
- ఔటర్పైనా గుంతలు
- శంషాబాద్ నుంచి పటాన్ చెరు వెళ్లే రూట్లో ఖరాబైన రోడ్డు
- గుంతలు పూడ్చడం లేదని వాహనదారుల ఆందోళన
- ఓఆర్ఆర్ను ఐఆర్బీ సంస్థకు లీజుకు ఇచ్చిన ప్రభుత్వం
- నామమాత్రంగా పనులు.. మళ్లీ ఏర్పడుతున్న గుంతలు
హైదరాబాద్, వెలుగు : వెహికల్స్ హైస్పీడ్‌తో దూసుకెళ్లే ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) కూడా గుంతలమయంగా మారింది. శంషాబాద్ నుంచి పఠాన్ చెరు వెళ్లే రూట్లో రోడ్డంతా ఖరాబైంది. 100 స్పీడ్ లిమిట్ ఉన్న 3, 4 లేన్లపైనే ఎక్కువగా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనాదారులు 120 స్పీడ్ లిమిట్ ఉన్న 1, 2 లేన్ల పైనుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రోడ్డుపై గుంతలు ఉండడంతో సడెన్‌గా బ్రేకులు వేయాల్సి వస్తోందని, దీంతో యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఓఆర్ఆర్ పై స్పీడ్‌ను 120కి పెంచుతూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుందని, కానీ రోడ్డు ఖరాబ్ కావడంతో కొన్నిచోట్ల 80కి మించి వెళ్లే పరిస్థితి లేదని అంటున్నారు. ‘‘గత నెలలో కురిసిన వర్షాలకు గుంతలు ఏర్పడగా, కేవలం పాట్ హోల్స్ ని మాత్రమే పూడ్చారు. ఇప్పుడు తిరిగి అదే పరిస్థితి ఏర్పడింది. దారిపొడవునా ఎక్కడ చూసినా గుంతలే కనిపిస్తున్నాయి. ఔటర్ పై ఎక్కువగా భారీ వాహనాలు తిరుగుతాయి. దీంతో గుంతలు మరింత ఎక్కువవుతున్నాయి” అని చెబుతున్నారు. ఔటర్ ను లీజుకు ఇచ్చిన హెచ్ఎండీఏ అధికారులు... ఆ సంస్థ రిపేర్లు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
30 ఏండ్లకు లీజు..
ఓఆర్ఆర్ను రూ.7,380 కోట్లకు 30 ఏండ్ల పాటు ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ సంస్థకు టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్(టీఓటీ) పద్ధతిలో హెచ్ఎండీఏ లీజుకు ఇచ్చింది. ఆ సంస్థ పోయిన నెల12 నుంచే లీజు బాధ్యతలు చేపట్టింది. ఆ రోజు నుంచి ఎక్కడ గుంతలు ఉన్నా పూడ్చాల్సిన బాధ్యత ఐఆర్బీ సంస్థపైనే ఉంది. కానీ, బాధ్యతలు చేపట్టి నెల రోజులు దాటినా ఓఆర్ఆర్పై ఉన్న గుంతలను పూడ్చడం లేదని, టోల్ వసూలు చేస్తున్న సంస్థ రోడ్లను ఎందుకు పట్టించుకోవడం లేదని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. పోయిన నెలలో వర్షాలు తగ్గినంక నామమాత్రంగా మరమ్మతులు చేపట్టారని, కానీ మళ్లీ అదే చోట గుంతలు పడుతున్నాయని అంటున్నారు. దీనిపై ఓఆర్ఆర్ సీజీఎం రవీందర్ వివరణ కోరగా.. పనులు చేస్తున్నారని చెప్పారు.
గల్లీ రోడ్డులా మారింది..
ఔటర్ రింగ్ రోడ్డు గల్లీ రోడ్డులా మారింది. రోడ్డుపై ఇన్ని గుంతలు పడినా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఓర్ఆర్ఆర్ ఎక్కి దిగితే రూ.20 టోల్ వసూలు చేస్తున్నారు. రోడ్డు వేసేంత వరకు టోల్ వసూల్ చేయొద్దు. రోడ్డు వేశాకే టోల్ తీసుకోవాలె.
- సంతోష్ రెడ్డి, వాహనదారుడు
స్పీడ్ లిమిట్ పెంచి ఏం ఫాయిదా?
ఔటర్ మీద మొన్నటి దాక వంద స్పీడ్ లిమిట్ ఉండేది. ఇప్పుడు 120కి పెంచారు. కానీ స్పీడ్ లిమిట్ పెంచి ఏం ఫాయిదా లేదు. అడుగుకో గుంత ఉంది. స్పీడ్ పోవాలంటే భయంగా ఉంది. ఎక్కడ గుంతలు ఉన్నాయో అర్థం కావడం లేదు.
- జనార్దన్ రెడ్డి, వాహనదారుడు