న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో ఇండియా లెజెండరీ టెన్నిస్ స్టార్‌రోహన్ బోపన్న మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ దిశగా ముందుకెళ్తున్నాడు. ఇండోనేసియాకు చెందిన అల్దిలా సుట్జియాడితో కలిసి ఆడుతున్న బోపన్న సెమీఫైనల్ చేరుకున్నాడు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ బోపన్న–సుట్జియాడి జంట 7–6 (7/4), 2–6, 10–7తో నాలుగో సీడ్ మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) –బార్బోరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) ద్వయంపై పోరాడి గెలిచింది. గంటా 33 నిమిషాల పోరులో తొలి సెట్‌ను కష్టంగా నెగ్గిన బోపన్న జోడీ రెండో సెట్ కోల్పోయింది. కానీ, సూపర్ టై బ్రేక్‌లో అద్భుతంగా ఆడి ముందంజ వేసింది. సెమీస్‌లో బోపన్న–సుట్జియాడి.. అమెరికాకు చెందిన డొనాల్డ్ యంగ్–టేలర్‌టౌన్సెండ్‌తో తలపడతారు.
క్వార్టర్స్‌లో సినర్, స్వైటెక్
సింగిల్స్‌లో టాప్ సీడ్స్‌జానిక్ సినర్, ఇగా స్వైటెక్ క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. మెన్స్ ప్రిక్వార్టర్స్‌లో సినర్(ఇటలీ) 7–6 (7/3), 7–6 (7/5), 6–1తో వరుస సెట్లలో అమెరికా ఆటగాడు టామీ పాల్‌ను ఓడించాడు. మరో మ్యాచ్‌లో పదో సీడ్ డి మినార్(ఆస్ట్రేలియా) 6–0, 3–6, 6–3, 7–5తో తోటి ప్లేయర్ జోర్డన్ థాంప్సన్‌పై గెలిచాడు. విమెన్స్‌లో స్వైటెక్ (పోలాండ్) 6–4, 6–1తో రష్యా ప్లేయర్ సమ్సోనోవాను వరుస సెట్లలో చిత్తు చేయగా.. 22వ సీడ్ హడాడ్ మైయా (బ్రెజిల్) 6–2, 3–6, 6–3తో డెన్మార్క్ వెటరన్‌వోజ్నియాకికి చెక్‌పెట్టి క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.