కెఎమ్‍సీలో ర్యాగింగ్ లేదని డీఎంఈ ఎట్లంటడు.? : ప్రీతి తండ్రి

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం నిమ్స్‭లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్య పరిస్థితి గురించి.. డీఎంఈ రమేష్ రెడ్డి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రమేష్ రెడ్డి చెప్పారు. ర్యాగింగ్ కాదు.. వేధింపు ఆరోపణలపై విచారణ జరుగుతోందన్నారు. మామూలుగా జూనియర్‭తో సీరియర్ ఎలా చెబుతారో ఇక్కడ కూడా అదే జరిగిందని ఆయన చెప్పారు. అయితే.. సీనియర్ కొంచెం హార్ష్‭గా ప్రవర్తించినట్లు తెలుస్తోందని రమేష్ రెడ్డి అన్నారు. 

డీఎంఈ వ్యాఖ్యలపై ప్రీతి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాగింగ్ జరగలేదని డీఎంఈ చెప్పడం తప్పని ఆయన అన్నారు. తనను ర్యాగింగ్ చేస్తున్నారని ప్రీతి ఏడుస్తూ తమకు చెప్పడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ప్రీతి మొబైల్ చెక్ చేస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయని చెప్పారు. కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన చెందారు. ఇప్పటికే ప్రీతి మొబైల్‭లో డేటా అంతే డిలీట్ చేసి ఉంటారని ఆమె తండ్రి నరేందర్ అన్నారు. మరోవైపు ప్రీతి సెల్ ఫోన్ ను సీజ్ చేశామని పోలీసులు చెబుతున్నారని నరేందర్ ఆరోపించారు.