఫలితం
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దీనికి సెంట్రల్ వా టర్ కమిషన్(సీడబ్ల్యూసీ) అనుమతులు లభించాయి. గురువారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, సీడబ్ల్యూసీ చైర్మన్ ముకేశ్‌కుమార్ సిన్హా నేతృత్వంలో సీడబ్ల్యూసీ 158వ టెక్నికల్‌అడ్వైజరీ కమిటీ(టీఏసీ) మీటింగ్ జరిగింది. ఇందులో ఇంటిగ్రేటెడ్ సీతారామసాగర్, సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు అధికారికంగా అనుమతులు లభించాయి. ప్రాజెక్టు డిటెయిల్డ్ రిపోర్టు (డీపీఆర్)కు టీఏసీ ఆమోదం తెలిపింది. దీంతో 67.05 టీఎంసీల నీటి కేటాయింపులకూ ఆమోదం తెలిపినట్టయింది. టీఏసీ సమావేశానికి ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఈఎన్సీ (జనరల్) అనిల్‌కుమార్, గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్య ప్రసాద్, ఇంటర్ స్టేట్ వాటర్ రీసోర్సెస్ఎస్ఈ ఎస్.విజయ్ కుమార్, కొత్తగూడెం ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలనూ వివరించారు. కాగా, గత ఫిబ్రవరిలో నిర్వహించిన 157వ టీఏసీ సమావేశంలో సీతారామ డిజైన్లపై కేంద్ర జలశక్తి శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటును సాకుగా చూపించి, డిజైన్లను మరోసారి రివ్యూ చేయాలని సూచించింది. ప్రాజెక్టు ప్రాంతంలో మరోసారి జియోటెక్నికల్స్టడీస్చేయించాలని సిఫార్సు చేసింది. వాటన్నింటినీ ఇటీవలే సీడబ్ల్యూసీకి అధికారులు సమర్పించారు. ఆయా రిపోర్టులపై టీఏసీ సమావేశంలో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
7.87 లక్షల ఎకరాలకు నీళ్లు..
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్జిల్లాల్లోని 7.87 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేలా సీతారామ లిఫ్ట్ఇరిగేషన్ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇటు నాగార్జునసాగర్ప్రాజెక్టు, వైరా, పాలేరు కింద ఉన్న ఆయకట్టునూ ఈ ప్రాజెక్టు ద్వారా స్థిరీకరించనున్నారు. 67.05 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో 11 పంప్‌హౌసులు, 8 యూనిట్ల (40 మెగావాట్ల యూనిట్లు 7, 2.8 మెగావాట్ల యూనిట్ఒకటి) ద్వారా 282.80 మెగావాట్ల విద్యుత్‌నూ ఉత్పత్తి చేయనున్నారు. రూ.19,955 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి 57 శాతం పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు రూ.11,320 కోట్లు ఖర్చు చేశారు. 2026 రబీ సీజన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లివ్వాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నది.
గతంలో కేంద్రం కొర్రీలు..
సీతారామ ప్రాజెక్టును బీఆర్ఎస్హయాంలోనే చేపట్టినా.. నీటి కేటాయింపులు, అనుమతుల విషయంలో మాత్రం నాటి సర్కార్ పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అధికారులు అనుమతుల కోసం తీవ్రంగా శ్రమించారు. అనేకసార్లు కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీ, సీడబ్ల్యూసీ అధికారులతో భేటీ అయ్యి నీటి కేటాయింపులు చేయాలని విజ్ఞప్తులు చేశారు. అయితే 157వ టీఏసీ మీటింగ్‌లో కేంద్రం కొర్రీలు పెట్టింది. డిజైన్లపై రివ్యూ చేయాలని సూచించింది. కేంద్రం చెప్పిన నెలరోజుల్లోనే అన్ని టెస్టులు చేసి, డిజైన్లను రివ్యూ చేసి కేంద్రానికి పంపించారు. డిజైన్లు పర్‌ఫెక్ట్‌గా ఉన్నాయని సీడబ్ల్యూసీ హైడల్, సివిల్డిజైన్ డైరెక్టర్ ఆమోదం తెలిపారు. ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేశారు. బ్యారేజీ స్టెబిలిటీ కూడా బీఐఎస్స్టాండర్డ్స్ప్రకారమే ఉన్నాయని తేల్చారు. దీంతో అనుమతులకు లైన్‌క్లియర్ అయింది. మొత్తంగా ఏడాది కాలంగా మంత్రి ఉత్తమ్, అధికారులు పడిన శ్రమకు ఇప్పుడు ఫలితం దక్కింది.