హైదరాబాద్ నాంపల్లి బజార్ ఘాట్ అగ్ని ప్రమాద ఘటనలో భవన యజమానిని నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. రమేష్ జైశ్వాల్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. నవంబర్ 13వ తేదీన నాంపల్లి బజార్ ఘాట్ లోని ఓ అపార్ట్ మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
నాలుగు అంతస్తుల అపార్ట్ మెంట్ లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్ ఉండటంతో కారు రిపేర్ చేస్తుండగా మంటలు వచ్చాయి. అదే సమయంలో అక్కడ డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండటం.. వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది చనిపోయారు.
నాంపల్లి బజార్‌ఘాట్ అగ్నిప్రమాద ఘటనపై నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదయ్యాయి. క్రైమ్ నెంబర్ 347/23 us 304పార్ట్ ఐపీసీ సెక్షన్లు 285, 286 (పేలుడు పదార్థాలతో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం) ప్రకారం.. అలాగే.. ఇండియన్ ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్ సెక్షన్ 9 క్లాజ్ బి ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు.
సిటీలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవడంలో బల్దియా ఫెయిల్ అయింది. ఏడాది కాలంలో సికింద్రాబాద్‌లో నాలుగు భారీ ఫైర్ యాక్సిడెంట్లు జరిగాయి. గత జనవరిలో సికింద్రాబాద్ దక్కన్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం తర్వాత హడావుడి చేసిన ప్రజాప్రతినిధులు, బల్దియా అధికారులు ఆ తర్వాత సరిగా దృష్టిపెట్టలేదు. దాని తర్వాత సిటీలో దాదాపు పదికి పైగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. తాజాగా నాంపల్లిలోని అపార్ట్ మెంట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది మరణించారు. ఇలా వరుసగా జరుగుతున్న ప్రమాదాలు జనాలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
కమిటీ ఏమాయే..?
సిటీలో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత పరిశీలించేందుకు మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చి చెప్పే మాట ఒక్కటే. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం అని. దక్కన్ మాల్లో ఘటనప్పుడు ఇదే చెప్పారు. ఫైర్ యాక్సిడెంట్ల నివారణకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రెండు మీటింగ్‌లు పెట్టి హడావిడి చేసిన అధికారులు ఈవీడీఎం(ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్) ఆధ్వర్యంలో కేవలం అవేర్నెస్ప్రోగ్రామ్స్తో సరిపెట్టారు. సిటీలో ఎన్ని గోడౌన్లు ఉన్నాయి? ఎక్కడెక్కడ ప్రమాదకరంగా ఉన్నాయి..? వాటిపై బల్దియా ఆరా కూడా తీయలేదు. కఠిన చర్యలు లేకపోవడంతో ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఏడాది కాలంలో సిటీలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో 37 మంది మరణించారు.
ప్రమాదాలు జరిగిన సమయంలో అన్ని వివరాలు సేకరించి సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నేతలు, అధికారులు హడావిడి చేశారు. గోడౌన్లపై సర్వే చేసి రిపోర్టు అందివ్వాలని అప్పట్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. ఆ తర్వాత రిపోర్టు రాలేదు. చర్యలు తీసుకోలేదు. వరుసగా అగ్ని ప్రమాదాలు జరిగిన సికింద్రాబాద్ జోన్లోనైనా చర్యలు చేపట్టలేదు. రెసిడెన్షియల్ బిల్డింగ్‌లను కమర్షియల్ గా వాడుతున్నట్లు అధికారుల దృష్టికి వెళ్లినా పట్టించుకోవడంలేదు. అనుమతులు ఇచ్చే సమయంలో కూడా పెద్దగా దృష్టిపెట్టడడం లేదు.