యాదాద్రి, వెలుగు: యాసంగి వడ్లలో నూక శాతం ఎంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తేల్చలేదు. ఈ కారణంగా యాసంగి 2021-–22 వడ్లను మిల్లర్లు మిల్లింగ్చేయడం లేదు. దీంతో ఆ సీజన్‌లో వచ్చిన వడ్లు మొత్తం మిల్లుల్లోనే పేరుకుపోయాయి. ఇలాగే ఉంటే.. నవంబర్‌లో వచ్చే వానాకాలం వడ్ల నిల్వకు ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆఫీసర్లు చెప్తున్నారు. యాసంగి వడ్లను ముట్టకుండా గత సీజన్వానాకాలం వడ్లనే మిల్లర్లు మిల్లింగ్ చేస్తున్నారు. కొన్నేండ్లుగా యాసంగి సీజన్‌లో ఉప్పుడు బియ్యం మాత్రమే ఎఫ్‌సీఐకి ఇచ్చేవారు. ఈసారి ఎఫ్‌సీఐ ఉప్పుడు బియ్యాన్ని నిరాకరించింది. రా రైస్ ఇస్తేనే తీసుకుంటామని తేల్చి చెప్పింది. ఈ విషయంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడిచింది. చివరకు రా రైస్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే వానాకాలంలో క్వింటాల్వడ్లకు 18 కిలోల నూకలతో కలిపి 68 కిలోల బియ్యం ఇవ్వాలనే నిబంధన ఉండేది. యాసంగిలో ఎఫ్‌సీఐకి ఉప్పుడు బియ్యం తీసుకునే వారు. 17 కిలోల నూకలతో కలిపి 67 కిలోలు ఎఫ్‌సీఐకి అందించే వారు. అయితే ఇక నుంచి రా రైస్ ఇవ్వాల్సి ఉండడంతో ఇందులో బియ్యం 25 కిలోల కంటే ఎక్కువ రావని, నూక శాతం పెరిగి తమకు నష్టం వస్తుందని మిల్లర్లు పేచీ పెట్టారు. తమకు క్వింటాల్‌కు రూ. 300 చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిల్లర్ల డిమాండ్‌కు రాష్ట ప్రభుత్వం అంగీకరించలేదు. నూక శాతం ఎంత వస్తుందో తెలుసుకుని ఆ తర్వాతే యాసంగి బియ్యం టార్గెట్ నిర్ణయించాలని సర్కార్భావించింది. యాసంగి సీజన్ క్వింటాల్ వడ్లలో నూక, బియ్యం ఎంత వస్తుందో తెలుసుకోవడానికి సీఎస్ సోమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేసింది. నూకశాతం తేల్చే పనిని మైసూర్‌కు చెందిన ‘సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’ (సీఎఫ్టీఆర్ఐ)కి అప్పగించింది. ఈ మేరకు మైసూరు శాస్త్రవేత్తలు జూన్ 22, 23 తేదీల్లో యాదాద్రి జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో వడ్లను టెస్ట్ మిల్లింగ్ చేసి శాంపిళ్లు తీసుకున్నారు. శాంపిళ్లు తీసుకొని నెలన్నర గడిచిపోయింది. ఇప్పటి వరకూ క్వింటాల్ వడ్లలో నూక శాతం ఎంత.? బియ్యం ఎంతో తేల్చలేదు.
తేల్చకుంటే ఇబ్బందే..
సీఎఫ్టీఆర్ఐ శాస్త్రవేత్తలు టెస్ట్మిల్లింగ్చేశారు. కానీ.. ఇప్పటివరకూ యాసంగి వడ్లలో నూక శాతం ఎంత వస్తుందో తేల్చలేదు. దీంతో మిల్లర్లు మిల్లింగ్చేయలేదు. 2021–-22 యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లాలోని 41 రైస్‌మిల్లుల్లో 2.05 లక్షల టన్నుల వడ్ల స్టాక్ ఉంది. నూక విషయం తేల్చకున్నా, ఆలస్యం చేసినా యాసంగి వడ్లు స్టాక్ మిల్లుల్లో ఎక్కువగా ఉంటుంది. మళ్లా నవంబర్ నుంచి వానాకాలం వడ్ల కొనుగోలు ప్రారంభమవుతుంది. అప్పుడు వడ్లను నిల్వ చేయడానికి స్పేస్ ప్రాబ్లం తలెత్తి ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆఫీసర్లు అంటున్నారు. వానాకాలం 2021 సీజన్‌కు సంబంధించి 2,64,682 టన్నుల వడ్లను సీఎంఆర్ కోసం మిల్లులకు ఇవ్వగా 1,77,336 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు 77,517 టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అందించగా(1,31,761 టన్నుల వడ్లు) 99,819 టన్నుల బియ్యం అందించాల్సి ఉంది.
ఇంకా చెప్పలే
యాసంగి వడ్లలో నూక, బియ్యం శాతం ఎంత వస్తుందో కమిటీ ఇంకా చెప్పలేదు. ఈ కారణంగా మిల్లర్లు యాసంగి వడ్లను మిల్లింగ్చేస్తలేరు. వానాకాలం సీజన్ వడ్లనే మిల్లింగ్చేస్తున్నరు.
– గోపీకృష్ణ, డీఎం, సివిల్ సప్లై డిపార్ట్మెంట్