హైదరాబాద్,వెలుగు: సర్కారు జూనియర్ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపరచాలని అధికారులకు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. గతేడాది కంటే ఈసారి అన్ని కాలేజీల్లో రిజల్ట్ పెంచేలా కృషి చేయాలని సూచించారు. దీనికోసం ప్రతిరోజు విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించాలని ఆదేశించారు.
శనివారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఆఫీసులో డిస్ట్రిక్ట్ అకడమిక్ మానిటరింగ్ సెల్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపాలని, నిత్యం మానిటరింగ్ చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో అకడమిక్ గైడెన్స్, ట్రైనింగ్, ప్లేస్‌మెంట్ సెల్ ను పర్యవేక్షించేందుకు కావాల్సిన మాడ్యుల్స్ ను రూపొందించినట్టు చెప్పారు.
గడిచిన మూడేండ్లలో సబ్జెక్ట్, గ్రూప్, కాలేజీ వారీగా ఫలితాలను రికార్డు చేయాలని డిస్ట్రిక్ట్ అకడమిక్ మానిటరింగ్ సెల్ కు సూచించారు. 2024-25 విద్యాసంవత్సరంలో అడ్మిషన్ తీసుకుని కాలేజీకి రెగ్యులర్ గా రాని విద్యార్థుల వివరాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.ప్రీఫైనల్ పరీక్షల మూల్యంకనాన్ని సకాలంలో పూర్తిచేసి వివరాలను నమోదు చేయాలని లెక్చరర్లకు స్పష్టం చేశారు. ఫెయిలైన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఇంటర్ బోర్డు సీఓఈ, ఆర్జేడీ జయప్రదబాయి, డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మా రెడ్డి, జాయింట్ డైరెక్టర్ వెంక్యా నాయక్, అకడమిక్ సెల్ ప్రతినిధి జయమణి తదితరులు పాల్గొన్నారు.