కరీంనగర్ జిల్లా భగత్ నగర్లోని తమ స్థలంలో ఇంటి నిర్మాణ అనుమతుల విషయంలో అధికారులు ఇబ్బందులు పెడుతున్నారంటూ కొత్త రాజిరెడ్డి అనే దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ ప్రజావాణిలో మరోసారి బైఠాయించి నిరసన తెలిపారు. తమ ఇంటి నిర్మాణ అనుమతుల విషయంలో అధికారులు కోర్టు ఆదేశాలు కూడా పట్టించుకోవడం లేదని చెప్పారు. ప్రజాప్రతినిధులు ఉండి కూడా తమ సమస్యను పరిష్కరించడం లేదన్నారు. తమ పనులు మానుకుని ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నామన్నారు. కలెక్టర్ తమకు అనుమతులు ఇచ్చినా.. ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
సొంత ఇంటి నిర్మాణం చేపట్టడానికి అన్ని అనుమతులు ఉన్నా.. అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని కొత్త రాజిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అద్దెకు ఉన్న ఇంటిని ఖాళీ చేయమని ఓనర్లు అంటున్నారని, ఇప్పుడు తాము ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. కోర్టు డైరెక్షన్స్ ప్రకారం సర్వే చేయిస్తామని ఆర్డీవో ఆనంద్ కుమార్ హామీ ఇవ్వడంతో రాజిరెడ్డి దంపతులు ఆందోళన విరమించారు.