
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో ‘దసరా’ తర్వాత రూపొందుతోన్న చిత్రం ‘ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి సోమవారం స్పెషల్ గ్లింప్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రా అండ్ రస్టిక్ లుక్‌లో నాని గెటప్ మెస్మరైజ్ చేస్తోంది. ‘చరిత్రలో అందరూ చిలుకలు, పావురాల గురించి రాసిర్రు గానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానా కెళ్ళి నడిచే శవాల కథ. అమ్మరొమ్ములో పాలు లేక రక్తం బోసి పెంచిన ఒక జాతి కథ. ఒక దగడ్ వొచ్చి మొత్తం జాతిలో జోష్ తెచ్చిండు. థూ.. అనిపించుకున్న కాకులు తల్వార్‌లు పట్టినాయ్.
ఇది ఆ కాకులని ఒక్కటి చేసిన తిరుగుబాటుదారుడి కథ ఇది.. నా కొడుకు నాయకుడు అయిన కథ’ అంటూ పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ కట్ చేశారు. మృతదేహాలతో నిండిన మురికివాడల మధ్య నాని ఎంట్రీ, రెండు జడలతో అతని గెటప్, పాత్రలోని ఇంటెన్సిటీని తెలియజేసేలా సాగిందీ వీడియో.
అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు హైలైట్‌గా నిలిచింది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషలలో ఈ వీడియోను రిలీజ్ చేయగా, కన్నడ, మలయాళ, బెంగాలీ వెర్షన్‌లు త్వరలోనే చేస్తామని మేకర్స్ చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 26న సినిమా విడుదల కానుంది.