
- ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ఓపెన్ ఇయ్యాల్నే
- మధ్యాహ్నం 12: 47కి ముహూర్తం ఖరారు
- హాజరుకానున్న మాజీ సీఎంలు కుమార స్వామి, అఖిలేశ్, పలు పార్టీల లీడర్లు, రైతు నేతలు
- పార్టీ ఆఫీస్ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం
- బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించిన ఎన్డీఎంసీ
న్యూఢిల్లీ, వెలుగు : దేశ రాజధాని ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్ లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సెంట్రల్ ఆఫీసును బుధవారం ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం మధ్యాహ్నం 12:47 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. పార్టీ కార్యాలయంలో కేసీఆర్ మొదట పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పార్టీ ఆఫీసును ప్రారంభించి, తన చాంబర్ లో కూర్చుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా పలు పార్టీలు, వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలను బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలిసింది. ఆ తర్వాత జాతీయ స్థాయిలో పార్టీ అజెండాతో పాటు, వివిధ స్టేట్ లకు ఇంచార్జ్ లను ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నేతలు పెద్ద సంఖ్యలో ఢిల్లీ చేరుకున్నారు.
హాజరుకానున్న మాజీ సీఎంలు, రైతు నేతలు
బీఆర్ఎస్ పార్టీ ప్రారంభోత్సవానికి కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హాజరుకానున్నారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కూడా వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ తో భావసారూప్యత కలిగిన పలు పార్టీల నేతలనూ ఆహ్వానించారు. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నేతలు, రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. కాగా, పార్టీ ఆఫీస్ వద్ద మంగళవారం ఉదయం 10 గంటలకు గణపతి పూజతో యాగాలు ప్రారంభయ్యాయి. బుధవారం నవ చండి, రాజశ్యామల హోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు పాల్గొననున్నారు. అయితే, పార్టీ ప్రారంభోత్సవానికి ఎవర్నీ ఆహ్వానించలేదని, ఇతర పార్టీల నేతలు సొంతగానే ఈ వేడుకకు హాజరవుతున్నారని ఎంపీ రంజిత్ రెడ్డి చెప్పారు. సెంట్రల్ ఆఫీసు తర్వాత, ఇతర రాష్ట్రాల్లో పార్టీ ఆఫీసు కార్యక్రమాలు ఉంటాయన్నారు.
ఆఫీస్ పనులు పరిశీలించిన కేసీఆర్
ఢిల్లీలోని వసంత్ విహార్ లో నిర్మిస్తోన్న బీఆర్ఎస్ పార్టీ భవన పనులను కేసీఆర్ మంగళవారం పరిశీలించారు. సీఎం వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. తొలుత తుగ్లక్ రోడ్ నుంచి వసంత్ విహార్ చేరుకున్న కేసీఆర్ అక్కడ 45 నిమిషాలు గడిపారు. ఆఫీస్ నిర్మాణ పనులు, ఫ్లోర్, ఆఫీసు లోపల, బయట చేపట్టే నిర్మాణాలను సీఎంకు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఇంజనీర్లు వివరించారు. కాంపౌండ్ వాల్, వరండా పనులకు సంబంధించి కేసీఆర్ స్వయంగా టేప్ తో కొలిచి చూశారు. అనంతరం అక్కడి నుంచి ఎస్పీ రోడ్ లో ప్రారంభించనున్న తాత్కాలిక పార్టీ ఆఫీస్ భవనాన్ని కేసీఆర్ సందర్శించారు. భవనంలోని తన చాంబర్, మీటింగ్ రూం, పై అంతస్తులోని మిగతా రూంలను పరిశీలించారు. హోమం జరుగుతున్న ప్రదేశానికి మాత్రం వెళ్లలేదు. అక్కడి నుంచి నేరుగా తుగ్లక్ రోడ్ లోని సీఎం క్యాంప్ ఆఫీసుకు చేరుకున్నారు.
బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపు
ఢిల్లీలోని తెలంగాణ భవన్, తుగ్లక్ రోడ్ లోని కేసీఆర్ నివాసం, ఎస్పీ రోడ్ లోని పార్టీ ఆఫీసు వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే, ఎస్పీ రోడ్ లో పార్టీ ఆఫీసు ముందు ఏర్పాటు చేసిన భారీ ప్లెక్సీలను న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) సిబ్బంది తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా ఏర్పాటు చేసినందుకు వీటిని తొలగించినట్లు చెప్పారు. దీనిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ.. పోస్టర్లు, ఫ్లెక్సీల తొలగింపు అంశం తనకు తెలియదన్నారు. కేసీఆర్ అభిమానులు ఎక్కడైనా రోడ్లమీద పెట్టి ఉండొచ్చని చెప్పారు.