స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఉదయం 11.30 గంటలకు ఎక్కడి వారక్కడే నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించారు. జిల్లా, మండలకేంద్రాల్లో సామూహిక గీతాలాపన చేపట్టారు. విద్యార్థులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
- వెలుగు, నెట్వర్క్
అరిగోస పడుతున్న అండర్‌గ్రౌండ్ కార్మికులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలోని ఏకైక అండర్‌గ్రౌండ్ గనిలో సమస్యలను పరిష్కరించకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగూడెంలోని పీవీకే–5 ఇంక్లైన్ అండర్‌గ్రౌండ్ మైన్‌లో సరైన వెంటిలేషన్, మ్యాన్ రైడింగ్ లేకపోవడంతో పని ప్రదేశాల్లో తిప్పలు పడుతున్నామని కార్మికులు వాపోతున్నారు. కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా అందుబాటులో లేవని ఆరోపిస్తున్నారు. ఇక ఆఫీసర్ల పర్యవేక్షణ లేక ఉత్పత్తి దెబ్బతిని దాదాపు రూ.100 కోట్ల మేర నష్టాల
పాలైంది.
అన్నీ సమస్యలే..
బెల్ట్ మెయింటెనెన్స్ సక్రమంగా లేకపోవడం, వెంటిలేషన్ ప్రాబ్లం ఉందని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని కార్మికులు వాపోతున్నారు. ఎయిర్ క్రాసింగ్స్, వెంటి లేషన్ డోర్స్ సరిగా ఏర్పాటు చేయకపోవడంతో వెంటి లేషన్ సమస్యతో కార్మికులు ఇబ్బందులు పడ్తున్నారు. మ్యాన్ రైడింగ్ లేకపోవడంతో కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి రావాల్సి వస్తోందని, దీంతో నీరసించి పోతున్నామని వాపోతున్నారు. మంచినీళ్ల కోసం తిప్పలు పడుతున్నామని అంటున్నారు. ప్రతి ఏడాది ఖాళీలను ప్రకటిస్తూ యాక్టింగ్‌పై పని చేస్తున్న వారికి ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రూఫ్ నుంచి హాట్ వాటర్ వస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. మైన్‌లో కార్మికులు అవసరం ఉన్నా పైరవీలతో 150 మందికి పైగా కార్మికులు సర్ఫేస్‌లో వివిధ డిపార్ట్మెంట్లలో పని చేస్తున్నారు. ఇటీవల ప్రాజెక్ట్, ప్లానింగ్ డైరెక్టర్ బలరాం మైన్‌లో పరిస్థితిని పరిశీలించి అధికారుల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
మూడేండ్ల నుంచి నష్టాలు..
1952లో ఈ మైన్‌ను ఏర్పాటు చేశారు. పదేండ్ల కిందటి వరకు లాభాలతో పాటు వెయ్యి మందికి పైగా కార్మికులతో కళకళలాడింది. ప్రస్తుతం 850 మంది కార్మికులు పని చేస్తుండగా, రూ. వంద కోట్ల నష్టంతో నడుస్తోంది. మూడేండ్ల నుంచి నష్టాలు పెరగడంతో యాజమాన్యం మైన్ ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం మైన్‌లో పని చేస్తున్న కార్మికుల జీతాలకు సరి పోయే స్థాయిలోనూ బొగ్గు ఉత్పత్తి కావడం లేదని అంటున్నారు. ఉత్పత్తి పెంచాలనే లక్ష్యంతో రూ. 130 కోట్లతో ప్రైవేట్ సంస్థతో కలిసి పీవీకే–5 ఇంక్లైన్లో కంటిన్యూస్ మైనర్ యంత్రాన్ని రెండేండ్ల కిందట ఏర్పాటు చేశారు. రోజుకు 1100 టన్నుల బొగ్గు లక్ష్యం కాగా, 500 టన్నుల నుంచి 600 టన్నుల బొగ్గును మాత్రమే తీస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రం 800 టన్నుల నుంచి వెయ్యి టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి అవుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో 5.50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా, 2.11లక్షల టన్నుల బొగ్గును మాత్రమే ఉత్పిత్తి అయింది. ఏప్రిల్ నుంచి 1.80 లక్షల టన్నుల బొగ్గు ప్రొడక్షన్ చేయాల్సి ఉండగా, 84 వేల టన్నుల బొగ్గు మాత్రమే ఉత్పత్తి చేశారు. అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్కు బొగ్గు రవాణా చేసేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి టన్నెల్ తవ్వకాలు మొదలు పెట్టి ఏళ్లు దాటుతున్నా పని పూర్తి కాలేదు. పనులు స్లోగా జరుగుతున్నా కాంట్రాక్టర్‌పై ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
సమస్యలు పరిష్కరిస్తున్నాం..
పీవీకే–5 ఇంక్లైన్ మైన్‌లో ఉత్పత్తి పెంచేందుకు ప్లాన్ చేస్తున్నాం. మైన్‌లో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. మ్యాన్ రైడింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. వెంటి లేషన్ సౌకర్యం మెరుగుపరిచాం.
- సీహెచ్ నర్సింహారావు, జీఎం
రామాలయం భూముల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత
భద్రాచలం,వెలుగు: భద్రాచలం రామాయణం థీమ్ పార్కు భూముల్లో ఆక్రమణదారులు రెండో రోజు కూడా తిష్ట వేశారు. వారిని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం స్టాఫ్, ఎస్పీఎఫ్, పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం కూడా ఆక్రమణదారులు భూముల్లోకి రావడంతో ఈవో శివాజీ ఎటపాక పోలీసుల సాయంతో బందోబస్తును ఏర్పాటు చేశారు. కర్రలతో పాకలు నిర్మించుకునేందుకు ఆక్రమణదారులు ప్రయత్నించారు. వందలాదిగా ఒకేసారి రావడంతో దేవస్థానం సిబ్బందికి, ఆక్రమణదారుల మధ్య తోపులాట చోటు చేసుకొని ఉద్రిక్తత కొనసాగింది. ఆక్రమణదారులతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వినీత్ ఒక ప్రకటనలో సూచించారు. మంగళవారం రాత్రికి గోదావరి ప్రవాహం 55 అడుగులకు చేరుకోవచ్చని తెలిపారు. దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి, ఎం. కాశీనగరం, గంగోలు, చర్ల మండలం దండుపేట కాలనీ, వీరాపురం, పెద్దిపల్లి, అశ్వాపురం మండలం నెల్లిపాక బంజరా, రామచంద్రాపురం, బట్ట మల్లయ్య గుంపు, కుమ్మరిగూడెం కింది గుంపు, టేకులగుట్ట, మణుగూరు మండలం చిన్నరాయిగూడెం, కమాలాపురం, అన్నారం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని చెప్పారు. చర్ల, దుమ్ముగూడెం వెళ్లే రహదారులు జల దిగ్భంధం అవుతున్నాయని తెలిపారు.
జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణను మంగళవారం సస్పెండ్ చేశారు. ఫెస్టివల్ సెక్షన్లో పని చేస్తున్న సత్యనారాయణ గత కొంతకాలంగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో విచారణ చేపట్టిన ఈవో శివాజీ అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
న్యాయవాదుల విధుల బహిష్కరణ
మధిర, వెలుగు: నల్గొండ జిల్లాలో న్యాయవాది గాదె విజయ రెడ్డి హత్యను నిరసిస్తూ మంగళవారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు. , వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. పుల్లారావు, న్యాయవాదులు వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి కోటేశ్వరరావు, భైరవబొట్ల శ్రీనివాసరావు, చావలి రామరాజు, కట్ట పూర్ణచంద్రరావు, మందడపు మధుసూదనరావు, చింతల గోపాల్, నెల్లూరు రవి,
గంధం శ్రీనివాసరావు, మేడేపల్లి సతీశ్, పళ్లపోతుల కృష్ణారావు, పి. శ్రీనివాసరావు, జింకల రమేశ్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడిగా మధుచంద్
పాల్వంచ,వెలుగు: టీఆర్ఎస్వీకొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షుడిగా పాత పాల్వంచకు చెందిన భత్తుల మధుచంద్ నియమితులయ్యారు. మంగళవారం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నివాసంలో నిర్వహించిన టీఆర్ఎస్వీ మీటింగ్‌లో మధుచంద్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. జిల్లా కోఆర్డినేటర్ సంకుబాపన అనుదీప్ తో కలిసి ఎమ్మెల్యే నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీ లీడర్లు ఎం రాజుగౌడ్, ఎన్ఎన్ రాజు, బాదావత్ శాంతి, మండే వీరహనుమంతరావు, బత్తుల వీరయ్య పాల్గొన్నారు.
‘డబుల్’ ఇండ్ల కేటాయింపుపై సర్వే
కూసుమంచి, వెలుగు: కూసుమంచి గ్రామానికి చెందిన 36 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లను గ్రామసభలో ఎంపిక చేసి కేటాయించారు. డబుల్ ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా జరగలేదని, 20మంది అనర్హులకు ఇచ్చారని గ్రామానికి చెందిన కొందరు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సర్వే చేయాలని కలెక్టర్ ఆదేశించడంతో గృహ నిర్మాణ శాఖ అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్ కృష్ణారెడ్డి లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. ఈ నివేదికను కలెక్టర్‌కు అందించనున్నట్లు తెలిపారు.
దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం చెల్లించాలి
సత్తుపల్లి, వెలుగు: సింగరేణి బ్లాస్టింగ్లతో దెబ్బతిన్న ఇళ్లకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కొటూరి మానవతారాయ్ డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 18న ఉదయం11 గంటలకు వెంగళరావు నగర్ లో దీక్ష చేపడతానని చెప్పారు. సింగరేణి సంస్థ టన్నుకు రూ.100 చొప్పున సత్తుపల్లి ప్రజల సంక్షేమం కోసం కలెక్టర్ ఖాతాలో డబ్బులు జమ చేస్తుందని తెలిపారు. ఈ నిధుల దుర్వినియోగంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే నిరుపేదలకు కనీసం ఇంటి స్థలాలు ఇవ్వలేదని, ఇళ్లు కట్టించలేదని ఆరోపించారు. ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ సభ్యుడు రావి నాగేశ్వరరావు, సొసైటీ ఉపాధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, గాదిరెడ్డి సుబ్బారెడ్డి, ఐ కృష్ణ, ఎండీ ఫజల్ బాబా, మానుకోట ప్రసాద్, మహేంద్ర బాషా, మామిళ్ల సత్యనారాయణ, సమద్, దండు యోహాన్, సలీమ్ పాషా, వాసు,రామచంద్ర రావు, అక్బర్ పాల్గొన్నారు.
మాజీ ప్రధాని వాజ్‌పేయికి ఘన నివాళి
మధిర, వెలుగు: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా మంగళవారం బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి చిలివేరు సాంబశివరావు మాట్లాడుతూ నవ భారత నిర్మాణానికి వాజ్‌పేయి బాటలు వేశారని కొనియాడారు. పార్టీ నాయకులు పాపట్ల రమేశ్, గుండా చంద్రశేఖర్ రెడ్డి, రామిశెట్టి నాగేశ్వరావు, కాసిన నాగభూషణం,శివరాజు సుమంత్, కోనా నరసింహారావు, పగడాల నాగేంద్ర బాబు, దోర్నాల రవీంద్ర పాల్గొన్నారు.
కృష్ణయ్య అనుచరులపై కేసు నమోదు
ఖమ్మం రూరల్, వెలుగు: తమ్మినేని కోటేశ్వరరావు ఇంటిపై దాడికి పాల్పడిన 17 మందిపై పోలీసులు కేసు పెట్టారు. వేర్వేరుగా అందిన ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై శంకర్రావు తెలిపారు. తమ్మినేని కృష్ణయ్య హత్య అనంతరం ఆయన అనుచరులు తన భర్త ఇంట్లో లేని సమయంలో ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులు ధ్వంసం చేశారని, తన భర్తను హత్య చేస్తామని హెచ్చరించారని కోటేశ్వరరావు భార్య విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిలో సుమారు రూ.80 లక్షల విలువైన వస్తువులు ధ్వంసమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నెల్లూరి వినోద్, ఉన్నం సాయి, కొండ వీరబాబు, వేగినాటి వెంకటి, వేగినాటి ఉదయ్, వేగినాటి మహేశ్, జాలా ఉపేందర్, బోడపట్ల రమేశ్, జలగం సైదులు, నూకల సాయి, మారబోయిన శ్రీను, నూకల సతీశ్, ఇల్లందుల సైదులు, మహ్మద్ ముస్తఫా, గజ్జి శివ, బోడపట్ల రేణు, షేక్ జానీమియా (మద్దులపల్లి)పై ఫిర్యాదు చేశారు. అలాగే క్వారీపై దాడి చేసి ప్రొక్లైన్‌ను కాల్చివేయడంతో, రూ.1.50 కోట్ల నష్టం వాటిల్లిందని కోటేశ్వరరావు వద్ద సూపర్ వైజర్‌గా పని చేస్తున్న బోడపట్ల ఉపేందర్ ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఇదిలాఉంటే కృష్ణయ్య హత్య అనంతరం అతని అనుచరులు తన ఇంటిపై దాడి చేసి బీరువా పగులగొట్టి రూ. 3 లక్షల నగదు, రూ.60 వేల విలువైన వస్తువులు ధ్వంసం చేశారని బోడపట్ల ఈశ్వరమ్మ ఫిర్యాదు చేసింది.
దాడి చేసినవారిపై కేసు పెట్టాలి
మధిర, వెలుగు: ప్రజా సంగ్రామ యాత్రపై టీఆర్ఎస్ నాయకులు డాడి చేయడాన్ని బీజేపీ జిల్లా కార్యదర్శి చిలివేరు సాంబశివరావు, మధిర పట్టణ అధ్యక్షుడు పాపట్ల రమేశ్ ఖండించారు. దాడిని ఖండిస్తూ మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహంసెంటర్లో నిరసన తెలిపారు.గుండా చంద్రశేఖర్ రెడ్డి, రామిశెట్టి నాగేశ్వరరావు, రామయోగేశ్వరరావు, కోన నరసింహారావు, నాగభూషణం, పగడాల నాగేంద్రబాబు, దోర్నాల రవీందర్,శివరాజ్, సుమన్ పాల్గొన్నారు.
చండ్రుగొండ: రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావడాన్ని జీర్ణించుకోలేక టీఆర్ఎస్ లీడర్లు దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు భోగి కృష్ణ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ ప్రజాసంకల్ప యాత్రపై టీఆర్ఎస్ లీడర్లు దాడి చేయడాన్ని ఖండించారు. దాడులకు సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పారు.
ముదిగొండ: ప్రజా సంకల్ప యాత్రపై టీఆర్ఎస్ నాయకుల దాడిని ఖండిస్తూ ముదిగొండలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పసుపులేటి రాజశేఖర్ ఆధ్వర్యంలో దహనం చేశారు. జిల్లా అధ్యక్షుడు అనంతు ఉపేందర్, పార్టీ లీడర్లు కొమ్మినేని సుధాకర్, యారదేశి రామకృష్ణ, బోయినపల్లి ప్రభాకర్, జగదీష్, అల్లిక శ్రీకాంత్, వి గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాసరావు, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.
ఖమ్మం టౌన్: టీఆర్ఎస్ దాడిని నిరసిస్తూ ఖమ్మం సిటీలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ నేతలు కుమిలి శ్రీనివాసరావు, పిల్లలమర్రి వెంకట్, రుద్ర ప్రదీప్, మారుతి వీరభద్ర ప్రసాద్, షేక్ పాషా, వీరవెల్లి రాజేశ్, గడిల నరేశ్, డీకొండ శ్యాంసుందర్, రీగన్ ప్రతాప్, దాసరి శివ, బండారు శీను, బచ్చు సతీశ్, ఊరుకొండ ఖాదర్, పాలపు రాము పాల్గొన్నారు.
ఏడు వెహికల్స్ సీజ్
పాల్వంచ,వెలుగు: అనుమతులు లేకుండా ఇసుక, మట్టిని తరలిస్తున్న ఐదు లారీలతో పాటు పీడీఎస్ బియ్యం తరలిస్తున్న ఆటో ట్రాలీ, ప్యాసింజర్ఆటోలను సీజ్ చేసినట్లు టౌన్ ఎస్సై నరేశ్ తెలిపారు. ఆటోలో తరలిస్తున్న 11 క్వింటాళ్ల పీడీఎఫ్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇటీవల రూ.6 లక్షల విలువ చేసే గుట్కా సీజ్ చేశామని తెలిపారు. అక్రమ వ్యాపారాలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఎక్కువ కేసులు నమోదైన వారిపై రౌడీ షీట్ తెరుస్తామని
హెచ్చరించారు.
కాంగ్రెస్ లీడర్లతో జలగం భేటి
చండ్రుగొండ, వెలుగు: మాజీ మంత్రి జలగం ప్రసాదరావు మంగళవారం చండ్రుగొండలో జడ్పీటీసీ వెంకటరెడ్డి ఇంట్లో మండల కాంగ్రెస్ లీడర్లతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ లీడర్లతో భేటీ కావడంలో అంతర్యమేమిటన్న చర్చ జరుగుతోంది. గిరిజనులకు వ్యవసాయ మోటార్ల పంపిణీ విషయమై చర్చించినట్లు జడ్పీటీసీ అంటున్నారు. ఇదిలాఉంటే అధికార పార్టీ లీడర్లను కలవకుండా వెళ్లిపోయారు. జలగం అనుచరులకు ముందే సమాచారం ఇవ్వగా, ఆయన వచ్చీరాగానే అక్కడికి చేరుకున్నారు.