రూ.10 వేలు తీసుకుంటూ దొరికిన అధికారి, మరో ఇద్దరు ఉద్యోగులూ అరెస్టు

నిజామాబాద్, వెలుగు : భూమి కొలతల సర్టిఫికెట్ కోసం రూ.10 వేల లంచం తీసుకుంటూ నిజామాబాద్​ జిల్లా సర్వే ల్యాండ్​ రికార్డ్స్​ ఏడీ (అసిస్టెంట్​ డైరెక్టర్​) శ్యాంసుందర్ ​రెడ్డి బుధవారం ​ఏసీబీకి పట్టుబడ్డారు. ఇదే ఇష్యూకు సంబంధించి ఇదివరకే ముడుపులు తీసుకున్న మరో ఇద్దరు ఉద్యోగులు కూడా అరెస్టయ్యారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్​కుమార్ కథనం ప్రకారం..మోర్తాడ్​ మండలం ధర్మోరా గ్రామానికి చెందిన రాజేందర్​తన ఐదు గుంటల ల్యాండ్​లో షెడ్డు వేసుకోవాలనుకున్నాడు. అక్కడి తహసీల్దార్​ ఇచ్చిన నాలా కన్వర్షన్​ ఆర్డర్​ జత చేసి డిమార్కేషన్​ సర్టిఫికెట్, లొకేషన్ ​స్కెచ్ ​మ్యాప్ ​కోసం జిల్లా కేంద్రంలోని ఏడీ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నారు.

వాటిని ఇవ్వడానికి ఏడీ శ్యాంసుందర్​రెడ్డి రూ.10 వేల లంచం డిమాండ్​ చేసి తిప్పించుకుంటున్నాడు. ఈనెల19న రాజేందర్ ​నుంచి ఫైల్ ​మూవ్​మెంట్​ కోసమంటూ ఆఫీస్ ​సూపరింటెండెంట్​వెంకటేశ్ రూ.3 వేలు, జూనియర్ అసిస్టెంట్ రహీమా రూ.2 వేలు లంచం తీసుకున్నారు. ఏడీ కూడా లంచం అడుగుతుండడంతో రాజేందర్​ఏసీబీ అధికారులను కలిశాడు. వారి సూచన మేరకు ఏడీకి లంచం ఇవ్వగా ఏసీబీ అధికారులు రైడ్​ చేసి డబ్బులను ఆఫీసులోని టేబుల్​ డెస్క్​నుంచి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని కరీంనగర్​ కోర్టుకు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు. ఏసీబీ సీఐలు శ్రీనివాస్,నగేశ్​, సిబ్బంది ఉన్నారు.