ఆఫర్ పెట్టి వైరల్ అయిన్రు
జనాలను వాళ్ల వైపు తిప్పుకోవడానికి చాలా కంపెనీలు, షాప్‌లు రకరకాల బిజినెస్ ప్లాన్స్ వేస్తూనే ఉంటాయి. అందుకే ఆకర్షణీయమైన ఆఫర్స్ పెడుతుంటారు. వాటికి అట్రాక్ట్ అయి ఆ షాప్‌లో కొనడానికి వెళ్తుంటారు. అలానే వారణాసిలోని మొబైల్ దుకాణం కూడా ఒక ఆఫర్ పెట్టింది. ఆ వింత ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వారణాసిలో ఉన్న అదిత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్లకు ‘మొబి వరల్డ్’ పేరుతో ఒక మొబైల్ దుకాణం ఉంది. తమ బిజినెస్ పెంచుకునేందుకు ‘మా దగ్గర ఏదైనా వస్తువు కొంటే దానికి రకరకాల ఐటమ్స్ ఫ్రీగా ఇస్తాం’ అని ఆఫర్స్ ఇస్తుంటారు. మొబి వరల్డ్ వాళ్లు అదే బాటలో కొంచెం కొత్తగా ఆలోచించారు. అదేంటంటే... వస్తువులకు బదులుగా నిమ్మకాయలు, పెట్రోల్ ఫ్రీగా ఇస్తున్నారు!
‘మా దుకాణానికి రండి. మొబైల్స్, మొబైల్ యాక్సెసరీస్ కొనుక్కోండి. నిమ్మకాయలు, పెట్రోల్ ఫ్రీగా తీసుకెళ్లండి’ అని బ్యానర్‌లు పెట్టి మరీ అడ్వర్టైజ్‌మెంట్ చేస్తున్నారు.
ఇక్కడ 10,000 రూపాయలపైన ఉన్న ఫోన్ కొంటే లీటర్ పెట్రోల్, మొబైల్ యాక్సెసరీలు కొంటే ఐదు నిమ్మకాయలు ఫ్రీగా ఇస్తున్నారు.