తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల వేడి ఒకవైపు, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ దుమారం మరోవైపు చెలరేగుతోంది. పెగాసస్ స్పైవేర్ 2021లో పార్లమెంటును కుదుపు కుదిపింది. 2023 సంవత్సరంలో తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలుపొందడం కోసం, రాజకీయ లబ్ధి కోసం.. ప్రత్యర్థుల్ని, తమ పార్టీ నాయకుల్ని, వ్యాపారస్తులు, సినీ ప్రముఖులు, జర్నలిస్టుల ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కోసం ఏకంగా రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో ఉన్న 518 (స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో) సిబ్బందిను ఉపయోగించుకుంది. ఇది వాటర్‌గేట్ కుంభకోణాన్ని తలపిస్తోంది.
వా టర్‌గేట్ కుంభకోణం యునైటెడ్ స్టేట్స్‌లో 1972 నుంచి 1974 వరకు ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ పరిపాలనతో కూడిన ప్రధాన రాజకీయ కుంభకోణం. న్యాయాన్ని అడ్డుకోవడం, అధికార
దుర్వినియోగం, కాంగ్రెస్‌ను ధిక్కరించినందుకు నిక్సన్ అభిశంసనకు గురయ్యారు. ఇది నిక్సన్ రాజీనామాకు దారితీసింది. కాగా, బీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో, గ్రేటర్ హైదరాబాద్ 2023 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఏకంగా 518 పోలీస్ అధికారుల చేత నడిపించినట్లుగా బట్టబయలైంది.
ప్రత్యర్థులపై పోలీస్ నిఘా
ఎస్‌ఐబీలో తమకు సంబంధించిన పోలీస్ అధికారులను నియమించి ప్రత్యర్థులపైన నిఘాను ఉంచింది. చివరికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలుపొందటంతో హుటాహుటిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన హార్డ్ డిస్క్‌లను తీసేయడం కోసం పోలీస్ అధికారి ఆఫీసుకు రావడంతో ఈ విషయం బట్టబయలైంది. అయితే, ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి? ఈ ఫోన్ ట్యాపింగ్‌ను ఎలాంటి సందర్భంలో చేయవచ్చు? రాజ్యాంగబద్ధంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన చట్టాలు ఉన్నాయా? ట్యాపింగ్ న్యాయబద్ధమైనవా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ క్రమం..
ఫోన్ ట్యాపింగ్ అంటే.. ఒక వ్యక్తి లేదా అధికారి మాట్లాడుతున్న సంభాషణలను రహస్యంగా వినడమే. ఫోన్ ట్యాపింగ్ 1890 లలో టెలిఫోన్ రికార్డర్‌ను కనిపెట్టిన తర్వాత మొదటిసారిగా యూఎస్ఎలో ప్రారంభించబడింది. యూఎస్ఎ సుప్రీంకోర్టు దీనిపై 1928లో నిషేధిత చట్టంగా చేసింది. కాగా, రాయ్ ఓల్మ్‌స్టెడ్, సీటెల్ అక్రమ మద్యం రవాణా కేసులో అరెస్ట్ అయ్యారు. వీరి ఇంటిలోని ఫోన్‌ను ట్యాప్ చేయడం ద్వారా సేకరించిన సాక్ష్యాల ఆధారంగా దోషిగా నిర్ధారించబడ్డారు. అధికారులు తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించారని పేర్కొన్నారు. 'కాట్జ్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్” కేసులో యూఎస్ సుప్రీంకోర్టు ఫోన్ ట్యాపింగ్‌కు వారెంట్ అవసరమని పేర్కొంది. 1978లో, జాతీయ భద్రతా కేసుల్లో వారెంట్‌లను జారీ చేయడానికి ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వైలెన్స్ యాక్ట్ ను (ఎఫ్ఐఎస్ఎ) రూపొందించింది.
పెగాసస్ సాంకేతిక పరిజ్ఞానం
ఈ ఫోన్ ట్యాపింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ పెగాసస్‌ను తయారుచేసింది. ఇది మొదటిసారిగా 2016లో వెలుగులోకి వచ్చింది. దీంతో ఐ ఫోన్‌ను కూడా హ్యాక్ చేసే విధానం రావడంతో ఐ ఫోన్ తన ఓఎస్‌ను అప్‌డేట్ చేసుకుంది. ఆ తర్వాత పెగాసస్, ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా హ్యాక్ చేసే సామర్థ్యాన్ని సంపాదించుకుంది. దీంతో 2019 లో ఈ స్పైవేర్ కలకలం సృష్టించింది. తమ ఫోన్‌లోకి ఈ పెగాసస్ ద్వారా జర్నలిస్టుల, రాజకీయ నాయకులు తమ ఫోన్లు హ్యాక్ అయినట్లు ఆరోపించారు. పెగాసస్ వల్ల తన యూజర్స్‌కు ఇబ్బంది కలిగినట్లుగా వాట్సాప్ కంప్లయింట్ కూడా చేసింది. మరోవైపు ప్రాన్స్‌కు చెందిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఫర్చిడెన్ అనే నివేదికను రూపొందించింది. ఈ నివేదికలో 50 దేశాలలో 50,000 మందికి పైగా ఫోన్లు హ్యాక్ అయినట్లుగా గుర్తించింది. ఈ కథనాన్ని ద వైర్, వాషింగ్టన్ పోస్ట్‌తో పాటుగా ప్రపంచంలోని 16 వార్తా సంస్థలు ప్రచురించాయి. భారత దేశంలో కూడా 300 మంది భారతీయుల ఫోన్లను హ్యాక్అయినట్టుగా పేర్కొంది. ఆ తర్వాత యూకేకు చెందిన ది గార్డియన్ పత్రిక కథనంలో కూడా భారతదేశంలో 40 మంది జర్నలిస్టుల, రాజకీయ నాయకుల, న్యాయవాదుల ఫోన్లు హ్యాక్ అయినట్లుగా ప్రచురించింది. దీంతో 2021 డిసెంబర్లో మోదీ ప్రభుత్వంపైన పార్లమెంట్‌లో ఈ పెగాసస్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాజకీయ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నట్టు దుమారం రేగింది.
భారత్‌లో ఫోన్ ట్యాపింగ్
ఫోన్ ట్యాపింగ్‌ను మన దేశంలో ముఖ్యంగా ఉగ్రవాద, నక్సల్స్, అసాంఘిక, వేర్పాటు వాద, సంఘ విద్రోహ శక్తులు కదలికలు తెలుసుకోవడం కోసం రహస్యంగా కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలు ప్రభుత్వం అనుమతి తో మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన హోం సెక్రటరీ అనుమతితో మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాలి. కేంద్ర దర్యాప్తు సంస్థలు, రాష్ట్రాల్లో వివిధ పోలీస్ శాఖలు ఈ ఫోన్ ట్యాపింగ్‌ను చేస్తుంటాయి. కేంద్రంలో 10 ఏజెన్సీలకు ముఖ్యంగా ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, జాతీయ దర్యాప్తు సంస్థ, రా(ఆర్ఎడబ్ల్యూ), డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌లకు మాత్రమే ఉంది. ట్యాపింగ్‌కు సంబంధిత అధికారి తప్పనిసరిగా రాతపూర్వకంగా ట్యాప్ చేయడానికి కారణాలను నమోదు చేయాలి. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ చిత్రా రామకృష్ణ, ఉద్యోగుల అక్రమ ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కేసులో ఢిల్లీ హైకోర్టు ఆమె ను జైలు నుంచి విడుదల చేసింది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసును దేశ రాజధానిలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దాఖలు చేశారు. ఈ కేసులో ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) లోకేశ్ శర్మను రోహిణి ప్రశ్నించారు. 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఐటీ చట్టంను రూపొందించినది. సెక్షన్ 66 ప్రకారం కంప్యూటర్ సంబంధిత నేరాలు గురించి పేర్కొంది. మోసపూరితంగా కంప్యూటర్, ఫోన్ హ్యాక్ చేయడం తీవ్ర నేరంగా పరిగణిస్తోంది. ఈ నేరానికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా ఐదు లక్షల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించబడతాయి.
నిర్దేశిత మార్గదర్శకాలు
ఇండియన్ టెలిగ్రాఫ్ (సవరణ) రూల్స్ 2007లో రూల్ 419 ఎ ప్రకారం.. ఫోన్ ట్యాపింగ్‌కు భారత ప్రభుత్వం విషయంలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో భారత ప్రభుత్వ కార్యదర్శి చేసిన ఆదేశం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం విషయంలో హోం శాఖ ఇన్‌ఛార్జ్, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ద్వారా చేయవచ్చు. ఇదే కాకుండా కేంద్ర / రాష్ట్ర హోం కార్యదర్శి ఆదేశించిన ప్రతి ట్యాపింగ్‌ను సమీక్షించే ఒక పర్యవేక్షక కమిటీ ఉంటుంది. చట్టానికి లోబడి ఉన్నాయో లేదో ధృవీకరించడానికి ఈ కమిటీలో క్యాబినెట్ సెక్రటరీ , లా సెక్రటరీ, టెలికాం సెక్రటరీ ఉంటారు. ఆదేశాలు ముందుగా ఉపసంహరించుకుంటే తప్ప 60 రోజులకు మించకుండా అమలులో ఉంటాయి. అవి పునరుద్ధరించబడవచ్చు, కానీ, మొత్తం 180 రోజులకు మించకూడదు. నియమాల ప్రకారం, రికార్డ్‌లు ప్రతి ఆరు నెలలకు విధ్వంసం చేయబడతాయి. సర్వీస్ ప్రొవైడర్లు కూడా అంతరాయాన్ని నిలిపివేసిన రెండు నెలలలోపు సంబంధించిన రికార్డ్‌లను ధ్వంసం చేయాల్సి ఉంటుంది.
స్వేచ్ఛాహక్కుకు భంగం
టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఒక వ్యక్తి గోప్యతపై తీవ్రమైన దాడిగా పరిగణించవచ్చు. ప్రతి ప్రభుత్వం ఎంత ప్రజాస్వామ్యంగా ఉన్నప్పటికీ పౌరుల గోప్యత హక్కును నాటి అధికారులు దుర్వినియోగం చేయకుండా కాపాడాలి. తగిన రక్షణలు లేకుండా, చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం వ్యక్తిగత గోప్యత యొక్క ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. గోప్యత హక్కు రాజ్యాంగంలోని 19(1) , 21 అధికరణల ప్రకారం రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కు. చట్టంలోని సెక్షన్ 5(2)ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించకుండా కాపాడేందుకు, గోప్యత హక్కును కాపాడేందుకు, సెక్షన్ 5(2) అనేక రాష్ట్రాలకు కీలకమైనప్పటికీ నిబంధనలున్నాయి.
డా. ఎ. కుమారస్వామి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ, ఉస్మానియా యూనివర్సిటీ