సాధ్యమైనంత ఎక్కువ మందిని చంపాలన్నదే టార్గెట్!

సాధ్యమైనంత ఎక్కువ మందిని  చంపాలన్నదే టార్గెట్!
  •  న్యూఓర్లీన్స్ ఉగ్రదాడి నిందితుడి ప్లాన్ ఇదే
  • సొంత కుటుంబాన్నీ చంపాలనుకున్నడు 
  • అతడి ట్రక్కులో గన్స్, బాంబులు, ఐసిస్ జెండా: ఎఫ్ బీఐ

న్యూ ఓర్లీన్స్/న్యూయార్క్/న్యూఢిల్లీ: న్యూ ఇయర్  వేడుకల సమయంలో అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూ ఓర్లీన్స్ లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ఫెడరల్  బ్యూరో ఆఫ్  ఇన్వెస్టిగేషన్  (ఎఫ్ బీఐ) పోలీసులు దర్యాప్తు  ముమ్మరం చేశారు. న్యూ ఓర్లీన్స్ లోని బౌర్ బాన్  స్ట్రీట్ లో వేడుకలు జరుపుకుంటున్న జనంపై బుధవారం తెల్లవారుజామున ఓ దుండగుడు ట్రక్కుతో దూసుకెళ్లి బీభత్సం సృష్టించాడు. అనంతరం వారిపై కాల్పులు జరిపాడు. 

ఈ దాడిలో మృతుల సంఖ్య 15కు చేరింది. గాయపడిన 33 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. హంతకుడిని టెక్సస్ కు చెందిన అమెరికా పౌరుడు షంషుద్దీన్  జబ్బార్ (42) గా గుర్తించారు. అతడు అమెరికన్  ఆర్మీ వెటరన్ గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనలో ఎఫ్ బీఐ పోలీసులు చేస్తున్న దర్యాప్తులో భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నరమేధానికి పాల్పడేందుకు జబ్బార్  కుట్రపన్నాడని పోలీసులు తెలిపారు. వేడుకలు చేసుకుంటున్న జనంలో సాధ్యమైనంత మందిని ట్రక్కుతో ఢీకొట్టి చంపేందుకు అతను ప్లాన్  చేసుకున్నాడని వెల్లడించారు. 

‘‘న్యూ ఓర్లీన్స్ లో జరిగింది ఉగ్రదాడిగానే భావిస్తున్నాం. ఈ ఘటన వెనుక జబ్బార్  కాకుండా మరి కొంతమంది హస్తం ఉండవచ్చు. అతడికి ఏమైనా టెర్రరిస్టు సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. జనంపై అతను ట్రక్కుతో దూసుకెళ్లడమే కాకుండా ట్రక్కు దిగిన తర్వాత అక్కడున్న వారిపై జబ్బార్  విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. 

దీంతో మరిన్ని మరణాలు సంభవించకుండా అతడిని అక్కడికక్కడే కాల్చిపారేశాం. తర్వాత హంతకుడి వెహికల్  చెక్  చేయగా.. అందులో తుపాకులు, పైప్  బాంబులు, ఐసిస్  (ఇస్లామిక్  స్టేట్) జెండా దొరికాయి. అతడిని ఐసిస్  టెర్రరిస్టుగా భావిస్తున్నాం. అతడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. అలాగే, అక్కడి ఫ్రెంచ్  క్వార్టర్ లో పేలుడు పదార్థాలు లభించాయి” అని పోలీసులు వివరించారు.

ఐసిస్  నుంచి స్ఫూర్తి పొందాడు

దాడికి దిగే ముందు జబ్బార్  కొన్ని వీడియోలను  రిలీజ్  చేశాడు. తాను ఐసిస్  నుంచి స్ఫూర్తి పొందానని అందులో అతను వెల్లడించాడు. సొంత కుటుంబాన్నీ చంపాలనుకున్నట్టు చెప్పాడు. 

 నైట్‌‌ క్లబ్‌‌ బయట ఫైరింగ్.. 10 మందికి గాయాలు

న్యూ ఓర్లీన్స్ లో ఉగ్రదాడి ఘటన మరవక ముందే అమెరికాలోని న్యూయార్క్ స్టేట్స్  క్వీన్స్ సిటీలో మరో ఘటన జరిగింది. క్వీన్స్ సిటీలోని అమాజుర  నైట్ క్లబ్ లో పార్టీ చేసుకుంటున్న వారిపై బుధవారం రాత్రి 11.20 గంటలకు గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. అయితే, వారందరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని పోలీసులు తెలిపారు.  

ట్రంప్ హోటల్ వద్ద మరో అటాక్.. వ్యక్తి మృతి 

లాస్ వెగాస్ లో టెస్లా సైబర్ ట్రక్ పేలి ఓ వ్యక్తి చనిపోయాడు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్  ట్రంప్ కు చెందిన ఇంటర్నేషనల్  హోటల్ బయట పార్క్  చేసి ఉన్న ఆ సైబర్  ట్రక్ లో పేలుడు సంభవించింది. ఆ ట్రక్కుకు సమీపంలో ఉన్న వ్యక్తి ఈ పేలుడు ధాటికి ప్రాణాలు కోల్పోయాడు. ఆ ట్రక్కులో టపాసులు, గ్యాస్  ట్యాంకులు, ఇంధనం ఉందని తెలిసింది. ఈ ఘటనను అధ్యక్షుడు జో బైడెన్  ఖండించారు. ఈ ఘటనకు, న్యూ ఓర్లీన్స్ లో జరిగిన ఉగ్రదాడికి  సంబంధం ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలిపారు. 

కాగా.. సైబర్  ట్రక్  పేలుడు ఘటనపై బిలియనీర్  ఎలాన్  మస్క్  స్పందించారు. అది  ఉగ్రదాడేనని   ట్వీట్  చేశారు. ‘‘టెర్రరిస్టులు రాంగ్  వెహికల్ ను ఎంచుకున్నారు. వాస్తవానికి దాడి తీవ్రతను సైబర్  ట్రక్  నియంత్రించింది. పేలుడు పైకి జరిగేలా చూసింది. ఈ దాడిలో ఒక్క డోర్  కూడా విరగలేదు” అని మస్క్  తెలిపారు. కాగా, అమెరికాలో వరుసగా మూడు టెర్రర్ అటాక్స్ జరగడంతో జనం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.