ప్రభుత్వ ఆఫీసుల తీరు మారాలి

ప్రభుత్వ ఆఫీసుల తీరు మారాలి
సర్కారీ ఆఫీసులున్నది ప్రజల కోసమే. ఆఫీసుల్లో పని చేసే ఆఫీసర్లు, ఉద్యోగులు అంతా పబ్లిక్ సర్వెంట్స్. ప్రజలు కట్టే పన్నుల నుంచే వాళ్లకు జీతాలు ఇచ్చేది. వాళ్లున్నది ప్రభుత్వ కార్యాలయాల్లో మన పనులు చేసేందుకే. ఆఫీసుల్లో సేవలు పొందడం మన హక్కు. వాస్తవంలో పరిస్థితి వేరేలా ఉంటుంది. చెప్పుకోడానికే ప్రజల కోసం , ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వంలో ప్రజలే ప్రభువులు.. గవర్నమెంట్ ఉద్యోగులు, నాయకులు అంతా సేవకులు లాంటి మాటలు ఘనంగానే ఉంటాయి. కానీ పోలీసు, రెవెన్యూ, ఆర్టీవో, మున్సిపాలిటీ, గవర్నమెంట్ బ్యాంకులు, హాస్పిటల్స్..  ఇలా ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, అక్కడ ఉద్యోగులు ఉన్నది ప్రజలకు సేవలు అందించడానికే, ఎవరైనా స్వేచ్ఛగా, ధైర్యంగా వెళ్లి పనులు చేయించుకోవచ్చన్న భరోసా ప్రజల్లో కల్పించడంలో ప్రభుత్వాలు నేటికీ ఫెయిల్ అవుతున్నాయి. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిషర్ల పాలనలో ఉండగా ఏ భయం, బెరుకుతో అయితే ఆఫీసులకు వెళ్లేవారో ఇప్పటికీ అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రజాస్వామ్య పాలనలో పబ్లిక్ సర్వెంట్స్ ఉన్నదే ప్రజల పనులు చేయడానికని, వాళ్లకు అవసరమైన సర్వీసెస్ అందించడంలో ఫెయిల్ అయిన వారిని వ్యక్తిగతంగా శిక్షించే రోజు వస్తేనే సామాన్యులు ధైర్యంగా గవర్నమెంట్ ఆఫీసు గడప తొక్కగలుగుతారు. 21వ శతాబ్ధంలోకి వచ్చేశాం. మరో గ్రహంపై నివసించే పరిస్థితుల గురించి ఆలోచన చేస్తున్న ఈ రోజుల్లోనూ పోలీస్ స్టేషన్‌‌‌‌కు వెళ్లాలంటే సామాన్యులకు ధైర్యం చాలట్లేదు. తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పుకోవాలన్నా, తాను చూసి క్రైమ్ గురించి సమాచారం ఇవ్వాలన్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకున్న తర్వాత గానీ ముందడుగు వేయలేకపోతున్నారు. పోలీసు చేతిలో ఉండే లాఠీ, తుపాకీ మనకు రక్షణ కల్పించేందుకేనన్న ధీమా కలగాల్సింది పోయి.. వాటిని చూస్తేనే భయపడే రోజులు నడుస్తున్నాయి. తండ్రిలా సమాజానికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన పోలీసులు.. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచిపోయినా ఇంకా ఆ నమ్మకాన్ని ప్రజల్లో కల్పించలేకున్నారు. ఇప్పటికీ 70 శాతం ప్రజలు లోకల్ లీడర్లు లేదా ఇరుగు పొరుగు తోడు లేకుండా ధైర్యంగా పోలీసుస్టేషన్ కు వెళ్లలేకున్నారన్నది వాస్తవం. ఈ భయం సామాన్యుడి అపోహే కావచ్చు. కానీ దానిని తొలగించాల్సిన బాధ్యత పోలీసు డిపార్ట్‌‌‌‌మెంట్, ప్రభుత్వాలపై ఉంది. పోలీసుల ముందు గట్టిగా మాట్లాడితే ఏ నేరం చేయకపోయినా ఎక్కడ బద్నాం చేస్తారో అన్న భయం పోయిన రోజు ఆ వ్యవస్థకు నిజమైన అర్థం ఉంటుంది. ఏ డిపార్ట్‌‌‌‌మెంట్ చూసినా అదే తీరు.. క్రాప్ లోన్ తీసుకునే రైతులన్నా, డ్వాక్రా మహిళలన్నా బ్యాంకు అధికారులకు మాటల్లో చెప్పలేనంతటి చిన్న చూపు. ప్రభుత్వ బ్యాంకులు నడుస్తున్నది కస్టమర్లు, డిపాజిటర్ల వల్లేనని తెలిసి కూడా, సామన్యులు ఏదైనా పనిపై వెళ్తే చీదరించుకున్నట్లుగా సమాధానం చెప్పే ఉద్యోగులకు కొదవే ఉండదు. ఇక వృద్ధాప్య పింఛన్లు, రేషన్ కార్డు, లేదా మరే ఇతర సర్వీసు కోసం స్థానిక ప్రభుత్వాల సిబ్బంది కలిస్తే వాళ్లు తమ వెనుక తిప్పుకొనే తీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులంటే నర్సు మొదలు డాక్టర్ వరకు అందరికీ అలుసే. ఆదాయం గురించి చేసే చింతలో పదో వంతైనా ప్రయాణికుల సౌకర్యాల గురించి, వారిపట్ల ఉద్యోగుల తీరుతెన్నుల గురించి ఆర్టీసీ అధికారులు ఆలోచించరు. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీవో ఆఫీసులకు వెళ్తే అక్కడ ప్రొసీజర్ ఏంటి? పనులు ఎప్పటికి అవుతాయి అన్నవాటికి సమాధానం చెప్పే మనిషే కనపడరు. ఈజీగా పొందాల్సిన సర్వీసుల కోసం సామాన్యులు బ్రోకర్ ను సంప్రదించక తప్పని పరిస్థితులను అక్కడి సిబ్బంది క్రియేట్ చేస్తారు. ఏ ప్రభుత్వ కార్యాలయం చూసినా ఇదే తంతు. అక్కడికి సామాన్యుడు భయం భయంగా వెళ్లాల్సిందే. అధికారిని కలవాలని లోపలకి వెళ్లాలంటే చెప్పులు విప్పకుంటే ఏమంటారో, ఎదురుగా కుర్చీలో కూర్చుంటే ఎలా రెస్పాండ్ అవుతారో అన్న బెరుకు గ్రామాల్లో నేటికీ కనిపిస్తుంది. ప్రతి ఆఫీసులోనూ రిసెప్షన్ ఉండాలి ప్రభుత్వ అధికారిని, ఉద్యోగిని కలువడానికి వెళ్లే ప్రతి పౌరుడూ అక్కడున్న వాళ్లను తమ పనుల కోసం తామే జీతాలు ఇచ్చి నియమించుకున్నామని ఆలోచన చేయగలిగే రోజు రావాలి. మన పనిని చేసిపెట్టడం తన విధిగా భావించి, సహకరిస్తాడన్న విశ్వాసం ప్రభుత్వ ఉద్యోగులపై కలగాలి. ఏదైనా సమస్య వస్తే ఎలా సరి చేసుకోవాలో వివరించి, ఈజీగా పని పూర్తయ్యేలా హెల్ప్ చేస్తారన్న నమ్మకం ఉండాలి. తమ కోసం తామే ఏర్పాటు చేసుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ మీద పౌరులకు ఉండాల్సిన కనీస అభిప్రాయం అది. కానీ నాయకుల ప్రసంగాల్లో తప్ప రియాలిటీలో ఎక్కడా కానరాని సత్యమిది. నీటిపారుదల, విద్యుత్తు, పారిశుద్యం, తాగునీటి సరఫరా, ప్రజారోగ్యం, విద్య లాంటి నిత్యావసర సేవల్లో అనుచిత అంతరాయాన్ని, నిర్లక్ష్యాన్ని ప్రశ్నించే వెసులుబాటు, ఆయా ఉద్యోగులను వ్యక్తిగతంగా బాధ్యులను చేసే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఫిర్యాదుల మీద తక్షణం స్పందించని అధికారులను శిక్షించేలా రూల్స్ పెట్టాలి.  ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు తీసుకుంటున్న ప్రతి ఉద్యోగికీ డ్యూటీలో చేరే ముందు పౌర సంబంధాలు, ప్రజలతో వ్యవహరించాల్సిన తీరు, ఉపయోగించే భాషపై సరైన శిక్షణ ఇవ్వాలి. పౌర రక్షణ మొదలు ప్రభుత్వ పథకాల అమలు వరకు ప్రతి పనిలోనూ చిత్తశుద్ది, ప్రజలపై గౌరవంతో పని చేసేలా ఉద్యోగులను తీర్చిదిద్దాలి. ఆఫీసులకు వెళ్లిన సామాన్యులు తమ పని చేయించుకోవడానికి ఎవరిని కలవాలి, ప్రొసీజర్ ఏంటి అన్న విషయాలపై వివరించేలా ప్రైవేటు సంస్థల్లో ఉన్నట్టుగానే గవర్నమెంట్ కూడా రిసెప్షన్/పబ్లిక్ డెస్క్ ఒకటి తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. దాని ద్వారా ప్రజలకు అందే సేవలపై వారికి భరోసా కల్పించాలి. పెత్తనం కాదు.. సర్వీస్​ చేయాలె పన్నుల రూపంలో ప్రజల కష్టార్జితాన్ని జీతాలుగా తీసుకుంటున్న ఉద్యోగులకు తాము పబ్లిక్ సర్వెంట్స్ అన్న విషయం గుర్తుండాలి. ప్రజలకు సర్వీస్ చేయాలి కానీ పెత్తనం కాదన్న విషయం తెలుసుకోవాలి. అమ్మా, అయ్యా అంటూ వంగి వంగి దండాలు పెడితే సరే.. ఎదురు తిరిగి ప్రశ్నిస్తే ఆ వ్యక్తి పని ఎప్పటికీ కాదు అనే పరిస్థితులు మారాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేయించుకోవడం ప్రజల హక్కు. అది జరగకపోతే నిలదీసే అధికారం వాళ్లకు ఉంటుంది. అలా ప్రశ్నిస్తే వాళ్ల పని కానీయకుండా చేయడమో, వాళ్లపై కేసులు బనాయించడమో చేస్తే అది అధికార దుర్వినియోగమే అవుతుంది. ఈ మధ్య కొన్ని శాఖల్లో ఉన్నతాధికారులు తమ ఆఫీస్ రూమ్‌‌‌‌లోకి వచ్చే వాళ్లను సెల్ ఫోన్ లాంటివి బయటే పెట్టి రావాలని ఆదేశిస్తున్నారు. అదేమంటే వీడియోలు రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారంటూ వాపోతున్నారు. అక్కడ అర్థం కాని విషయమేమంటే వాళ్లు ప్రజలకు అందించాల్సిన సేవల విషయంలో చట్టబద్ధంగా వ్యవహరిస్తే భయపడాల్సిన అవసరం ఉండదు కదా!  అంటే నిజాయతీ లేకుండా ఏదో తప్పు చేస్తున్నట్లే అనుకోవాలా? వాళ్లే ఆలోచించుకోవాలి. హక్కుల కోసం ముప్పుతిప్పలు రెవెన్యూ డిపార్ట్‌‌‌‌మెంట్ లోనూ ఇంచుమించూ పోలీసు వ్యవస్థను పోలిన పరిస్థితులే కనిపిస్తాయి. లాఠీలు, తూటాలు లేకపోవడం వల్ల రెవెన్యూ ఆఫీసుల్లోకి సామాన్య ప్రజలు ధైర్యంగా వెళ్లగలుగుతున్నా.. అక్కడ పనులు కావాలంటే ఎన్నాళ్లు తిరగాలో అన్న భయం ఉంది. తన భూములు, ఆస్తులకు సంబంధించిన హక్కుకు లీగల్ డాక్యుమెంట్ తీసుకోవాలన్నా, సంక్షేమ పథకాలను పొందడానికి అర్హత ఉన్నా సరే దానిని నిరూపించుకోవడానికి సంబంధిత అధికారి చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిందే. కానీ రెవెన్యూ చట్టాలు, రూల్స్ చూస్తే ఆయా ఆఫీసుల్లో ప్రతి పనినీ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్న గైడ్ లైన్స్ ఉంటాయి. కానీ ఆ నిబంధనలు ఎవరికీ పట్టవు. ఆఫీసుల్లో అధికారి చెప్పినదే రూల్ అన్నట్టు ఉంటుంది. తెలిసిన అధికారి ద్వారానో, రాజకీయ నాయకుల సహాయంతోనో వెళ్తే తప్ప చిన్నచిన్న పనులు కూడా సరైన టైమ్‌‌‌‌కి జరగడం లేదు. ఇక లంచాల కోసం సాగే వేధింపులకు అంతూపొంతూ ఉండదని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.-చందుపట్ల రమణకుమార్ రెడ్డి, లాయర్, మంథని, పెద్దపల్లి జిల్లా. క్రికెటర్ల జీవితాలతో ఆటలు.. హెచ్ సి ఎ చెత్త పాలనతో ప్లేయర్లకు ఇక్కట్లు సోషల్ మీడియాలో ఆడవాళ్లపై పెరిగిన వేధింపులు రూ.50 లక్షల లోపు ఇండ్లకు ఫుల్ డిమాండ్