- అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఫుడ్ పాయిజన్
- ఫుడ్ పాయిజన్ ఘటనపై పేరేంట్స్ మండిపాటు
- భయంతో విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తున్న పేరేంట్స్
వర్ధన్నపేట: పిల్లలను మంచిగా చూసుకుంటారని హాస్టల్ కు పంపిస్తే పురుగుల అన్నం పెడుతున్నారని వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఉన్నత చదువులు అందిస్తారని హాస్టల్ కు పంపితే తమ పిల్లలను ఆసుపత్రికి పంపారని వాపోతున్నారు. ఫుడ్ పాయిజన్ కు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని వారు మండిపడుతున్నారు.
సోమవారం ఆహారంలో బల్లి పడటంతో ఆ ఆహారం తిని ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. దీంతో 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురి కాగా.. వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అందులో13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బల్లి పడిందని చెబితే దాన్ని తీసేసి తినాలని విద్యార్థులను వార్డెన్ బెదిరించారని పేరేంట్స్ ఆరోపించారు. అదే ఫుడ్ ను వార్డెన్ తింటారా అని ప్రశ్నించారు.
ఇక హాస్టల్ కు చేరుకున్న మిగిలిన స్టూడెంట్ల పేరేంట్స్ ... తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్తున్నారు. ఫుడ్ సరిగ్గా ఉండటం లేదని గతంలో చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చామని, అయితే ఎవరూ పట్టించుకోలేదని పేరేంట్స్ ఆరోపించారు. నాణ్యమైన ఆహారం పెట్టే వరకు పిల్లలను హాస్టల్ కు పంపేదిలేదని వారు తెగేసి చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ పెట్టాలని, ఫుడ్ పాయిజన్ కు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.