‘రైతును రాజును చేయాలి’ ఇది తరతరాలుగా మనకు వినిపించే మాట. ఇది నిజం కావాలంటే ఉన్న చట్టాలను మార్చాలి, కొత్తవి తేవాలి. రైతుల విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే చేస్తోంది. దేశంలో వ్యవసాయాన్ని సంస్కరించి, రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో రూపొందించిన రెండు చట్టాలకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ చట్టాలు రైతులకు మేలు చేసేలా ఉన్నా ఒక్క పంజాబ్ రైతులే ఎందుకు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో రైతులు లేరా? కొన్ని పార్టీలు రాజకీయ కారణాలతో రైతులను రోడ్లపైకి తీసుకొస్తున్నాయి.
రైతు ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం(ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు–2020, ధరల హామీ-, వ్యవసాయ సేవల(ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) బిల్లులను లోక్‌సభ, రాజ్యసభ ఆమోదించాయి. రైతు పండించిన పంటను తనకు నచ్చిన దగ్గర అమ్ముకునే అవకాశాన్ని కొత్త వ్యవసాయ చట్టం కల్పిస్తోంది. ఒకవేళ రైతుకు పంట వేసేందుకు పెట్టుబడి లేకపోతే ఒక వ్యాపారి, సంస్థతో ఒప్పందం చేసుకోవచ్చు. వ్యాపారి లేదా సంస్థ పెట్టుబడి పెట్టి రైతు పండించిన పంటను తీసుకుంటుంది. అది ఒప్పందంలో రాసుకున్న ప్రకారమే. ఇంతకుముందు రైతు తన పంటను పండించిన దగ్గర లేదా దగ్గర మార్కెట్లో అమ్మే అవకాశం ఉండేది. కానీ, కొత్త చట్టం ప్రకారం దేశంలో రేటు ఎక్కడ బాగుంటే అక్కడ రైతు పంట అమ్ముకోవచ్చు. పంట పండించిన తర్వాత అమ్మే సమయంలో రేటు ఎక్కువగా ఉంటే ఆ రేటుతోనే వ్యాపారి రైతు నుంచి పంట కొనాలి. ఒకవేళ మార్కెట్ రేటు పడిపోతే ఎలా అనే డౌట్ రావొచ్చు. రేటు పడిపోయినా ఒప్పందం ప్రకారమే వ్యాపారి పంట కొనాలి. ఎక్కువ రేటు ఉంటే రైతుకు లాభం వస్తది, తక్కువ రేటు ఉంటే ఒప్పందం చేసుకున్న రేటు రైతుకు వస్తది. ఇక్కడ రైతుకు ఎలాంటి నష్టం లేదు. ఇదే కొత్త చట్టం చెప్పేది.
రైతుకు భరోసా దొరికితే మంచిదేగా
మన దగ్గర ఒక్క రైతు కూడా ఎకరాకు వెయ్యి లేదా రెండు వేలు పెట్టి పంటకు బీమా చేయరు. రూ.లక్ష పెట్టుబడి పెట్టిన పంట పోతే రూ.50 వేలు కూడా రాని పరిస్థితి. కానీ, పెట్టుబడి సమయంలో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడానికి రైతు దగ్గర డబ్బులు ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యాపారి లేదా సంస్థ రైతుకు ఆసరాగా ఉంటే తప్పేముంది. కొత్త వ్యవసాయ చట్టం ప్రకారం ఇన్సూరెన్స్ ప్రీమియం తప్పకుండా చెల్లించాలి. దాని వలన వర్షాలు, గాలులకు పంట దెబ్బతిన్నా మనకు డబ్బులొస్తాయి. అలాగే దళారుల దందా లేకుండా నేరుగా వ్యాపారి లేదా సంస్థకు పంట అమ్మేయమని కొత్త చట్టం చెబుతోంది. రైతుకు 24 గంటల కంటే ఆలస్యంగా డబ్బులు ఇచ్చినా, తక్కువ రేటుకి కొన్నా సదరు వ్యాపారి లేదా సంస్థ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు కఠిన శిక్షకు గురవుతారు.
పంజాబ్‌లోనే ఆందోళనలు ఎందుకు
రైతుకు మేలు చేసేలా చట్టాలున్నా పంజాబ్ లో మాత్రమే రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్, బీహార్, కేరళ, ఉత్తరప్రదేశ్, బెంగాల్ లో రైతులు లేరా? మరి ఇన్ని రాష్ట్రాల ప్రజలు రైతు ఉద్యమంలో ఎందుకు లేరు. ఈ చట్టాలతో రైతులకు నిజంగానే నష్టం ఉంటే ఇవి పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు, 10 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్రాల ప్రజలు వాటిని ఎందుకు వ్యతిరేకించలేదు. ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఎలా గెలిచింది.
మండి ట్యాక్స్ లాంటివి ఉండవనే
పంజాబ్ లో ఎదగాలని 2014 నుంచి ప్లాన్ ప్రకారం బీజేపీ ముందుకు వెళుతోంది. ఇది అకాలీదళ్ వాళ్లకు 2019లో అర్థమైంది. పంజాబ్ లో ఆర్మీలో పనిచేసే వారి కుటుంబాలు ఎక్కువే. కాశ్మీర్లో ఆర్టికల్ 370, 35ఏ రద్దుతో పంజాబ్‌లో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. కొత్త వ్యవసాయ చట్టాలతో కాంగ్రెస్ ను ఢీకొట్టే స్థాయికి బీజేపీ చేరింది. ఇది గుర్తించే అకాలీదళ్ వ్యవసాయ చట్టాల పేరుతో బీజేపీతో తెగదెంపులు చేసుకుంది కానీ, ప్రజలు, రైతుల మీద ప్రేమతో కాదు. ఇక మండి ట్యాక్స్ విషయానికి వస్తే.. హర్యానా, పంజాబ్ లో సారవంతమైన భూమి ఎక్కువ. గోధుమ, వరి, బాస్మతి బియ్యం ఇలా ఎన్నో పంటలు పండుతాయి. కానీ, అక్కడ రైతులు తమ పంటను అమ్ముకోవడానికి ప్రతి మార్కెట్లో మండి ట్యాక్స్ కట్టాలి. ఈ మండి ట్యాక్స్ అంతా అక్కడి కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీల వాళ్లకే వెళుతుంది. కొత్త వ్యవసాయ చట్టాలతో మండి ట్యాక్స్ లాంటివి ఇక ఉండవని గ్రహించిన కాంగ్రెస్, అకాలీదళ్ నేతలు.. కొంత మంది రైతులను రెచ్చగొట్టి.. తమ పార్టీ కార్యకర్తలను రంగంలోకి దింపి ప్రజా ఉద్యమం పేరుతో నిరసన తెలుపుతున్నారు.
కొత్త చట్టాల్లో తప్పులను ఎత్తిచూపాలంటే దానికి సరైన పద్ధతేంటి? ఉద్యమంలో పాల్గొన్న వారు ఖలిస్థాన్ కావాలని ప్లకార్డులు పట్టుకోవడం ఏంటి? కాశ్మీర్లో ఆర్టికల్ 370, 35ఏ మళ్లీ పెట్టాలని డిమాండ్ చేయడం ఏంటి? రైతు ఉద్యమానికి వీటికి ఏం సంబంధం? ఇలాంటి నిరసనలు దేనికి సంకేతం? ప్రభుత్వం తప్పుడు విధానాలు అవలంబిస్తే, ప్రజలు, రైతులకు నష్టం జరిగితే ఉద్యమాలు చెయ్యాలి. కానీ ఇప్పటి చట్టాల్లో అలాంటివి లేవు కదా! పాత పద్ధతుల వల్ల రైతులకు నష్టం జరుగుతుందని మనమే అంటాం. అలాంటప్పుడు కొత్త పద్ధతులను అర్థం చేసుకుని స్వాగతించకపోతే ఎలా?
బీజేపీ బలపడుతోందనే
పంజాబ్ లో 50 ఏండ్లుగా కాంగ్రెస్, అకాలీదళ్ మధ్యనే ప్రధాన పోటీ. 2000 నుంచి అకాలీదళ్, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఉమ్మడిగా ప్రభుత్వం కూడా ఏర్పాటు చేశాయి. 2014 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు అకాలీదళ్ ఎన్డీయే ప్రభుత్వంలో ఉంది. 20 ఏండ్ల నుంచి బీజేపీతో స్నేహంగా ఉన్న అకాలీదళ్ అకస్మాత్తుగా తెగదెంపులు చేసుకుని, రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఎన్డీయే నుంచి బయటకి పోతున్నామని చెప్పింది. కానీ, ప్రధాని మోడీ దేశంలో మరీ ముఖ్యంగా పంజాబ్, హర్యానాల్లో రైతులు బాగుపడాలని కొత్త వ్యవసాయ చట్టం తెచ్చారు. దీంతో అకాలీదళ్ పునాదులు కదిలే పరిస్థితి వచ్చిందని అర్థం చేసుకుని బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. వాళ్ల పునాదులు ఎలా కదులుతున్నాయో తెలియాలంటే కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి. 1996 నుంచి 2014 వరకు వాజపేయి, అద్వానీ నేతృత్వంలో బీజేపీ పద్ధతి వేరు. మేం స్నేహంగా ఉంటాం, మీరు స్నేహంగా ఉండాలని మిత్రపక్షాలకు చెప్పేది. కానీ ప్రాంతీయ పార్టీలు తమ అధికారం కుటుంబం దాటి పోకూడదనే ఆలోచనతో ఉంటాయి. 1999 నుంచి శివసేన, టీడీపీ, మమత, జయలలిత ఇలా చాలా మంది వాజ్‌పేయి కాలంలో బీజేపీని మోసం చేసినవారే. అలానే ఇప్పుడు మోడీ హయాంలో అకాలీదళ్ చేద్దామనుకుంది. కానీ, ఢిల్లీ పీఠం మీద ఉన్నది మోడీ. ఆయన ముందు ఇలాంటి ఆటలు చెల్లవు.
డాక్టర్ సదానందం
గుళ్లపెల్లి హన్మకొండ