
- అంగరంగ వైభవంగా ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ
- సీన్ నదిపై ఆకట్టుకున్న అథ్లెట్ల పరేడ్
- అలరించిన లేడీ గాగా ఆటాపాట..
చరిత్రకు భిన్నంగా.. వారసత్వానికి కొనసాగింపుగా.. మరపురాని దృశ్యంగా.. కన్నుల పండువగా.. సీన్ నది హోయలు.. కళాత్మక ప్రదర్శనలు.. డ్రమ్స్ వాయిద్యాలు.. వీనుల విందైన సంగీతం.. పసందైన పాటల సందడి.. మిరుమిట్లు గొలిపిన బాణాసంచ వెలుగుల మధ్య.. పారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ అంగరంగ వైభవంగా సాగింది..! ఒలింపిక్ టార్చ్ ఆరంభం నుంచి ఐకానిక్ సీన్ నదిపై జరిగిన అథ్లెట్ల పరేడ్ వరకు ఆద్యంతం వీక్షకులను కట్టి పడేసింది..! వర్షం వచ్చే సూచనలు ఉన్నా.. భద్రతాపరమైన లోపాలు తలెత్తినా.. ఉగ్రవాదుల ముప్పు ఉందని హెచ్చరికలు వచ్చినా.. నాలుగు గంటల పాటు జరిగిన కార్యక్రమంతో పారిస్ మోత మోగింది..!
పారిస్ : ‘యావత్ క్రీడా ప్రపంచం ఒకే చోట’ అన్నట్లుగా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం అట్టహాసంగా మొదలయ్యాయి. ఐకానిక్ ఈఫిల్ టవర్ వీధులన్నీ ఫ్యాన్స్‌తో నిండిపోయాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆద్యంతం ఆసక్తిగా సాగిన వేడుకలు ప్రపంచ వీక్షకులను ఆకట్టుకున్నాయి. మొదట పారిస్ చర్చి నుంచి ఒలింపిక్ టార్చ్‌ను వెలిగించిన కార్యక్రమం అదరహో అనిపించింది. ఇక సాంప్రదాయ స్టేడియాల నుంచి మొదలైన పరేడ్ సీన్ నదిపైకి రావడంతో ఒక్కసారి విశ్వ క్రీడల సంబురం ఆకాశాన్నంటింది. తొలిసారి స్టేడియం బయట నదికి ఇరువైపుల ఉన్న క్వేలను గ్రాండ్ స్టాండ్‌లు మార్చారు.
వీటిలో కళాకారులు చేసిన నృత్యాలు, డ్రమ్స్ వాయిద్యాలు, వినసొంపైన సంగీతం, ఫ్రెంచ్, పర్షియన్ వారసత్వాలు ప్రతిబింబించేలా చేసిన కళ ఖండాలు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఫ్రెంచ్ ఫుట్‌బాల్ లెజెండ్ జిదానే పెద్ద ప్రోమోతో మొదలైన కార్యక్రమంలో బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ లిన్ డాన్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రఖ్యాత డైరెక్టర్ థామస్ జాలీ ఈ సెర్మనీకి సారథ్యం వహించారు. ఫ్లోరెంట్ మనౌడో ఒలింపిక్స్ ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించిన ఐదో ఫ్రెంచ్ మహిళగా రికార్డులకెక్కింది. క్రిస్టీన్ కారన్ (1968), మేరీజోస్ పెరెక్ (1996), లారా ఫ్లెసెల్ (2012), క్లారిసే అగ్బెగ్నెసా (2021) ముందున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఐవోసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మిస్టీరియస్ వ్యక్తి..
మొత్తం కార్యక్రమంలో ఒలింపిక్ టార్చ్ బేరర్ ఎవరనేది చివరి వరకు కనిపెట్టలేకపోయారు. పూర్తిగా ముసుగు దుస్తుల్లో ఉన్న అతను పారిస్‌లోని ప్రఖ్యాత కట్టడాలను కలుపుతూ ముందుకెళ్లాడు. సీన్ నదిలో చిన్నారులతో కలిసి పడవలో ప్రయాణించిన అతను వరల్డ్ బిగ్గెస్ట్ మ్యూజియం లౌవ్రేలో సందడి చేశాడు. చివరకు మోనాలీసా అదృశ్యం అయిందంటూ కెమేరా ముందుకొచ్చినా ముఖాన్ని బహిర్గతం చేయలేదు.
సింధు, శరత్ సారథ్యంలో..
తరుణ్ తహిలియాని రూపొందించిన సొగసైన వస్త్రధారణలో ఇండియా బృందం మెరిసిపోయింది. భారతీయ మూలాలను పరిగణలోకి తీసుకుని ఈ డ్రెస్‌లను రూపొందించారు. పురుష అథ్లెట్లు కుర్తా ఫైజామా, మహిళా అథ్లెట్లు చీరలు ధరించారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టీటీ లెజెండ్ శరత్ కమల్ ఫ్లాగ్ బేరర్స్‌గా వ్యవహరించారు. పరేడ్ ఆఫ్ నేషన్స్‌లో వీళ్లు త్రివర్ణంతో ముందు నడవగా మిగతా వారు అనుసరించారు. స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా, వినేశ్ ఫోగట్‌తో పాటు రెజ్లింగ్ బృందం పరేడ్ పాల్గొనలేదు. వీళ్లు ఇంకా పారిస్‌కు చేరుకోలేదు. మొత్తం 78 మంది కవాతులో పాల్గొన్నారు. సీన్ నదిలో టీమిండియా బోట్ రైడ్ కూడా చేసింది.
లేడీ గాగా ఆటాపాట..
ఒలింపిక్ కేథడ్రల్ సమీపంలో ఫ్రెంచ్ క్యాబరే పాటకు లేడీ గాగా 80 మంది డ్యాన్సర్‌తో కలిపి చేసిన ‘మోన్ ట్రూక్ ఎన్‌ఫ్లూమ్స్) డ్యాన్స్ హైలెట్‌గా నిలిచింది. అదే సమయంలో సీన్ రివర్‌పై ఫ్రాన్స్ జెండా కలర్లు బ్లూ, వైట్, రెడ్‌తో కూడిన పెద్ద స్మోక్‌ను వదిలారు. ఇక రెక్కలతో కూడిన ఓ వ్యక్తి అకార్డియన్ వాయిస్తూ కిందకు దిగాడు. సంప్రదాయం ప్రకారం గ్రీక్ పడవ రాకతో ఒక్కసారిగా చప్పట్ల మోత మోగింది. శరణార్థి అథ్లెట్లతో కూడిన తొలి పడవ పరేడ్‌లోకి ప్రవేశించింది. ఆ వెంటనేనది మధ్యలో బోట్లు వెళ్తున్నప్పుడు వాటర్ ఫౌంటైన్‌లతో స్వాగతం పలికారు.
నీటి జెట్‌లు వాటిని అనుసరించాయి. ఫ్రాన్స్ పాప్ స్టార్, రిపబ్లికన్ గార్డ్ ఆర్కెస్ట్రా ‘ఆయ నకమురా’ పాంట్ డెస్ ఆర్ట్స్‌లో ప్రదర్శన ఇచ్చారు. ఈ క్షణం ఫ్రెంచ్ భాష ఏకీకృత శక్తిని జరుపుకుంటుంది. ఇది కాలక్రమేణా విభిన్న వర్గాలచే ప్రభావితమవుతుందంటూ సందేశం ఇచ్చారు. అథ్లెట్లు జనాల వైపు చేతులు ఊపుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. మధ్యలో సెక్యూరిటీ సిబ్బంది ఫ్యాన్స్‌ను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. గ్రాండ్- పలైస్ పైకప్పు నుండి అక్సెల్లే సెయింట్ సిరెల్ ఫ్రెంచ్ జాతీయ గీతాన్ని వినిపించింది. పారిస్ వీధుల్లో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లపై కార్యక్రమాలను తిలకించారు.