హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ లో ఉన్న మునుగోడు ఓటర్లపై పార్టీలు దృష్టిసారించాయి. పోలింగ్ కు వాళ్లను తరలించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇందుకోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2.41 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో గట్టుప్పల్, మునుగోడు, చండూరు, చౌటుప్పల్మండలాల పరిధిలోని ఓటర్లు ఎక్కువ మంది హైదరాబాద్ లో ఉంటున్నట్లు పార్టీలు సమాచారం సేకరించాయి. వీళ్ల సంఖ్య దాదాపు 25 వేలు ఉంటుందని అంచనా. వీళ్లలో సగం మందిని తరలించినా తమకు చాలా వరకు కలిసొస్తుందని అన్ని పార్టీలూ భావిస్తున్నాయి. ఇందుకోసం ప్రధాన పార్టీలు ఏర్పాట్లు మొదలుపెట్టాయి. 5 నుంచి 10 మంది ఓటర్లను టీమ్‌గా ఏర్పాటు చేసి తరలించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే కొందరు ఓటర్ల అడ్రస్‌లు సేకరించి, వారిని పోలింగ్ రోజు ప్రత్యేకంగా కారులో తరలించడంతో పాటు ఓటుకు రూ.10 వేల వరకు ఇస్తామని ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని ఆయా పార్టీల నేతలు ప్రలోభ పెడుతున్నట్లు తెలిసింది. మునుగోడుకు వెళ్లి ఓటు వేసే కంటే ముందే డబ్బులు ఇస్తామని చెబుతున్నట్లు సమాచారం.
ట్రావెల్స్ సంస్థలతో సంప్రదింపులు..
ఓటర్లను మునుగోడుకు తరలించేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలతో పార్టీల నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. బస్సుల్లో తరలిస్తే ఈసీ నుంచి ఇబ్బందులు ఉండే అవకాశం ఉండటంతో కార్లలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరుగురు ఓటర్లను తీసుకెళ్లేందుకు ఇన్నోవా, జైలో, ఎర్టీగా వంటి పెద్ద కార్లను బుక్ చేస్తున్నారు. ఒక్కో వాహనానికి ఒక్క రోజు కోసం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. నగరంలోని ఓటర్లను గుర్తించి, వాళ్లను తరలించే బాధ్యతలను నల్గొండ జిల్లాలోని ఒక ఎమ్మెల్యేతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ అప్పగించినట్లు సమాచారం. ఓటర్లకు ఇవ్వాల్సిన డబ్బులను సిటీ ఎమ్మెల్యేలు, లీడర్లు సర్దుతున్నట్లు తెలిసింది. ‘‘ప్రతి ఓటరుతోనూ ఓటు వేయించాలనేది బాస్ మాకు ఇచ్చిన టాస్క్. సిటీలో ఉన్న మునుగోడు ఓటర్లను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి” అని ఖమ్మంకు చెందిన ఎమ్మెల్సీ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఇప్పటికే 170 కార్లు బుక్ చేసినట్లు, పార్టీ లీడర్ల కార్లను కూడా వాడుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే ఓటర్లను మునుగోడుకు తరలించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ బాధ్యతలను పలువురు ముఖ్య నేతలకు అప్పగించాయి.
లోకల్ లీడర్ల ద్వారా వివరాలు
మునుగోడులోని లోకల్ లీడర్ల ద్వారా హైదరాబాద్ లో ఉంటున్న ఓటర్ల వివరాలను పార్టీలు తెలుసుకుంటున్నాయి. వాళ్లకు ఫోన్లు చేస్తూ.. ఇతర పార్టీల వాళ్లెవరైనా ఫోన్ చేశారా? వాళ్లు ఏం ఆఫర్ చేశారు? తదితర సమాచారం సేకరిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీ కంటే తాము ఎక్కువే ఇస్తామని హామీలు ఇస్తున్నాయి. సిటీలో ఉంటున్నోళ్ల వివరాలు అందజేస్తూ, వాళ్లను తరలించేందుకు సహకరిస్తున్న లోకల్ లీడర్లకు కూడా పార్టీలు మంచి ఆఫర్లే ఇస్తున్నాయి. సిటీలోని ఓటర్లను పోలింగ్ కు ముందు రోజు తీసుకెళ్లడమా? లేదంటే పోలింగ్ రోజు (నవంబర్ 3) తీసుకెళ్లడమా? అనే దానిపై కసరత్తు చేస్తున్నాయి.