ఇనుపరాతి గుట్టలు  ఎవరి‘పట్టా’నో.. ఫారెస్ట్ భూములపై ఎడతెగని పంచాయితీ 

ఇనుపరాతి గుట్టలు  ఎవరి‘పట్టా’నో.. ఫారెస్ట్ భూములపై ఎడతెగని పంచాయితీ 
  • పట్టా ల్యాండ్స్  ఉన్నాయంటూ చదును
  • అడ్డుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు
  • దేవునూరు అటవీ భూముల్లో తరచూ ఇదే పరిస్థితి..
  • స్టేషన్ దాకా వెళ్లి వెనక్కి రావడమే ఆనవాయితీ
  • ఫారెస్ట్, రెవెన్యూ మధ్య సమన్వయం లేక ఇబ్బందులు

హనుమకొండ/ ధర్మసాగర్, వెలుగు:  ధర్మసాగర్ మండలంలోని ఫారెస్ట్ భూముల పంచాయితీ ఎడతెగడం లేదు. దేవునూరు శివారులోని అటవీ ప్రాంతంలో పట్టా భూములు ఉన్నాయంటూ తరచూ ఎవరో ఒకరు చదును చేయడం, ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకోవడం, ఇరువర్గాల పంచాయితీ స్టేషన్ వరకు వెళ్లి వెనక్కి రావడం తప్ప.., అంతకుమించి అడుగు ముందుకు పడటం లేదు. ఐదు రోజుల కిందట కూడా ఇలాగే జరగగా, పోలీసులు జేసీబీని స్టేషన్ కు తరలించారు. తరచూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటుండగా, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

  • వందల ఎకరాలు అన్యాక్రాంతం..

హనుమకొండ జిల్లాలో అటవీ విస్తీర్ణం కేవలం ఒకశాతమే. అదికూడా ధర్మసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల పరిధిలోని ఇనుపరాతి గుట్టల్లోనే ఉంది. ఈ అటవీ ప్రాంతం విస్తీర్ణం దాదాపు  4,880 ఎకరాలు కాగా, ధర్మసాగర్ మండలం దేవునూరు అటవీ భూములను ఆనుకొని 1983, 1987 ప్రాంతంలో కొంతమందికి సీలింగ్ పట్టాలిచ్చారు. ఆ తర్వాత ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం దేవునూరు శివారులో పట్టాలు ఇచ్చిన ల్యాండ్ మినహా మిగతా భూమిని ఫారెస్ట్​ ఏరియాగా ప్రకటించేందుకు గతంలోనే ప్రణాళికలు సిద్ధం చేశారు.

రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే డిజిటల్ సర్వే నిర్వహించి, ఇనుపరాతి గుట్టల్లో చాలావరకు ఆక్రమణకు గురైనట్టు గుర్తించారు. ధర్మసాగర్ మండలం దేవునూరుకు ఆనుకొని 1,095 ఎకరాలు, ముప్పారం శివారు 906, వేలేరు మండం ఎర్రబెల్లిలో 820, ఎల్కతుర్తి మండలం దామెర శివారులో 560, భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారులో 594 ఎకరాలు.. ఇలా మొత్తంగా ఇనుపరాతి గుట్టల్లో 3,975 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నట్లు తేల్చారు. వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోకపోవడంతో ఆక్రమణలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. 

  • ఐదు రోజులుగా స్టేషన్​లోనే పంచాయితీ..

సర్వే నెంబర్​ 531లోని శనివారం కొంతమంది భూముల మీదకు వచ్చి 1955 నుంచి అవన్నీ తమ తాతల భూములేనంటూ చదును చేసే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు అడ్డుకుని జేసీబీని స్టేషన్ కు తరలించి చేతులు దుపుకొన్నారు. ఇలాంటి ఘటనలు ఇక్కడ మామూలైపోయింది. ఇదిలాఉంటే కొద్దిరోజుల్లోనే ఇనుపరాతి గుట్టలను ఎకో టూరిజం హబ్ గా తీర్చి దిద్దేందుకు సర్కారు ప్రణాళికలు రచిస్తోంది.

అధికారులు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పట్టా భూములు, హద్దుల విషయంలో సమస్యలు ఉండగా, ఫారెస్ట్, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతోనే పంచాయతీలు వస్తున్నాయని ప్రజలు అంటున్నారు. ఇనుపరాతి గుట్టలను రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించాలనే డిమాండ్ ఉండగా, ముందుగా ఫిజికల్ సర్వే చేసి అటవీ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
 

  • 531 సర్వే భూములపై వివాదం..

గతంలో ప్రభుత్వం పట్టాలిచ్చిన భూముల్లో చాలావరకు సాగుకు అనుకూలంగా లేకపోవడంతో కొంతమంది వాటిని వదిలి ఫారెస్ట్ భూములను దున్నుకోవడం మొదలుపెట్టారు. ఇంకొంతమంది ఆ పట్టాలను సాకుగా చూపుతూ అటవీ భూములను అక్రమించేందుకు కూడా ప్రయత్నించారు. ఫారెస్ట్ భూములు తమవేనని చెప్పుకుంటూ గతంలో కరెంట్ పోల్స్ కూడా వేసుకున్న సందర్భాలున్నాయి.

దేవునూరు శివారు సర్వే నంబర్ 531 లోని సమస్యలు ఎదురవుతుండగా, ఇప్పటికే ఆ చుట్టుపక్కల 142 ఎకరాల వరకు ప్రైవేటు పరమయ్యాయి. ఆ తర్వాత కూడా ఇదే సర్వే పేరు చెబుతూ ఆక్రమణలు జరుగుతుండగా, ఫారెస్ట్, రెవెన్యూ భూముల మధ్య ఎలాంటి హద్దులు నిర్ణయించకపోవడమే సమస్యగా మారింది.