పదేండ్లుగా అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్
ఆసిఫాబాద్ ,వెలుగు : ముప్పై ఏండ్ల కింద ఆదివాసీ పిల్లలకు విద్యాబుద్దులు చెప్పేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఏకైక కొలాం గిరిజన రెసిడెన్షియల్ స్కూల్‌ను ఓపెన్‌కాస్ట్ మింగేసింది. ఖైరిగూడా ఓపెన్ కాస్టు కింద ఈ రెసిడెన్షియల్ స్కూల్ ముంపునకు గురైంది. దానికి బదులు కొత్త హస్టల్, స్కూలు నిర్మించేందుకు ప్రభుత్వం ఫండ్స్ మంజూరు చేసినా అధికారులు ఇంతవరకు పూర్తి చేయలేదు. ఫలితంగా ఆదిమ గిరిజన తెగకు చెందిన పిల్లలు చదువులకు దూరమవుతున్నారు.
ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని దంతన్ పల్లిలో 1984 లో గవర్నమెంట్ కొలాం రెసిడెన్షియల్ స్కూలును ఏర్పాటు చేసింది. ఇక్కడ వందలాది మంది ఆదివాసీలు స్టూడెంట్స్ ఆశ్రయం పొంది.. చదువుకున్నారు. ఖైరిగుడ ఓపెన్ కాస్ట్ ను ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయడంతో కొలాం గ్రామమైన దంతన్ పల్లి గ్రామాన్ని 1993లో అక్కడ నుంచి తొలగించారు. ఆ ఊరిలో ఉన్న ఆదివాసీలు అధికారులు మరో ప్రాంతంలో పునరావాసం కల్పించారు. పునరావాస గ్రామంలోనే కొలాం స్కూలును ఏర్పాటు చేయాలంటూ గవర్నమెంట్ ఐటీడీఏకు రూ. 72 లక్షలు రిలీజ్ చేసింది. 1993లోనే రెసిడెన్షియల్స్కూలు నిర్మాణాన్ని ప్రారంభించి.. బిల్డింగ్ పనులు స్లాబ్ వరకు పూర్తి చేశారు.
ఒక వాటర్ ట్యాంక్ కూడా నిర్మించారు. ఆ తర్వాత నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో దంతనపల్లికి చెందిన స్టూడెంట్లే కాకుండా జిల్లాలోని ఇతర కొలాం గ్రామాల పిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దంతనపల్లి నుంచి కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకుంటుండగా.. చాలామంది పనిపాటల్లో పడి చదువుకు దూరమవుతున్నారు. ఆదిమ జాతి పిల్లలకోసం ఉన్న ఒకే ఒక్క ఆశ్రమ పాఠశాల పట్ల అధికారుల తీరుపై ఆదివాసీ సంఘాలు మండిపడుతున్నాయి. బిల్డింగ్ పనులు కంప్లీట్ చేయాలని ఎన్ని సార్లు ఐటీడీఏ అధికారులను కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా బిల్డింగ్ పనులు కంప్లీట్ చేసి వచ్చే విద్యాసంవత్సరం నాటికైనా ప్రారంభించాలని గ్రామస్తులు కోరుతున్నారు.