యాది మర్చిన కేసీఆర్

పుట్టి, పెరిగిన ఊరు కన్నతల్లితో సమానం అంటారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అసొంటి ఎన్నో ఊళ్లను సింగరేణి భూతమై మింగుతోంది. పచ్చని పల్లెలను మట్టి దిబ్బలుగా మారుస్తోంది. వేలాది మంది పల్లె వాసులకు, సొంతూరంటూ లేకుండా చేస్తోంది. ఇప్పుడు మా ఊరు వంతొచ్చింది. ఇది వరకే ఓసారి మా భూములు, ఇండ్లు లాగేసుకున్న సింగరేణి, ఇప్పుడు ఊరి పొలిమేరలో కూడా బతకనివ్వకుండా తరుముతోంది. తాతలు, తండ్రులు సంపాదించి ఇచ్చిన భూములను, రెక్కలుముక్కలు చేసుకుని కట్టించిన ఇండ్లను ఆనవాళ్లు లేకుండా చేస్తోంది.

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని లద్నాపూర్ గ్రామం మాది. పెద్దపల్లి–మంథని మెయిన్ రోడ్డుకు ఇరువైపులా 3 కిలోమీటర్ల పొడవునా గ్రామం విస్తరించి ఉంది. గతంలో రోడ్డు నుంచి అర కిలోమీటర్ లోపల పచ్చటి పల్లె ఉండేది. ఆ పల్లెను 15 ఏండ్ల క్రితమే సింగరేణి బొందలగడ్డగా మార్చింది. అప్పుడు ఊరు ఇడిచి పోలేక, ఊరి పొలిమేర ఉన్నంతకాడికి రోడ్డుకు ఇరువైపులా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఊరికి పునర్జన్మ పోసిన్రు. మా తరానికి బంధాలను నిలిపిన్రు. కానీ, సింగరేణి కన్ను మళ్లోసారి మా ఊరి మీదనే పడ్డది. అత్తెసరు పరిహారం చెల్లించి 2012లో మిగిలిన కొద్దిపాటి భూములను కూడా తనలో కలిపేసుకుంది. దోపసలు పండే భూములకు, చట్టాల సాకులు చూపెట్టి రూ.5 లక్షల పరిహారంతోనే సరిపెట్టింది. భూములు లేక ఉపాధి కోల్పోయిన రైతులు, రైతు కూలీలంతా సింగరేణి ఓబీ కాంట్రాక్టర్ల దగ్గర లేబర్లు అయిన్రు. వ్యవసాయం చేస్తూ దొరలెక్కల బతికినోళ్లంతా, అదే భూమిలో క్లీనర్లు, డ్రైవర్లుగా మారిన్రు. మా ఇండ్ల పక్కనే బొగ్గు బాయి తవ్వకాలు మొదలైనయి. బ్లాస్టింగ్ ధాటికి ఇండ్లు బీటలు పారినయి. ఇక్కడ ఉండుడు మంచిది కాదు అని చెప్పి, ఇండ్లు కూడా తీసుకుంటాం అన్నారు. ఇదే ఊళ్లో మరో చోట ఇళ్లడుగు జాగ డెవలప్‌‌‌‌ చేసి ఇస్తాం అని హామీ ఇచ్చిన్రు. ఆ హామీ అట్లనే ఉండిపోయింది.

బెదిరింపులు.. అదిరింపులు

ఈ ఎనిమిది ఏండ్లలో మా భూములల్ల వందల కోట్ల విలువైన బొగ్గు తవ్వుకున్నరు. మా ఊరికి వెనక పక్కనున్న అడ్యాల అనే ఊరును కూడా ఖాళీ చేయించి ఆనవాళ్లు లేకుండా చేశారు. ఇగ ఇప్పుడు బాయి ముంగటికి జరపాల్సిన టైమొచ్చింది. ఇందుకు మా ఇండ్లు అడ్డుగా ఉన్నాయని, మమ్మల్ని తరుముడు స్టార్ట్ చేసిన్రు. భూములకు ఇచ్చినట్టే, ఇండ్లకు కూడా అడ్డికి పావుశేరు పరిహారం కట్టిచ్చిన్రు. ఊళ్లో మరో చోట జాగ ఇస్తామని చెప్పిన హామీ మరిచిన్రు. మా ఊరికి ఐదు కిలోమీటర్ల ఆవల నాలుగు ఊర్లు దాటి ఓ చెరువు కుంట పొంటి ఉన్న భూమి చూపెట్టిన్రు. తీసుకుంటే ఇది తీసుకోవాలె, లేకుంటే ఇంకో పది కిలోమీటర్ల ఆవలికి పోవాలె అని బ్లాక్‌‌‌‌మెయిలింగ్‌‌‌‌కు దిగిన్రు. బ్లాస్టింగ్ ధాటికి మీ ఇండ్లు కూలుతయ్, రెడ్ జోన్ పెడ్తం పోతరా లేదా అని బెదిరింపులు, అదిరింపులు షురూ చేసిన్రు. ఊళ్లల్లో ఉండే చిల్లర నాయకులకు తాయిలాలు ఇచ్చి, ఓబీ కాంట్రాక్టర్ల దగ్గర లేబరర్లుగా మారిన ఊరి జనాలను పనిలోకి రానివ్వం అని బెదిరిస్తూ జనం మీద ఒత్తిడి పెంచిన్రు. అదిరిచ్చి, బెదిరిచ్చి ఆ అంపు భూమిలో ఒక్కొక్కరికి 150 గజాల జాగ తీసుకునేందుకు బలవంతంగా ఒప్పించిన్రు. ఫిబ్రవరి చివరికల్లా ఇండ్లు ఖాళీ చేసి ఎల్లిపోవాలని హుకూం జారీ చేసిన్రు.

క్వార్టర్లు కడ్తున్నమని బుకాయింపు

వాస్తవానికి, మాకు ఇప్పుడు ఇస్తున్న భూమికి దగ్గర్లోనే రోడ్డుకు ఆనుకుని సింగరేణికి కొన్ని పదుల ఎకరాల భూమి ఉంది. ఇండ్లు కట్టుకునేందుకు అనువుగా ఉన్నందున, ఆ భూమిని మాకు కేటాయించాలని అడిగినం. ఆ భూమి ఇచ్చుడు ఇష్టంలేని ఆఫీసర్లు. అందులో ఆగమేఘాల మీద ఓ నర్సరీ, పార్కు సృష్టించిన్రు. ట్రాన్స్‌‌‌‌ఫర్ల మీద వచ్చి నాలుగు రోజులో, నాలుగు ఏండ్లో ఉండిపోయే సింగరేణి పెద్ద ఆఫీసర్ల కోసం ఎకరానికిపైగా విస్తీర్ణంతో రెండు బంగ్లాలు కట్టిన్రు. మిగిలిన భూమిలో సింగరేణి కార్మికులకు క్వార్టర్లు కడ్తున్నామని బుకాయించిన్రు. ఇవన్నీ ఆ భూమిని మాకు దక్కకుండా చేసేందుకు ఆఫీసర్లు ఆడిన నాటకమే తప్పితే, వాస్తవానికి అక్కడ క్వార్టర్స్ నిర్మించేందుకు సింగరేణి యాజమాన్యం నుంచి ఉత్తర్వులు ఏమీలేవు. క్వార్టర్లు నిర్మించే సిస్టమ్‌‌‌‌నే సింగరేణి ఎత్తేస్తున్నప్పుడు, కొత్తగా క్వార్టర్ల నిర్మాణం ఎట్ల చేపడ్తరని దబాయించి అడిగే చైతన్యం మాకు లేకపోయింది. అయినా నాలుగొద్దులు ఉండిపోయే ఆఫీసర్లకు ఎకరాల విస్తీర్ణంలో బంగ్లాలు కట్టించుకున్నప్పుడు, తరాల తరబడి అక్కడే జీవించాల్సిన భూదాతలకు కుంట పక్కపొంటి 150 గజాల జాగ ఇచ్చుడు న్యాయమెట్లు అయితది? వందల, వేల ఎకరాల భూములను ఇచ్చి సింగరేణి మనుగడకు, ప్రభుత్వాలు చెప్పే దేశాభివృద్ధికి కారకులైతున్న రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని అడిగే ప్రజాప్రతినిధులు కరువయ్యారు.

అన్ని గ్రామాలదీ ఇదే గోస

సింగరేణి భూసేకరణ అరాచకాలు లద్నాపూర్‌‌‌‌‌‌‌‌తోనే మొదలుకాలేదు, లద్నాపూర్‌‌‌‌‌‌‌‌తోనే ఆగిపోయే అవకాశాలు కూడా లేవు. మా ఊరు కంటే ముందే అడ్యాల అనే మరో ఊరును సింగరేణి ఆనవాళ్లు లేకుండా చేసింది. ఆ ఊరిలో ఇప్పటికీ నష్టపరిహారం రాక ఇబ్బంది పడుతున్న వాళ్లున్నారు. మా తర్వాత ఉన్న రాజాపూర్, సిద్ధపల్లె, రామయ్యపల్లె గ్రామాలను కూడా సింగరేణి తనలో కలిపేసుకునేందుకు సిద్ధంగా ఉంది. సింగరేణికి ఇంకో పదేండ్ల తర్వాత అవసరం అనుకుంటే, ఇవ్వాళ్టి నుంచే ఆ ఊరిని నాశనం పట్టించే చర్యలను ఆఫీసర్లు మొదలు పెడ్తరు. ఆ ఊరి భూములను సింగరేణి తీసుకుంటున్నట్టుగా ఉత్తర్వులు రిలీజ్ చేస్తరు. ఆనాటి నుంచి ఇగ ఆ ఊరి డెవలప్‌‌‌‌మెంట్ ఆగిపోతది. భూములకు, ఇండ్లకు ఇప్పటి రేటు కట్టి, పదేండ్ల తర్వాత సింగరేణికి అవసరం వచ్చిన్నాడు డబ్బులు రిలీజ్ చేస్తరు. ఈ పదేండ్లలో ఆ భూములను ఓనర్ అమ్ముకోనూ లేడు. వాటి మీద లోన్లూ తీసుకోలేడు. రైతుబంధు, రైతుబీమా వంటి స్కీమ్‌‌‌‌లూ అమలు కావు. మా పక్కన ఉన్న రాజాపూర్‌‌‌‌‌‌‌‌, రామయ్యపల్లి భూములను స్వాధీనం చేసుకుంటున్నట్టుగా ఐదారు ఏండ్ల కిందట్నే సింగరేణి ఉత్తర్వులు ఇచ్చింది. అప్పట్నుంచి ఆ ఊరి రైతులకు రైతు బంధు వస్తలేదు. సచ్చిపోయిన రైతుల కుటుంబాలకు రైతుబీమా కింద ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల రూపాయలు కూడా ఇస్తలేరు. చెప్పుకుంటూ పోతే సింగరేణి ప్రభావిత గ్రామాల్లో ఇలాంటి వెతలు ఎన్నో ఉన్నాయి.

యాది మర్చిన కేసీఆర్

తెలంగాణ వచ్చినంక ఓపెన్ కాస్టులె ఉండవు, అన్నీ అండర్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ మైన్‌‌‌‌లేనని చెప్పిన సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. గోదావరి నదికి ఇరువైపులా ఉన్న పల్లెలను మట్టిదిబ్బలుగా మార్చే ఓపెన్ కాస్ట్‌‌‌‌లకు పర్మిషన్లు ఇస్తూనే ఉన్నరు. ఓ వైపు హరితహారం అంటూ మరోవైపు ఓసీలు తవ్వుతూ హరితహననం చేస్తున్నారు. ఇన్ని వేల మంది జనాలను బాధపెట్టి, వందలాది గ్రామాలను నాశనం చేసి, పర్యావరణ విధ్వంసం చేసి సింగరేణి సంపాదించింది ఎంత? మహా అయితే ఏడాదికి ఐదొందల కోట్లు.. ఒక్క ఐదొందల కోట్ల కోసం ఇంత విధ్వంసం చేయాల్సిన అవసరం ఉందా? పర్యావరణ విధ్వంసానికి కారణమయ్యే బొగ్గు తవ్వకాలను ఆదాయ మార్గాలుగా ఎందుకు చూడాలె? బొగ్గు తప్ప కరెంట్ ఉత్పత్తికి మార్గం లేదా? ఇలాంటివి ఎన్నో పాలకులు తమను తాము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యమ నాయకునిగా చెప్పిన మాటలు కేసీఆర్ యాది చేసుకోవాలె. పర్యావరణం మీద, భవిష్యత్ తరాల మీద ఆయనకు ఉన్నది నిజమైన ప్రేమే అయితే ఓసీలకు ఇచ్చిన పర్మిషన్లు రద్దు చేయాలి. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించి, విద్యుత్ ఉత్పత్తికి ఉన్న ప్రత్యామ్నాయ వ్యవస్థలపై ఫోకస్ చేయాలి.

గుండెలు అవిసిపోతున్నయి

పుట్టి, పెరిగిన ఊరును శాశ్వతంగా ఇడిచి పోతున్నామనే మాట తీవ్రంగా వేధిస్తోంది. మనం ఎక్కడ బతికినా సొంతూరుకు పోతే కలిగే అనుభూతి, సొంతూరిలో దొరికే ఆప్యాయత ఇంకెక్కడా దొరకదు. మనం నడక నేర్చుకున్న అరుగు, ఆకిలి దగ్గర్నుంచి దోస్తులతో కూడి ఆడిన పెరడు, స్కూలుకు పోయిన బాట, ఈత నేర్పిన బాయి, గుడి, బడి, పీరీల సావడి సహా ఊళ్లో ఏడికి పోయినా చిన్న నాటి జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. ఆడికిపోంగనే పెదవులపై చిరునవ్వు, అప్పుడు ఆడిన ఆటలు నెమరుకొస్తయి. నేను ఈడనే పుట్టిన బిడ్డ, ఈడనే దోస్తులతో ఆడేడిది అని కొడుక్కో, బిడ్డకో చెప్పుకుంటే ఒళ్లంతా పులకరిస్తది. బతుకు దెరువు కోసం ఊరు ఇడిచిపోయి దశాబ్దాల తర్వాత తిరిగొచ్చినా, ఎట్లున్నవ్ బిడ్డా అని పల్లె పలకరిస్తది. అన్నా, తమ్మి, బాబాయ్, మామ అంటూ మనవాడిగా గుర్తిస్తరు. కుటుంబాల నడుమ తాతల, తండ్రుల కాలం నాటి నుంచి ఉన్న పరిచయం రేపటి తరాల మధ్య కూడా బంధాలను కలుపుతది. ఇవన్నీ మాకు దూరమవుతున్నయి. ఇదంతా తలుచుకుంటే గుండె బరువు ఎక్కుతోంది. కండ్లల్లో నీళ్లు తిరుగుతున్నయి. మా గోస ఇంకెవరికీ రావొద్దు.

:: డేగ కుమార్ యాదవ్, లద్నాపూర్, పెద్దపల్లి