మునుగోడులో గెలుపు కోసం పోరాడుతున్న కాంగ్రెస్

  • హుజూర్ నగర్, నాగార్జునసాగర్ ను కైవసం చేసుకున్న టీఆర్ఎస్
  • నకిరేకల్ ఎమ్మెల్యే పార్టీ మారడంతో కష్టాలు
  • మునుగోడునైనా దక్కించుకోవాలని ఆరాటం

నల్గొండ, వెలుగు: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ​దిగ్గజ నేతలకు మునుగోడు ఉప ఎన్నిక అగ్నిపరీక్షగా మారింది. ఇంతకుముందు జరిగిన హుజూర్​నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​చావు దెబ్బతిన్నది. ప్రస్తుతం కాంగ్రెస్​కు కంచుకోట అని చెప్పుకునే మునుగోడులో కూడా ఉప ఎన్నిక జరుగుతుండడంతో సిట్టింగ్ ​స్థానాన్ని కాపాడుకునేందుకు సీనియర్ ​లీడర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలని కొట్లాడుతున్నారు.

హుజూర్​నగర్​లో తొలి ఓటమి 

నల్గొండ జిల్లాలోని హుజూర్​నగర్​లో తొలి ఉప ఎన్నిక జరిగింది. 2018లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్​రెడ్డి  2019లో నల్గొండ ఎంపీగా గెలవడంతో ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో ఉత్తమ్ భార్య పద్మావతి పోటీ చేయగా..సీనియర్​ లీడర్లు, ఎంపీలు రేవంత్​రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్​బాబు హోరాహోరీ ప్రచారం చేశారు. అయినా ఫలితం దక్కలేదు. 2018లో  ఓడిపోయిన టీఆర్ఎస్​అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఈ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్​కు షాక్​ ఇచ్చారు.  

సాగర్​లో ‘జానా’కు తప్పలేదు 

ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్​లో ఉప ఎన్నిక వచ్చింది. 2021లో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​నేత జానారెడ్డి పోటీ చేశారు. గతంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2018లో ఓడిపోయినా.. ఉప ఎన్నికల్లో గెలవడం దాదాపు ఖాయమని అంతా భావించారు. కానీ, ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ గెలిచారు. జానారెడ్డి విజయం కోసం రేవంత్​రెడ్డితో సహా కాంగ్రెస్​యంత్రాంగం అంతా సాగర్​లో మకాం వేసి రెండు నెలల పాటు శ్రమించినా జానాకు ఓటమి తప్పలేదు.  

ఇప్పుడు మునుగోడులో..

2018 ఎన్నికల్లో కాంగ్రెస్​ మూడు చోట్ల గెలిచింది. హుజూర్​నగర్​ బైపోల్​లో ఓడిపోగా.. నకిరేకల్​ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్​లో చేరారు. కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి రాజీనామాతో జిల్లాలో మిగిలిన మునుగోడు  స్థానాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పటి ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలను తట్టుకుని సిట్టింగ్​స్థానాన్ని దక్కించుకోవడం ఆ పార్టీకి పెద్ద టాస్క్​లా మారింది.

వార్డు మెంబర్లు, సర్పంచ్​లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో సహా కాంగ్రెస్ కేడర్​చాలా వరకు రాజగోపాల్​ రెడ్డి వెంటే పోవడంతో ఎన్నికల్లో గెలవడం కత్తి మీద సాములా మారింది. వారిని ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్​కాలేదు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు వస్తుండడంతో ఈ ఎన్నిక కాంగ్రెస్​కు కీలకమైనది.

మహిళ సెంటిమెంట్​ను వాడుకోవడంతో పాటు పార్టీ ముఖ్య క్యాడర్​అంతా పాల్వాయి స్రవంతి గెలుపు కోసం కష్టపడుతున్నారు. ఈ ఎన్నికలో గెలిస్తే వచ్చే సాధారణ ఎన్నికల్లో తమకు అధికారంలోకి వచ్చే సత్తా ఉందన్న మెసేజ్​ఇచ్చినట్టు అవుతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.