గుజరాత్‌లో పంచాయతీ జూనియర్ క్లర్క్ రిక్రూట్‌మెంట్ పరీక్ష వాయిదా పడింది. దాదాపు 9.50 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష కోసం నమోదు చేసుకోగా.. ఉదయం 11 గంటల నుండి ఈ టెస్ట్ నిర్వహించాల్సిన ఉంది. పరీక్ష వాయిదా పడడంతో అభ్యర్థులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ఎలాంటి రవాణా ఖర్చులు లేకుండా GSRTC బస్సులను ఏర్పాటుచేసింది. ఈ విషయాన్ని గుజరాత్ CMO స్పష్టం చేశారు. ఈ ఘటనలో అనుమానితుడిగా భావిస్తున్న ఇసామ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అతని దగ్గర్నుంచి పరీక్ష ప్రశ్నపత్రం కాపీ కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ జరుగుతోందని గుజరాత్ పంచాయతీ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ తెలిపింది. గతంలో పేపర్ లీక్ ఘటనలకు సంబంధించిన వ్యక్తులపై గుజరాత్ ఏటీఎస్ నిఘా ఉంచింది. అయితే వడోదరలో ప్రశ్నపత్రాలతో ఉన్న15 మంది నిందితులను అరెస్టు చేశామని గుజరాత్ ఏటీఎస్ ఎస్పీ సునీల్ జోషి చెప్పారు. దీంతో పరీక్షను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కొందరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షను త్వరలోనే నిర్వహిస్తామని బోర్డ్ స్పష్టం చేసింది.