
- కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది నిజమే..
- ప్రభుత్వాన్ని కూల్చాలని, అందుకు చందాలేసుకుని డబ్బులిస్తామని జనమే అంటున్నరు
- సీఎం రేవంత్ కోసం పని చేస్తున్న పోలీసులను వదిలిపెట్టేది లేదని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వాన్ని కూల్చాల్సిన ఖర్మ తమకేం పట్టలేదని, ఎప్పుడో ఒకప్పుడు బంగ్లాదేశ్‌లోలాగా తిరుగుబాటు వచ్చి ప్రజలే ప్రభుత్వాన్ని కూల్చేస్తారని బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్అన్నారు. ‘‘కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. మేం వెళ్లినప్పుడు కూడా ప్రభుత్వంపై ఉన్న ఆక్రోశాన్ని ప్రజలు చెబుతున్నారు. ‘ఈ దరిద్రాన్ని ఎన్నాళ్లు భరించాలి.. ఎత్తి అవతలపడేయండి’ అని అంటున్నారు.
అవసరమైతే చందాలు పోగేసుకుని డబ్బులు ఇస్తామంటున్నారు. వాళ్ల ఆక్రోశాన్నే ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. మా వద్దకు కూడా ప్రజలు వచ్చి అదే విషయం చెబుతున్నారు. ప్రభుత్వంపై ఆ స్థాయిలో వ్యతిరేకత ఉంది” అని వ్యాఖ్యానించారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వంపై ప్రజలు కోపంతో ఉన్నారని ఆయన అన్నారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డికి సెక్యూరిటీ లేకుండా ఒక్క ఊరికైనా వెళ్లే ధైర్యం ఉందా? సోషల్‌మీడియాలో కాదు.. బయటనే జనాలు రేవంత్‌ను తిట్టుకుంటున్నారు. ఇదో దరిద్రపు ప్రభుత్వమంటున్నారు. ప్రజలు తలచుకుంటే ఎంతటి నియంతైనా పీఠం దిగాల్సిందే. ఏ రాజకీయ నాయకుడైనా అధికార మదం, అహంకారంతో నియంతలం, చక్రవర్తులం, రారాజులం అని భావిస్తే ప్రజాస్వామ్యంలో అలాంటి వారికి చోటు లేదు” అని అన్నారు.
ప్రజలు తీసుకున్న నిర్ణయానికి ఐదేండ్లు ప్రభుత్వం ఉండాలని, రేవంత్‌రెడ్డే సీఎంగా ఉండాలని.. ప్రజలకు కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నదో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘మూటల వేట కోసం సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న అక్రమాలతో అధికారులు బలిపశువులు అవుతున్నారు. ఐఏఎస్‌లు, ఫారెస్ట్‌అధికారులు సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. కొందరు పోలీసులు రేవంత్‌రెడ్డికి ప్రైవేట్సైన్యంలా పని చేస్తున్నారు. ఆ కొందరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారిపైనా సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఇష్టానుసారం అడ్డమైన కేసులు పెడుతున్న పోలీసు అధికారులనూ వదిలిపెట్టేది లేదు” అని హెచ్చరించారు.
భూముల వివాదంపై కేంద్రం మౌనమెందుకు?
హెచ్‌సీయూలో వేలాది చెట్లను నరికేసి, అక్కడి జంతువులకు నిలువ నీడ లేకుండా చేశారని.. దీని వెనుక బడా ఆర్థిక మోసం జరిగిందని సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ఎంపవర్కమిటీ నివేదిక ఇచ్చిందని కేటీఆర్తెలిపారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ‘‘హెచ్‌సీయూ భూములపైకి అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమాగం చేసిందని ప్రవచనాలు చెప్పిన ప్రధాని మోదీ.. రేవంత్ ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుతున్నారు? మోదీ ఏడాదికోసారి మాట్లాడుతారు. తెలంగాణలో రాహుల్, రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తూ విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని ఏడాది కిందట 2024 ఏప్రిల్‌లో మోదీ ఆరోపించారు. కానీ ఇప్పటికీ విచారణ లేదు. మళ్లీ సంవత్సరానికి నిద్ర నుంచి మేల్కొని నిన్న మాట్లాడిండు’’అని కేటీఆర్ అన్నారు.