ఫుడీస్ కి మూడు పూటలు బిర్యానీ పెట్టినా లాగించేస్తారు. రోడ్ పక్కన బండి మీదైనా, రెస్టారెంట్ కి వెళ్లినా బిర్యానీ ఆర్డర్ పెడుతుంటారు. మామూలుగా ఎక్కడ తిన్నా బిర్యానీ ధర వందపైనే ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్, నంద్యాలలోని క్లాసిక్ జైల్ రెస్టారెంట్ యజమాని మాత్రం కేవలం 5 పైసలకే బిర్యానీ పెడుతున్నాడు. డిసెంబర్ 31 సందర్భంగా ప్రకటించిన ఈ ఆఫర్ చివరికి గందరగోళానికి దారితీసింది.
ఆఫర్ లో పాత 5 పైసల బిల్ల ఇస్తే బిర్యానీ ఇస్తామని ప్రకటించారు. ఈ వార్త చాలామందికి తెలియడంతో బిర్యానీ లవర్స్ పెద్ద సంఖ్యలో రెస్టారెంట్ కి తరలివచ్చారు. దాంతో సిటీలో ట్రాఫిక్ జామ్ అయింది. హోటల్ కి వచ్చిన కస్టమర్ల వల్ల తోపులాట జరగడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఎంత ప్రయత్నించినా కస్టమర్లు మాట వినకపోయేసరికి పోలీసులు రెస్టారెంట్ కు తాళం వేసి, యాజమానులపై కేసు నమోదు చేశారు.