Champions Trophy 2025: లాహోర్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవం.. రోహిత్ పాకిస్థాన్‌కు వెళ్తాడా..?

Champions Trophy 2025: లాహోర్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవం.. రోహిత్ పాకిస్థాన్‌కు వెళ్తాడా..?

వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవం లాహోర్‌లో జరగనుందని సమాచారం. ఫిబ్రవరి 16న మహారాజా రంజిత్ సింగ్ నిర్మించిన హజురీ బాగ్ కోటలో ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. ఐసీసీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా ఫిబ్రవరి 16 దాదాపుగా ఖాయమనే వార్తలు వస్తున్నాయి. మొదట ఫోటో షూట్ ఉంటుందని.. ఆ తర్వాత అన్ని జట్ల కెప్టెన్లతో విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రారంభోత్సవ వేడుకలకు హాజరు కావడం అనుమానంగా మారింది. 

హజూరి బాగ్ అనేది పాకిస్థాన్ లో అతి పెద్ద ఉద్యానవనం. మహారాజా రంజిత్ సింగ్ పాలనలో ఇది నిర్మించబడింది. ఇది పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఉంది. ప్రముఖులు, క్రికెట్ లెజెండ్‌లు, పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులు ఈ వేడుకకు ఆహ్వానించబడ్డారు. గత నెలలో హజూరీ బాగ్‌లో పాకిస్థాన్ సూపర్ లీగ్ కూడా ప్రారంభమైంది. 1996 తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ తొలిసారి పాకిస్థాన్ వేదికగా జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ జరగనుంది. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిధ్యమివ్వడం.. డిఫెండింగ్ ఛాంపియన్ కూడా పాకిస్థాన్ కావడంతో ఆ దేశానికి ఈ టోర్నీ ప్రత్యేకంగా మారనుంది. 

Also Read :- 38 ఏళ్ళ వయసులో డబుల్ సెంచరీ.. సచిన్ రికార్డ్ బద్దలు కొట్టిన ఆసీస్ ఓపెనర్

ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు.. అంటే 19 రోజుల పాటు అభిమానులను అలరించనుంది. ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా ఆతిథ్య పాకిస్థాన్ జట్టు.. ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో భారత జట్టు.. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో పాకిస్తాన్ నిర్వహించనుంది. టోర్నమెంట్‌కు యూఏఈ భారత్ ఆడే మ్యాచ్ లకు వేదిక కానుంది.