206.7 మీటర్లకు నీటి మట్టం
ఢిల్లీలో హై అలర్ట్పలు రాష్ట్రాల్లో రెండు రోజులు భారీ వర్షాలు
న్యూఢిల్లీ/ముంబై/అహ్మదాబాద్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీలో యమునా నది మరోసారి ఉప్పొంగింది. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు 206.26 మీటర్ల నీటి మట్టం నమోదు కాగా.. సాయంత్రానికి 206.7 మీటర్లకు పెరిగింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. నగరంలోకి మరోసారి వరదలు ప్రవేశించే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. వరదల ప్రభావంతో గత రెండు వారాలుగా ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. ఇక 25వ తేదీ దాకా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహారాష్ట్ర విదర్భలో గత 10 రోజుల్లో 16 మంది చనిపోయారు. హిమాచల్ ప్రదేశ్‌లో శనివారం ఐదుగురు, గుజరాత్‌లో ఇద్దరు మృతి చెందారు.
ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నం: ఫడ్నవీస్
విదర్భ రీజియన్‌లో వరదలు, పిడుగుల వల్ల ఈ నెల 13 నుంచి ఇప్పటిదాకా 16 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. 4,500 ఇండ్లు దెబ్బతిన్నట్లు చెప్పారు. 54 వేల హెక్టార్ల (1.33 లక్షల ఎకరాలు)లో పంట నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఇందులో 90 శాతానికి పైగా అమరావతి డివిజన్‌లో నష్టం జరిగినట్లు వివరించారు. యావత్మల్ జిల్లాలో వానల వల్ల ముగ్గురు చనిపోయినట్లు మంత్రి అనిల్ పాటిల్ తెలిపారు. భారీ వరదలు వచ్చినా ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సగటున 15 – 20 రోజుల్లో కురిసే వాన.. రెండు మూడు రోజుల్లోనే కురిసిందని చెప్పారు.
గుజరాత్‌లో ఆరెంజ్ అలర్ట్
గుజరాత్‌లోని జునాగఢ్‌లో కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు వరదలు పోటెత్తాయి. జిల్లాలోని వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. సోమవారం గుజరాత్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాగా, పంజాబ్ రాష్ట్రంలోని హోషియార్‌పూర్‌లో కాళీబీన్ నదీ ప్రవాహంలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. అతడిని ఆలంపూర్ గ్రామానికి చెందిన మహీందర్ పాల్ గుర్తించారు.