ఎమ్మెల్యేకు ఫోన్ చేసి రాజీనామా చేయమన్న వ్యక్తికి బెదిరింపులు

మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఫోన్ చేసి, రాజీనామా చేయమని కోరిన వ్యక్తిని టీఆర్ఎస్ నేతలు బెదిరించారు. రాజీనామా చేయమన్న వ్యక్తికి ఇవాళ   ఫోన్ చేసి..ఎక్కడ అభివృద్ధి జరగలేదో చెప్పమని తిట్టారు. మాతో పెట్టుకుంటే నీ సంగతి చూస్తామంటూ హెచ్చరించారు. సదరు బెదిరింపు కాల్ ఎమ్మెల్యే అనుచరుల పనే అంటూ అనుమానాలు కలుగుతున్నాయి. 

మెదక్​ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన స్వామి అనే వ్యక్తి శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఫోన్​ చేశాడు. మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న తీరు, అక్కడ ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మాట్లాడారు. మునుగోడు మాదిరిగానే  మెదక్​ నియోజకవర్గం కూడా అభివృద్ధి కావాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని పద్మాదేవేందర్​రెడ్డిని కోరాడు. 

ఈ ఆడియో కాల్ లోకల్ గా షేర్ చేయడంతో వైరల్ అయింది. మీడియాలో కూడా రావడంతో హాట్ టాపిక్ గా మారింది. దీంతో భయాందోళనకు గురైన కాట్రియాల గ్రామస్తుడు స్వామికి బెదిరింపులు మొదలయ్యాయి. కాట్రియాల గ్రామంలోని సెంటర్లోకి రమ్మంటూ ఫోన్ చేసి  బెదిరించారు.  ‘‘ నువ్వెంతా.. నీ తాకత్ ఎంత.. మాతో పెట్టుకుంటే నీ సంగతి చూస్తాం’’ అంటూ బూతులు తిట్టారు. పద్మాదేవేందర్ రెడ్డికి క్షమాపణ చెబుతూ మెస్సేజ్ చేయమని ఒత్తిడి చేశారు.