బీజేపీని తెలంగాణ నమ్ముతున్నదా? : కాలభైరవుడు

కేంద్రం నుంచి వచ్చిన ప్రతీ అగ్రనాయకుడు కేసీఆర్​ అవినీతి గురించి మాట్లాడి వెళ్లిపోవడం తెలంగాణ ప్రజలు హర్షించడం లేదు. వ్యవస్థలు వారి చేతిలో ఉన్నా , కేవలం మాటలకే పరిమితం అవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని, బలమైన నేతలు మోడీ, షా, బీఎల్​ సంతోష్​లనే టార్గెట్ ​చేసి ‘ఫాంహౌజ్’ కేసుతో కేసీఆర్​ బెదిరించడం చూస్తే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. కవిత ఈడీ ఆఫీసుకు వెళ్తే అదేదో ఢిల్లీకి యుద్ధానికి వెళ్లినట్లు మొత్తం మంత్రులు వెళ్లి నానా హంగామా చేస్తే బీజేపీ వర్గాల పేలవ ప్రదర్శన ఆశ్చర్యం కలిగించిందని అంటున్నారు. బండి సంజయ్​ను నిర్దాక్షిణ్యంగా అరెస్ట్​ చేసి ఓ జేబు దొంగకన్నా హీనంగా ఆయనపట్ల ప్రవర్తించిన దృశ్యంతో కవిత ఈడీ ఆఫీసుకు వెళ్లిన ఘటనను పోల్చుకుంటున్నారు. మునుగోడు ఎన్నికల సమయంలో జేపీ నడ్డాకు సమాధి కట్టడం, మోడీ హైదరాబాద్​వస్తే బూతులతో పోస్టర్లు వేస్తున్నా కిమ్మనకుండా జరుపుతున్న ‘సాత్విక రాజకీయం’ ప్రజలకు అర్థం కావడం లేదు. కేటీఆర్ ​ఓ వైపు ప్రధానిని బూతులు తిడుతుంటే.. పార్టీ నాయకులు ఇంకా బూత్​ కమిటీల ఏర్పాటులోనే మునిగి ఉండటం కొంత ఆశ్చర్యం, అసహనం కలిగిస్తున్నాయి. 

జంగారెడ్డి, మందాడి సత్యనారాయణరెడ్ది లాంటి ఆనాటి జనసంఘ్​నేతలు తెలంగాణ కోసం ఆరాటపడ్డారు, పోరాడారు. కొన్ని సందర్భాల్లో  తెలంగాణ కోసం  పార్టీతోనూ గొడవ పడ్డారు కూడా. అదొక చరిత్ర. 1980లో  బీజేపీ ఏర్పడింది. 1996లో 13 రోజుల వాజ్​పేయి ప్రభుత్వాన్ని పడగొట్టడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించాడు. దాంతో రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై బీజేపీ నేతలు దృష్టిపెట్టారు.1997 కాకినాడలో జరిగిన సభలో ఒక ఓటు రెండు రాష్ట్రాల తీర్మానం చేశారు. ఫలితంగా 1998 లోక్​సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ ఆంధ్రాలో రెండు, తెలంగాణలో రెండు లోక్​సభ స్థానాలను ఒంటరిగా గెలుచుకుంది. అదొక రికార్డు. ఒక్క తెలంగాణలోనే 26శాతం ఓట్లు సాధించి, టీడీపీని మూడో స్థానానికి నెట్టేసింది. అది చంద్రబాబును బెంబేలెత్తించింది. అప్పటిదాకా మతతత్వ బీజేపీకి  మద్దతిచ్చేది లేదని చెప్పిన చంద్రబాబు.. ఫలితాలు వెలువడిన మరుసటి రోజే వాజ్​పేయి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాడు. రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీకి బ్రేకులు వేయడానికే ఆయన కేంద్రంలో బీజేపీకి మద్దతు ప్రకటించాడని వేరే చెప్పనక్కర లేదు. దాంతో రాష్ట్రంలో బీజేపీ మరోసారి టీడీపీ ద్రుతరాష్ట్ర కౌగిలిలోకి వెళ్లిపోయింది. వాజ్​పేయి ప్రభుత్వం కూడా చంద్రబాబు కోసం  కాకినాడ తీర్మానాన్ని   అటకెక్కించింది.  వెంకయ్యనాయుడు సైతం తెలంగాణ ప్రాంత సెంటిమెంట్ ను  వాయిదా వేయించారు.  ఫలితంగానే ఆలే నరేంద్ర లాంటివారు బీజేపీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టడంతో ఆ పార్టీ కార్యకర్తలు స్ప్లిట్ అయ్యారు. అప్పటి వరకు తయారైన ఎందరో నాయకులు అన్ని పార్టీల్లో చేరిపోయారు. 2004 తర్వాత నుంచి తెలంగాణ మలి ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంఘాలు కీలక పాత్ర పోషించాయి. 2013లో  కేంద్రంలో బీజేపీ ప్రధానపక్షంగా ఉండటం వల్ల సుష్మా స్వరాజ్ నేతృత్వంలో ‘తెలంగాణ ఏర్పాటుకు సహకరించింది.  

ఉద్యమకారులను దెబ్బతీసిన కేసీఆర్​


కాకలు తీరిన ప్రసారమాధ్యమాలు కొన్ని కేసీఆర్​కు లొంగిపోగా, ఇంకొన్నింటిని తొక్కేస్తానని కేసీఆర్, కేటీఆర్​లు బహిరంగంగా హెచ్చరించారు. ఈ సందర్భంలో గతంలో ఉద్యమంలో పనిచేసిన చాలా మంది క్రెడిబులిటీని కేసీఆర్​ వాళ్లకు కూడా తెలియకుండా తగ్గించాడు. గద్దర్, కోదండరామ్​వంటి వాళ్లు నామమాత్రపు అవశేషాలుగా మిగిలిపోగా, ఓ పెద్ద వర్గం వివిధ పదవుల్లో కూచొని వంధి మాగదులై మురిసిపోతున్నారు. ఇక కాంగ్రెస్​ తరపున రేవంత్​రెడ్డి ఎంత ఎగిరి దుంకినా కేంద్రంలో కేసీఆర్​ అవసరం కాంగ్రెస్​కు తప్పనిసరి అన్న విషయం కేసీఆర్​కు తెలుసు. కమ్యూనిస్టులు రోజూ నరేంద్ర మోడీని తిట్టుకుంటూ కేసీఆర్​ గేటు దగ్గర ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నారు.

పద్మవ్యూహంలో సంజయ్​

ఇన్ని అవకాశాలు పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ సంజయ్​ నేతృత్వంలో కేసీఆర్​కు నేరుగానే సవాల్​ విసురుతున్నది. అయితే ఎన్నికల్లో గెలవనేర్చిన కేసీఆర్​ముందు బీజేపీ నిలబడగలదా? అన్న మైండ్​గేమ్​ బీఆర్ఎస్​వర్గాలు ఆడుతున్నాయి. సంజయ్​పరిస్థితి పద్మవ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుడిలా ఉంది. కృష్ణార్జునుల్లాంటి మోడీ, షాలు ఎక్కడో ఉన్నారు. కేసీఆర్​వేసే వ్యూహాల ముందు సంజయ్​బలం సరిపోదని బీఆర్ఎస్​తోపాటు బీజేపీ నాయకులు   కూడా ప్రచారం  చేస్తున్నారు. 2014 తర్వాత ఇటీవల కర్నాటక ఎన్నికల్లో సోషల్​మీడియాతోపాటు అనేక వ్యూహాలు మొదటిసారి బీజేపీ ప్రయోగించింది. ఏకంగా ప్రధాని 26 కిలోమీటర్ల రోడ్​షో తో మాస్​ హిస్టీరియా క్రియేట్​చేసే ప్రయత్నం చేయాల్సి వచ్చింది. కానీ అందులో సగభాగం తెలంగాణలో శక్తియుక్తులను ప్రయోగిస్తే అధికారం సొంతమవుతుందన్నది మొన్నటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు స్పష్టం చేశాయి.  తెలంగాణలో కేసీఆర్​తో ‘కసి’ రాజకీయం చేయకుండా, కేవలం మాటల రాజకీయం చేస్తే  బీజేపీ ఎదగడం ఎన్నటికీ సాధ్యం కానిపని. ఆ విషయాన్ని ఆ పార్టీ జాతీయ నాయకత్వం గుర్తిస్తున్నదో, లేదో అనేదే ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న అసలైన అనుమానం.

మెయిన్​ స్ట్రీమ్​ మీడియా లేకుండా..

సంజయ్​వెంట సుమారు ఓ వందమంది వ్యూహకర్తలు ఉంటేగానీ కేసీఆర్​తో యుద్ధానికి దిగే పరిస్థితి లేదు. ప్రభుత్వ సలహాదారులే 50 మంది ఉన్నతోదోగులు కేసీఆర్​వెంట ఉన్నప్పుడు సంజయ్​ వ్యూహం ఎలా ఫలిస్తుంది? అని మీడియా వాళ్లు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్​ఇంకో వెయ్యేండ్లు ఉన్నా పర్వాలేదు గానీ, బీజేపీని అడుగు పెట్టనీయవద్దని  సోకాల్డ్ ​సెక్యులర్, మీడియా అధినేతలు, మేధావులు తలపోస్తున్న సమయంలో బీజేపీ ఒక్క మీడియా సంస్థను  మెయింటేయిన్​ చేయకుండా కేవలం సోషల్​ మీడియాను నమ్ముకోవడం ఆత్మహత్యా సదృశ్యమే!. ఇప్పుడు చాలా సోషల్​మీడియా గ్రూపులు బీఆర్ఎస్​కు అనుకూలంగా పనిచేస్తున్నాయి.  

ఆత్మపరిశీలన ఏది?

ఇక బీజేపీలోని కిషన్​రెడ్డి, ఈటల, రఘునందన్... ఇంకా పాతవారు ఎవరి గ్రూపు వారిదే. చాలా మందికి సంజయ్​కుమార్​పై కంప్లయింట్​ఉంది. అలాగే పార్టీలోకి కొత్తగా వచ్చినవారికి, పాతవారికి మధ్య సమన్వయం లేకనే ఇదంతా జరుగుతుందంటున్నారు. ఫామ్​హౌజ్​ కేసు, మునుగోడు ఎన్నికపై ఎలాంటి ప్రభావం చూపిందో ఇంతవరకు సమీక్ష జరగలేదు. ఏ నాయకుడిని ఎలా ఉపయోగించాలో, సమాజంలోని నిపుణులను, వ్యవస్థలను ఎలా ఉపయోగించుకోవాలో కేసీఆర్​కు తెలిసినంత బీజేపీ నాయకులకు తెలియడం లేదు. కేసీఆర్​ ఇష్టారాజ్యాంగా నామినేటెడ్​పోస్టులు భర్తీ చేస్తుంటే ఉన్న పోస్టులు ఇవ్వడానికి కూడా బీజేపీకి మనసు రావడం లేదు. ఇపుడు తెలంగాణ, పాండిచ్చేరిలకు ఒకే గవర్నర్​ఎందుకు? రోశయ్యను, నరసింహన్​లను అన్నాళ్లు ఎందుకు కొనసాగించారు? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు.

ప్రజలు పెట్టిన శీలపరీక్షకు సిద్ధమేనా? 

ఎన్నికల నోటిఫికేషన్​కు నాలుగు నెలలకు మించి సమయం లేకున్నా టికెట్​ఎవరికి వస్తుందో తెలియదు. కొత్తవాళ్లు ఎవరో వస్తారని నోరు తెరచుకొని అవకాశవాదుల కోసం చూసే బదులు ఇపుడు పెద్దనాయకులు ఓ 50 మంది పోగా మిగతా 50 మంది అన్ని వర్గాల నుంచి, రంగాల నుంచి ప్రకటించి నియోజకవర్గాల్లో తిరగమని చెప్పొచ్చు. పంజాబ్, ఢిల్లీలో ఆప్​ ఆ పని చేయగలిగినప్పుడు, ఇక్కడెందుకు సాధ్యం కాదు? అన్నది ప్రశ్న. అసెంబ్లీ నియోజకవర్గాలకు కొన్నిచోట్ల బలమైన అభ్యర్థులు లేకపోగా, ఉన్నచోట్ల  పాము ముంగీసల్లా పోట్లాడుకుంటున్నారు. ఈ వ్యవస్థను సరిచేయకుండా టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలున్న కేసీఆర్​తో ఢీకొట్టడం పొట్టేలు కొండను ఢీకొట్టినట్లే అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. కొందరు కవిత అరెస్ట్​అయితేనే బీజేపీని నమ్ముతాం అని శీలపరీక్ష పెడుతున్నారు. అది నిజమే కావొచ్చు కానీ, వ్యవస్థలను, పోలీస్​కానిస్టేబుల్​ మొదలుకొని డీజీపీ వరకు అందరినీ వాడుతున్నది కేసీఆరే అని తెలంగాణ మొత్తం వినబడుతున్నా, బీజేపీ నాయకులకు అర్థం కావడం లేదని ప్రజల భావన. ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీని ఏండ్ల తరబడి తెలుగుదేశం మింగేసింది. ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో జాతీయనేతల కసి రాజకీయం లేక బీజేపీని బీఆర్​ఎస్​ మింగేసే అవకాశం ఉంది.  సంజయ్​నేతృత్వంలో  కొత్త ఆశలు ఏర్పడినా, జాతీయ నాయకత్వం సీరియస్​నెస్ ప్రజలకు కనిపించడంలేదు, సరైన వ్యూహం లేకుండా గుడ్డెద్దు చేలోపడినట్లు చేస్తున్న వ్యూహం ‘మిస్​ఫైర్’ అవుతుందని మేధోవర్గ విశ్లేషణ. ఈ అవకాశం జారవిడుచుకుంటే సంజయ్​ ప్రయత్నమంతా ఏట్లో పిసికిన చింతపండు కథే...

మాటలు  తప్ప చేతలు లేక..

హైదరాబాద్ ​భూదందా ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్​ కుటుంబానికి ఆదాయం తెచ్చి పెడుతోందని బీజేపీ నాయకులే ఆరోపిస్తూ వాటిపై ఎలాంటి విచారణకు ప్రయత్నం చేయకుండా వంద కోట్ల లిక్కర్​ స్కామ్ ​గురించి మాట్లాడటం ప్రజల అవగాహనకు అందడం లేదు. అలాగే తెలంగాణలో ఐఏఎస్​ అధికారులు బరి తెగించినంతగా ఎక్కడా లేదని రోజూ ఆరోపణలు చేస్తున్నారు. కొందరు ఉత్తరాది రాష్ట్రాల ఐఏఎస్​ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి రోజూ నేరుగా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ చేస్తున్నారు. ముఖ్యంగా భూదందాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ఆరోపణలు చేస్తున్న వారిపై డీవోపీటీకి ఫిర్యాదు చేసే విభాగం బీజేపీకి గట్టిగా లేదని అంటున్నారు. సోమేశ్​ కుమార్​ అవినీతి తిమింగలం అని బండి సంజయ్​ అంటున్నా, అతనిపై దర్యాప్తునకు ముందడుగు వేయడం లేదు. కొన్ని  పత్రికల వాళ్లు బీజేపీని రోజూ దుమ్మెత్తి పోస్తూ ఉండటం అందరూ చూస్తున్నారు. మరి అదే పత్రికాధిపతితో అమిత్​షాను భేటీ చేయించడం వ్యూహమా! వ్యూహాత్మక తప్పిదమా?

కొత్త రక్తంతో సీన్​ మారింది

2014 తర్వాత ఇక్కడి ప్రజల సెంటిమెంట్​ ఆధారంగా కేసీఆర్​కు ఎదురులేకుండా పోయింది. ప్రధాన పక్షంగా ఉన్న కాంగ్రెస్​లో గెలిచిన ఎమ్మెల్యేలు ‘పునరేకీకరణ’ పేరుతో గంపగుత్తగా కేసీఆర్​ వైపు చేరారు. కేంద్రంలో చావు దెబ్బతిన్న కాంగ్రెస్​ ఇక్కడి పార్టీని  సరిదిద్దే స్థితిలో లేకపోగా.. ఇక్కడి నాయకులు ఉత్తమ్​కుమార్​రెడ్డి, జానారెడ్డి నేతృత్వంలో కేసీఆర్​కు కావల్సినంత ‘సందు’ దొరికింది. టీడీపీలో కీలక వ్యక్తులు కేసీఆర్​తో చేరిపోవడంతో తెలంగాణ ప్రతిపక్షం దిక్కులేని జింకపిల్లలా దిక్కులు చూసింది. మొదటి విడత ప్రభుత్వంలో అడగకున్నా కేంద్రానికి సహకరించిన కేసీఆర్,​2019 పార్లమెంట్​ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లు గెలవడంతో, ఓట్​షేర్​ పెరగడంతో పొరపొచ్చాలు మొదలయ్యాయి. కరీంనగర్​ పార్లమెంట్​సభ్యుడైన బండి సంజయ్​ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కావడంతో సీన్​ మారిపోయింది. అప్పటి వరకు హైదరాబాద్​ నగరం నుంచే అధ్యక్షులయ్యే సంప్రదాయం, తెలంగాణ వచ్చాక ఉత్తర తెలంగాణ నుంచి కావ డం, సంజయ్​ సాధారణ కార్యకర్తగా ఎదగడంతో పార్టీకి కొత్త జవసత్వాలు  వచ్చాయి. పార్టీని యువ ‘హిందూ ఓటు బ్యాంకు’తో నింపే ప్రయత్నం సంజయ్​ చేయగలిగాడు.

కాలభైరవుడు