సర్వే పేరుతో మోసం చేస్తున్రు.. అధికారుల నిర్బంధం

  • సర్వే పేరుతో మోసం చేస్తున్రు
  • విసుగు చెందిన రైతులు.. అధికారుల నిర్బంధం
  • ముంపు భూముల సర్వే ఎప్పుడో పూర్తయింది
  • రైతులు తిరుగబడినప్పుడల్లా సర్వే అంటున్నరు

పెద్దపల్లి, వెలుగు : కాళేశ్వరం బ్యారేజీల ముంపు గ్రామాల ప్రజలను సర్వే పేరుతో అధికారులు మోసం చేస్తూనే ఉన్నారు. ప్రాజెక్టు స్టార్ట్​ చేసిన ఏడాదే సరస్వతి, పార్వతి బ్యారేజీల కింద ఉన్న పంట పొలాలు మునిగినయి. అప్పుడే అధికారులు ముంపు భూముల సర్వే చేసి పరిహారం ఇస్తామని చెప్పి మొదటి ఏడాది పరిహారం ఇచ్చారు. రైతులు మాత్రం ముంపు భూములను ప్రభుత్వమే తీసుకొని ఎకరానికి రూ. 20 లక్షలు ఇవ్వాలని ఆందోళన చేస్తూనే ఉన్నారు. ప్రాజెక్టు ప్రారంభమై మూడేండ్లయినా బ్యారేజీల కింద భూములు మునుగుతూనే ఉన్నాయి. ఏడాదికి రెండు పంటల చొప్పున 6 పంటలు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు రైతులు అధికారులను నిలదీసినప్పుడల్లా,  భూములను సర్వే చేసి చల్లబరుస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ కాళేశ్వరం ముంపు బాధితులకు న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించడంతో రైతులు ఆనందపడ్డారు. రెండు రోజుల కింద అధికారులు మరోసారి సర్వే అంటూ రావడంతో ఆరెంద గ్రామ ముంపు రైతులు, ఇరిగేషన్​ ఏఈ వెంకటేశంను పంచాయతీలో బంధించారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని రైతులు హెచ్చరిస్తున్నారు. 

సర్వే రిపోర్టు అందలేదంటున్నరు..

కాళేశ్వరం బ్యాక్​ వాటర్​తో మునిగిపోయిన పంటలకు నష్టపరిహారంతో పాటు రెండేళ్లుగా క్రాప్​ హాలిడే పరిహారం కూడా ఇవ్వాలని ముంపు గ్రామాల ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు. ఏటా అధికారులు సర్వే చేస్తున్నారు. ఈసారి కూడా ఇప్పటికే రెవెన్యూ, అగ్రికల్చర్​ ఆఫీస్లర్లు మునిగిన పంటలను పరిశీలించారు. పరిహారం కోసం ఉన్నతాధికారులను అడిగితే సర్వే రిపోర్ట్​లు అందలేదని, అందిన వెంటనే పరిహారం ఇస్తామంటున్నారని రైతులు చెబుతున్నారు. అలాగే భూసేకరణ కోసం అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి అందజేశారు. భూసేకరణపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రైతులు వాపోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారు. వీటి నిర్మాణంలో లోకల్​ స్ట్రీమ్స్​, క్యాచ్  ‌‌ ‌‌మెంటు ఏరియాల నుంచి వచ్చే వరద సామర్థ్యాన్ని అధికారులు గుర్తించకుండా, గోదావరి వరదనే పరిగణనలోకి తీసుకున్నారు.  దీంతో వరద ఉధృతి పెరిగినప్పుడల్లా బ్యాక్​ వాటర్​తో వందలాది ఎకరాల పంటలు నీటమునుగుతున్నాయి. ముఖ్యంగా మంథని, రామగుండం, వెల్గటూరు పొలాలు నీటమునిగిపోతున్నాయి. దీంతో రైతులు పంటలు వేయడం మానేశారు.

సాలుకు రెండు పంటలు పోతున్నయి..

మూడేండ్లుగా సాలుకు రెండు పంటల చొప్పున ఆరు పంటలు వేసినా, రైతుల చేతికి ఒక్క గింజ కూడా రాలేదు. ప్రతీ సీజన్ ‌‌లో పంట నీటిపాలైందని రైతులు చెబుతున్నారు. మొదటి సంవత్సరం నీట మునిగిన తర్వాత అధికారులు వచ్చి నష్టాన్ని లెక్కించి ఎకరానికి రూ. 19వేలు ఇచ్చారని, ఆ తర్వాత నష్టపోయిన ఐదు పంటలకు రూపాయి కూడా ఇయ్యలేదని అన్నదాతలు వాపోతున్నారు.  ఏటా పంటలు మునుగుతుండడంతో అధికారులే పంట వేయవద్దని సూచించారు. క్రాప్​ హాలీడే కింద నష్టపరిహారం ఇస్తామని చెప్పారని రైతులు అంటున్నారు. ఇప్పటి వరకు నీటమునిగిన పంటకు, క్రాప్​హాలిడే కాంపన్సేషన్​ ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కాక ముందు రూ.2 లక్షలతో బోర్లు వేయించుకొని ఏటా రెండు పంటలు పండించే వాళ్లమని, ప్రాజెక్ట్​నిర్మాణం తర్వాత వరద తాకిడికి బోర్లు, పైప్​లైన్లు కూడా మునిగిపోయాయని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్​చేస్తున్నారు. 

బ్యారేజీల కింద ఉన్న భూములు సాగుకు పనికి వచ్చేలా లేవు కాబట్టి,  ప్రభుత్వం ముంపు భూములను తీసుకొని ఎకరానికి రూ. 20 లక్షలు ఇవ్వాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. మంథని మండలంలోని పలు గ్రామాల పరిధిలో  దాదాపు 4000 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి.  పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్​పుట్​ సబ్సిడీ కింద పరిహారం ఇయ్యాలే, కానీ కేసీఆర్​ప్రభుత్వం ఏర్పడినా ఒక్క ఏడాదే పరిహారం ఇచ్చి, ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మూడేండ్లుగా బ్యారేజీల కింద దాదాపు 20 వేల ఎకరాలు నీటమునిగినట్లు లెక్కలు ఉన్నాయి. పంటలు దెబ్బతిన్నాయని ఆఫీసర్లు సర్వేలు చేసి రిపోర్టులు పంపినా సర్కార్​ ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదు. 

ఎన్నిసార్లు సర్వే చేస్తరు

మూడేండ్లుగా పంటలు వేసి నష్టపోతున్నం.. ప్రతీసారి సర్వే చేస్తామని ఆఫీసర్లు వచ్చి రాసుకపోతుండ్రు.. కానీ సమస్య పరిష్కారం అయితలేదు. ఎన్నిసార్లు సర్వే చేస్తరు. బ్యారేజీల కింద భూములు సాగు చేయడం కష్టంగా మారింది. అందుకే సర్కారే భూములు తీసుకొని ఎకరానికి రూ. 20 లక్షలు ఇయ్యాలే.
- సుంకరి బాపు, మల్లారం,  పెద్దపల్లి జిల్లా

అధికారులను అడిగినప్పుడల్లా సర్వే చేస్తున్రు..

అధికారులను నిలదీసినప్పుడల్లా ఆఫీసర్లను పంపించి సర్వే చేయిస్తున్నరు. 15 రోజుల కింద మంథని ఆర్డీవో ఆఫీసు ముట్టడి చేసినందుకు మరోసారి సర్వే అని అధికారులు వచ్చిండ్రు. అందుకే రైతులు విసుగు చెంది అధికారులను గ్రామపంచాయతీలో నిర్బంధించిండ్రు, సర్వేలు బంద్​పెట్టి భూములను పూర్తిగా సర్కార్​ తీసుకొని పరిహారం ఇయ్యాలే.
గూడెపు సుశీల, ఆరెంద,  పెద్దపల్లి జిల్లా