ఇప్పటి వరకు దేశానికి సేవలందించిన రాష్ట్రపతులందరి గురించి రాష్ట్రపతి భవన్ లో ఉంది. కానీ, దేశ ప్రధానులుగా వివిధ సంస్కరణలు తేవడంతోపాటు, త్యాగాలు చేసిన నాయకుల గురించి ఒకే చోట ఎక్కడ లేదు. ఒకవేళ తెలుసుకోవాలన్నా శోధించాల్సిందే. అందుకే పీఎంల అందరి, అన్ని రకాల వివరాలు ఒకేచోట పొందుపరచాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ్’ ఏర్పాటు చేయాలని 2018లో నిర్ణయం తీసుకుంది. ఎన్ఎంఎంఎల్ సొసైటీ 43వ మీటింగ్ లో తీన్ మూర్తి భవన్ లో ఈ మ్యూజియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ పడింది. కేంద్ర సాంస్కృతిక శాఖ దాదాపు రూ. 400 కోట్లతో ప్రణాళిక రూపొందించి, నాలుగేండ్ల తర్వాత అద్భుతం ఆవిష్కరించింది. 75 ఏండ్ల ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్14 న ప్రధాని మోడీ ఈ మ్యూజియంను ప్రారంభించారు.
తీన్ మూర్తి భవన్..
తీన్ మూర్తి భవన్.. ఎడ్విన్ ల్యూథెన్స్ ఇంపీరియల్ క్యాపిటల్ లో భాగంగా రాబర్ట్ టోర్ రస్సెల్ దీన్ని1930లో నిర్మించారు. ఇందులో1947 వరకు బ్రిటీష్ కమాండర్ చీఫ్ ఆఫ్ ఇండియా ఉండేవారు. స్వాతంత్ర్యం తర్వాత ఈ భవనం దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అధికార నివాసమైంది. 16 ఏండ్లు నెహ్రూ ఇక్కడి నుంచే దేశ ప్రధానిగా దేశానికి సేవలందించారు. అయితే1964, మే 27లో ఈ నివాసంలోనే తుది శ్వాసం విడిచారు. అదే ఏడాది నెహ్రూ జయంతిన ఈ భవనాన్ని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ(ఎన్ఎంఎంఎల్) గా అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జాతికి అంకితం చేశారు.1966 లో ఎన్ఎంఎంఎల్ సొసైటీ స్థాపించారు. ఈ సొసైటీనే తీన్ మూర్తి భవన్ బాగోగులు చూస్తోంది. దేశ తొలి ప్రధానికి చిరునామాగా ఉన్న.. ఈ భవనం ఇప్పుడు దేశ ప్రధానుల చరిత్ర చెప్పే నిలయంగా మారింది.
రెండు బ్లాక్ లు... 43 గ్యాలరీలు
విశాలమైన ఈ భవనంలో రెండు బ్లాకుల్లో పీఎం మ్యూజియం ఉంది. మాజీ ప్రధాని నెహ్రూ బ్లాక్ ‘ఏ’ (గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్)లోనే ఉండేవారు. గ్రౌండ్ ఫ్లోర్ లో కానిస్టిట్యూషన్ మేకర్, అమలు, వివిధ భాషల్లో రాజ్యాంగ ప్రతులను డిజిటల్ రూపంలో చూడవచ్చు. ఫస్ట్ ఫ్లోర్ లో నెహ్రూ పుట్టుక నుంచి మరణం వరకు తెలుసుకోవచ్చు. ఆయన తుది శ్వాస విడిచిన మంచం, లివింగ్ రూమ్, స్టడీ రూమ్ చూడవచ్చు. కూతురైన ఇందిరా గాంధీకి ఇక్కడ ప్రత్యేక రూమ్ ఉంది. అలాగే, వివిధ దేశాల పర్యటనలలో ఆయనకు వచ్చిన మెమొంటోలు, గిఫ్ట్ లు.. నెహ్రూ తెచ్చిన సంస్కరణలు ఇందులో ఉన్నాయి. ఇక వెనుక భాగంలో15, 600 స్క్వేర్ మీటర్లలో కొత్తగా బ్లాక్ ‘బి’(గ్రౌండ్, ఫస్ట్, సెకండ్)ను నిర్మించారు. మొత్తం 43 గ్యాలరీల్లో నెహ్రూ నుంచి మోడీ వరకు14 మంది ప్రధానుల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
అబ్బురపరిచే టైమ్ మిషన్..
బ్లాక్ ‘బి’ఒక టైమ్ మిషన్. ఫ్రీడం స్ట్రగుల్ నుంచి నేటి వరకు జరిగిన అన్ని పరిణామాలను మన కళ్లముందు ఉంచుతుంది. రెండు చేతుల మధ్య అశోక చక్రంతో ఉండే చిహ్నం ఈ మ్యూజియం సారాంశాన్ని తెలుపుతుంది. లోనికి అడుగుపెట్టగానే దేశంలోని వివిధ భాషలతో బోర్డు స్వాగతం పలుకుతుంది. వెనకాల పెద్ద స్ర్కీన్ తో మూడు సింహాల జాతీయ చిహ్నం అయస్కాంత శక్తితో గాలిలో తేలియాడుతుంది. నెహ్రూ నుంచి మోడీ వరకు14 మంది ప్రధానుల భారీ డిస్ప్లేలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఇలా ముందుకు వెళ్లగానే.. రెండో ప్రధాని గుల్జారీ లాల్ నంద, జై జవాన్– జై కిసాన్ అని నినదించిన లాల్ బహదూర్, ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, ఐకే గుజ్రాల్, చంద్రశేఖర్, రాజీవ్ గాంధీ, వీపీసింగ్,దేవెగౌడ, పీవీ నర్సింహా రావు, వాజ్‌పేయ్, మన్మోహన్ సింగ్, మోడీ చరిత్ర ఉంటుంది.
14 మంది దేశ ప్రధానుల్లో మనకు ఇష్టమైన పీఎంతో మనం నడవవచ్చు..సెల్పీ తీసుకోవచ్చు. పాక్, చైనా బార్డర్లలో విస్తుపోయేలా నిర్మించిన సొరంగ మార్గాలు, రైల్వే బ్రిడ్జిలు, భారత ఫ్యూచర్ మ్యాన్‌ను హెలిక్యాప్టర్ రైడ్(టెక్నికల్)లో ఎంజాయ్ చేయవచ్చు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, డిజిటల్ ఫీడ్ బ్యాక్, చంద్రయాన్ వంటివి ఈ మ్యూజియంలో స్పెషల్ అట్రాక్షన్స్. – వెలుగు ప్రతినిధి, ఢిల్లీ