కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మీదుగా దశబ్దాల కిందే నేషనల్ హైవే ఉంది. కాశ్మీర్ టూ కన్యాకుమారి వరకు వెళ్లే ఈ హైవేపై నిత్యం వేలాది వెహికల్స్ రాకపోకలు సాగుతాయి. జిల్లా కేంద్రానికి సమీపంలో పాతరాజంపేట, రైల్వే గేట్ దాటిన తర్వాత కామారెడ్డి వరకు రోడ్డు వంకరగా ఉండేది. దీంతో పాతరాజంపేట శివారులో నుంచి సరంపల్లి దగ్గర నుంచి హౌజింగ్‌బోర్డు కాలనీ వరకు కొత్త హైవే నిర్మాణం చేశారు. దీంతో హౌజింగ్‌బోర్డు కాలనీ నుంచి సరంపల్లి శివారు వరకు 4 కి.మీ మేర ఉన్న పాత రోడ్డు వృథాగా మారింది. ఈ రూట్‌లో రాకపోకలు కూడా తగ్గాయి. స్థానికులు మాత్రమే పంట పొలాలకు వెళ్లుంటారు.
క్రమంగా కనుమరుగు..
పాత హైవేకు ఇరువైపుల ఉన్న పంట పొలాలను ఇటీవల కొందరు కొనుగోలు వెంచర్లు చేసి అమ్మడంతో నిర్మాణాలు మొదలు పెట్టారు. దీంతో ఆర్‌అండ్‌బీ పరిధిలో ఈ రోడ్డు కుచించుకుపోతుంది. 100 పీట్ల రోడ్లు రోజురోజుకూ తగ్గుతూ 50 ఫీట్లకు చేరింది. రోడ్డు భాగంలోనే కొందరు బోర్లు వేశారు. రేకులతో షేడ్ల నిర్మాణాలు చేశారు.
విలువైన భూమి..
కామారెడ్డి టౌన్ రోజురోజుకూ విస్తరిస్తోంది. దీంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. పాత హైవే ఏరియాలో గజానికి రూ. 6 వేల నుంచి రూ.20 వేల వరకు రేటు ఉంది. దీంతో కొందరు 100 పీట్ల రోడ్డును రెండు వైపుల నుంచి వొత్తుకొస్తూ కబ్జా చేస్తున్నారు. ఈ ఆక్రమణలపై గతంలో ఆర్అండ్‌బీ ఆఫీసర్లకు ఫిర్యాదులు కూడా చేశారు. కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని పాత హైవేను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
అక్రమణ లేకుండా చర్యలు
పాత రోడ్డును పరిశీలన చేస్తూనే ఉంటాం. రోడ్డుకు ఒక పక్కన అక్కడక్కడ పంటలు సాగు చేశారు. రోడ్డు హద్దు రాళ్లు ఉన్నాయి. రోడ్డు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకుంటాం.
- శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ డీఈ