కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన నది పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద పరవళ్లు తొక్కుతోంది. దీంతో వరద ప్రవాహానికి అనుగుణంగా తెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు. రెండు ప్రాజెక్టుల్లోనూ గరిష్ట స్థాయిలో నీరు నిల్వ ఉంచడంతో.. వస్తున్న వరదను వస్తున్నట్లే విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది.  

మహారాష్ట్ర, కర్ణాటక పరిధిలోని కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలం ప్రాజెక్టుకు వరద  ఉరకలెత్తుతోంది. నారాయణపూర్, జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరడంతో డ్యాం వద్ద 4 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో లక్షా 39వేల 713 క్యూసెక్కులు ఉండగా.. విద్యుత్ ఉత్పత్తితోపాటు 4 గేట్ల ద్వారా మొత్తం లక్షా 74వేల 943 క్యూసెక్కుల నీటిని దిగువన నదిలోకి విడుదల చేస్తున్నారు.  శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం గరిష్ట స్థాయిలో 885 అడుగుల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతుండడంతో  ప్రాజెక్టులోని కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

మరోవైపు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. సాగర్ డ్యాం వద్ద 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 80వేల 580 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 2లక్షల 14 వేల  క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో  లక్షా 31 వేల క్యూసెక్కులుగా ఉంది. సాగర్ డ్యాం గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.60 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 309 టీఎంసీల నీరు నిల్వ ఉంచుతూ నీటి విడుదల కొనసాగిస్తున్నారు.