వరంగల్​లోకి ప్రవేశించిన బండి సంజయ్‍ పాదయాత్ర

  • హైకోర్టు అనుమతితో సభ ఏర్పాట్లు చేసిన బీజేపీ లీడర్లు
  • హాజరుకానున్న జేపీ నడ్డా, సునీల్‍ బన్సల్‍

వరంగల్‍, వెలుగు: బీజేపీ స్టేట్‍చీఫ్ బండి సంజయ్‍ మూడో  విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. టీఆర్‍ఎస్‍ దాడులు, పోలీసుల ఆంక్షల అనంతరం.. హైకోర్టు అనుమతులతో శనివారం హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్​అండ్‍ సైన్స్​ కాలేజీలో సభ జరగనుంది. 

సభ పనులు స్పీడప్‍..

బండి సంజయ్‍ పాదయాత్ర, ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ విషయంలో బీజేపీ లీడర్లు, కేడర్‍ గత నాలుగు రోజులుగా అయోమయంలో ఉన్నారు. శుక్రవారం సభ నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో పార్టీ శ్రేణులు పనులు స్పీడప్​ చేశాయి. సభ జరిగే సుబేదారి, అదాలత్‍ ఏరియాలతో పాటు వరంగల్​సిటీ హోర్డింగులతో కాషాయమయమైంది. ఉమ్మడి జిల్లా నేతలు జన సమీకరణపై దృష్టి పెట్టారు. సభకు చీఫ్​గెస్ట్​లుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతుండగా.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి సునీల్‍ బన్సల్‍ మొదటిసారి రాష్ట్రంలో అడుగుపెడుతున్నారు. 

బొల్లికుంట నుంచి ఆర్ట్స్​కాలేజీ వరకు    

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‍ ప్రజా సంగ్రామ యాత్ర చివరిరోజు ఖమ్మం బైపాస్‍లోని బొల్లికుంట వాగ్దేవి కాలేజీ నుంచి ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మామూనూర్‍, నాయుడు పెట్రోల్‍పంప్‍, వరంగల్‍ సిటీ మీదుగా భద్రకాళి టెంపుల్‍ చేరుకుంటుంది. బండి సంజయ్‍ అమ్మవారికి పూజలు చేసిన అనంతరం అక్కడి నుంచి సభ జరిగే ఆర్ట్స్​ కాలేజీకి చేరుకోనుంది.