కాగజ్ నగర్, వెలుగు: వాళ్లిద్దరూ పుట్టుకతో మూగ, చెవిటి వాళ్లు.. అధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు న్యాయ సేవా సంస్థ అధికారులనూ కలిసి పింఛన్ ఇవ్వాలని కోరారు. అర్జీలు పెట్టుకున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆసరా మాత్రం మంజూరు కాలేదు. చివరికి అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా ధర్నా చేసి.. తాము పెట్టుకున్న అర్జీలు, వాటికి అధికారులు ఇచ్చిన సమాధానాలు, వికలాంగులుగా గుర్తిస్తూ జారీ చేసిన సదరం సర్టిఫికెట్లను దహనం చేశారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండల కేంద్రంలో శుక్రవారం జరిగిందీ ఘటన.
గొండ్లపేట్‌కు చెందిన బొయిరే తిరుపతి, గురుగుల అంజన్న.. మూగ, చెవిటి వాళ్లు. సదరం సర్టిఫికెట్ ఉన్నా పెన్షన్ రాక అవస్థలు పడుతున్నారు. అనేక సార్లు నిరసనలు, ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా.. కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక అంబేడ్కర్ విగ్రహం ముందు ధర్నా చేశారు. ఈ క్రమంలో బాధితులు స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వాళ్లను ఎడ్ల బండిపై స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స అందించారు.