జీహెచ్ఎంసీలో వేల మంది అధికారులు పని చేస్తున్నారు. ఎవరు ఏం చేయాలన్నా కమిషనర్ ఆదేశాలు ఉంటేనే చేస్తారు. కానీ అది ఒక్కప్పటి మాట. ఇపుడు దానికి పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తోంది. రెండు వారాలు నుంచి వారానికి ఒక్క రోజు అన్ని జోన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ , కాన్ఫరెన్స్ కాల్ తీసుకుంటూ చేయాల్సిన పనులు ఆదేశిస్తున్నారు కమిషనర్ లోకేష్ కుమార్. అది అమలు చేయాల్సిన జోనల్ కమిషనర్ లు, డిప్యూటీ కమిషనర్ లు, ఇంజినీరింగ్ అధికారులు పట్టించుకోనట్లు కనిపిస్తోంది. ఇచ్చిన ఆదేశాలపై తర్వాత వారం వరకూ అప్డేట్ చెయ్యాలని ఆదేశిస్తే .. ఏదో ఒక కారణం చెప్పి సైలెంట్ గా ఉంటున్నారు అధికారులు.
పనులు స్పీడప్ చేయాలని కమిషనర్ ఆదేశిస్తున్నా… ఓకే సార్… అని చెబుతున్న అధికారులు.. మీటింగ్ అయ్యాక పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇచ్చిన పని ఏం చేశారని తర్వాత మీటింగ్ లో అడిగితే.. అధికారుల దగ్గర సమాధానం ఉండటం లేదు. చేస్తున్నాం… చూస్తున్నామని ప్రతి వారం అవే మాటలు వినిపిస్తుండటంతో కమిషనర్ సీరియస్ అయినట్లు సమాచారం.
ఇంటి మ్యూటేషన్ లు ప్రతి సర్కిల్ లో లక్షల్లో పెండింగ్ లో ఉన్నాయి, వాటిని కంప్లీట్ చెయ్యాలని చెప్పినా పరిస్థితి మారడం లేదు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది GHMC. దీంతో ప్రాపర్టీ టాక్స్ పై ఫోకస్ పెట్టాలని చెబితే…. అధికారులు దానిపైనా పూర్తి స్థాయిలో ఫోకస్ చెయ్యట్లేదని… GHMC అధికారులే చెప్తున్నారు. స్వచ్ సర్వేక్షన్ పై ఫోకస్ పెట్టి, ఈసారైనా మంచి ర్యాంక్ సాధించేలా పని చేయాలని ఆదేశిస్తే… లైట్ తీసుకుంటున్నారు బల్దియా డిప్యూటీ కమిషనర్ లు, మెడికల్ ఆఫీసర్లు.
ఇక పబ్లిక్ టాయిలెట్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నట్టుంది పరిస్థితి. సిటీలో వేల సంఖ్యలో పబ్లిక్ టాయిలెట్స్ పెట్టినా.. మెయింటెనెన్సు లేక అధ్వానంగా తయారవుతున్నాయి. దీనిపై ఈమధ్యే డిప్యూటీ కమిషనర్లకు మెమోలు జారీ చేసినా పరిస్థితిలో మార్పు లేదంటే అధికారులు పనితీరు ఎలా ఉందో అర్థమవుతోంది. కాంట్రాక్టర్లకు పని అప్పగించడం వర్క్ ఆర్డర్లు ఇవ్వకుండా వేధించడం, ఆర్డర్లు ఇచ్చినా బిల్స్ ఇవ్వకపోవడంతో… పబ్లిక్ టాయిలెట్స్ మొయింటెనెన్సు లేకుండా పోతున్నాయి. ఇలా కమిషనర్ లోకేష్ కుమార్ ఏ పని చెప్పినా.. చేస్తాం సర్ అని చెప్పడమే గానీ పనులు జరగడం లేదంటున్నారు. జోనల్ లెవల్ అధికారులపై కమిషనర్ చర్యలు తీసుకుంటే తప్ప … బల్దియాలో కింది స్థాయి అధికారులు కూడా పని చేసే పరిస్థితి లేదంటున్నారు ఉద్యోగులు.