
- లా అండ్ ఆర్డర్ సమస్యలకు ఓ జిల్లా... రెవిన్యూకు మరో జిల్లా
జయశంకర్ భూపాలపల్లి/ భూపాలపల్లి అర్బన్, వెలుగు: పాలనపరంగా సర్కారు తీసుకున్న నిర్ణయాలు ఆ ఐదు గ్రామ పంచాయతీలకు శాపంగా మారాయి. ఆ ఊళ్ల ప్రజలు రెవెన్యూ సమస్యల కోసం జయశంకర్భూపాలపల్లి జిల్లాకు.. లా అండ్‌ఆర్డర్ సమస్యలైతే ములుగు జిల్లాకు తిరుగుతున్నారు. ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌పరిధిలో ఓట్లు వేసి.. పనుల కోసం మరో ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో కొన్ని సర్కారు స్కీములు లబ్ధిదారులకు అందడంలేదు. ఇలా ఐదేండ్ల నుంచి ఐదు ఊళ్ల జనం తిప్పలు పడుతూనే ఉన్నారు. కానీ వారి కష్టాన్ని ఎవరూ తీర్చడం లేదు.
2 పాతవి.. 3 కొత్తవి
తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాల విభజన జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం జిల్లాల సంఖ్యను పెంచడంతోపాటు కొత్త జీపీలను ఏర్పాటు చేసింది. అంతకు ముందున్న వరంగల్‌జిల్లాను ఆరు జిల్లాలుగా మార్చింది. వాటిలోని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పెద్దాపూర్, గుర్రంపేట జీపీల పరిధిలో సుబ్బక్కపల్లి, బావ్ సింగ్‌పల్లి, రాంనాయక్‌తండా ఉండేవి. కొత్త పంచాయతీల ఏర్పాటులో భాగంగా ఈ మూడు తండాలను కూడా జీపీలుగా మార్చారు. దీంతో రెండు జీపీలు కాస్త ఐదుగా మారాయి. కాగా పంచాయతీల రెవెన్యూ పరిధిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం కింద చేర్చిన అధికారులు.. లా అండ్ ఆర్డర్‌ను పాత వెంకటాపూర్ మండల పరిధిలోనే ఉంచారు. దీంతో ఈ ఐదు గ్రామపంచాయతీల ప్రజలు రెవెన్యూ ఇబ్బందులు ఉంటే భూపాలపల్లి జిల్లాకు, లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉంటే ములుగు జిల్లా పోలీసుల దగ్గరకు వెళ్లాల్సి వస్తోంది.
సర్కారు స్కీములు అందుతలేవ్
ఐదు గ్రామ పంచాయతీలు భూపాలపల్లి జిల్లా పరిషత్ కింద ఉండగా.. అసెంబ్లీ సెగ్మెంట్పరంగా ములుగు పరిధిలో ఉన్నాయి. ఇది ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. స్థానిక ఎమ్మెల్యే డబుల్ బెడ్రూం ఇండ్ల స్కీమ్కింద ఈ ఐదు గ్రామాలను చేర్చలేదు. దీంతో ఈ ఊళ్లలో ఒక్కరికి కూడా ‘డబుల్’ ఇండ్లు మంజూరు కాలేదు. దళితబంధు స్కీమ్ కూడా ఈ ఊళ్లకు అందలేదు. సర్కారు అమలు చేస్తున్న స్కీమ్ ల కోసం ములుగు ఎమ్మెల్యే దగ్గరికి పోతే మీ ఊళ్లు మా పరిధిలో లేవంటున్నారని.. భూపాలపల్లి ఎమ్మెల్యేను కలిస్తే మీరు మాకు ఓటు వేయలేదని తిప్పి పంపుతున్నారని జనం వాపోతున్నారు. తమ జీపీలను పూర్తి స్థాయిలో ఏదో ఒక మండలంలో విలీనం చేయాలని కోరుతున్నారు.
జనానికి న్యాయం చేయలేకపోతున్నా
మా ఊరు రెండు జిల్లాల కింద ఉండడం వల్ల నానా ఇబ్బందులు పడుతున్నాం. నన్ను సర్పంచ్‌గా ఎన్నుకున్న జనానికి ఒక్క స్కీమ్ కూడా అందించలేకపోయా. ఎంతో చేయాలని పదవిలోకి వచ్చి ఏం చేయలేకపోతున్నానన్న బాధ ఉంది. ఐదు గ్రామాలను భూపాలపల్లి మండలంలో కలిపేసి మాకు న్యాయం చేయాలి.
– నాగవత్ సుమన్, సర్పంచ్, సుబ్బక్కపల్లి
తిరగలేక పోతున్నం
లా అండ్ ఆర్డర్సమస్య ఉంటే ఒక జిల్లా.. రెవెన్యూ సమస్యల కోసం మరో జిల్లాకు తిరగలేకపోతున్నాం. ఐదేండ్లుగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి గుర్రంపేటతోపాటు మిగిలిన 4 గ్రామాలను భూపాలపల్లి మండలంలో పూర్తిగా విలీనం చేయాలి.
– మార్క శ్వేత, సర్పంచ్, గుర్రంపేట
ఏ స్కీమూ అందట్లే
మా జీపీ భూపాలపల్లి జిల్లా పరిషత్ కింద ఉన్నా నియోజకవర్గ పరిధి ములుగు కింద ఉంది. మమ్మల్ని అటు ములుగు ఎమ్మెల్యే కానీ ఇటు భూపాలపల్లి ఎమ్మెల్యే కానీ ఎవరూ పట్టించుకోవడంలేదు. గ్రామంలోని ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితబంధు రాలేదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి.
– మామిడి మొండయ్య, సర్పంచ్, పెద్దాపూర్