- శిథిలావస్థలో పోచారం కెనాల్!
- కొట్టుకుపోతున్న కాలువ సైడ్‌వాల్ సిమెంట్
కామారెడ్డి, వెలుగు : జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలో ఉన్న పోచారం ప్రాజెక్టు మెయిన్ కెనాల్ శిథిలావస్థకు చేరుతోంది. ఏళ్లుగా కెనాల్ మెయింటెనెన్స్, రిపేర్లు చేయడపోవడంతో చివరి ఆయకట్టు వరకు నీళ్లు చేరడం కష్టంగా మారుతోంది. ప్రాజెక్టు ఎత్తు పెంపుతో పాటు కెనాల్ఆధునికీకరణపై శ్రద్ధ చూపాల్సిన ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. 100 ఏండ్ల కింద నిర్మించిన ప్రాజెక్ట్చెక్కు చెదరకపోయినా.. 15 ఏండ్ల కింద నిర్మించిన మెయిన్కెనాల్సైడ్ వాల్ కూలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కెనాల్ ద్వారా ఆయకట్టుకు నీళ్లు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే రిపేర్లు చేపట్టాలని డిమాండ్చేస్తున్నారు.
1922లో ప్రాజెక్టు నిర్మాణం
పోచారం ప్రాజెక్టును 1922లో నిజాం ప్రభుత్వ హయాంలో నిర్మించారు. నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లో 1,500 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేందుకు అప్పట్లోనే 58 కి. మీ మేర కెనాల్తవ్వారు. మెయిన్ కెనాల్ నుంచి నీళ్లు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్కూడా తవ్వించారు. ప్రాజెక్టును ఏ, బీ జోన్లు గా విభజించి వరి సాగుకు నీళ్లు ఇస్తున్నారు. వానాకాలంలో రెండు జోన్లకు నీళ్లిస్తుండగా, యాసంగిలో ఏడాదికి ఒక జోన్‌కు మాత్రమే నీళ్లు విడుదల చేస్తారు.
ప్రస్తుతం కాలువ పరిస్థితి..
ప్రాజెక్టు మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు 2007లో రూ. 80 కోట్లతో చేపట్టారు. కెనాల్‌కు రెండు పక్కల రాళ్లు, కింద సిమెంట్బెడ్వేశారు. లైనింగ్ నిర్మాణం తర్వాత కొన్నేళ్ల వరకు సాగు నీళ్లు చివరి ఆయకట్టు వరకు కూడా సజావుగా వచ్చాయి. కానీ కెనాల్వెంట లైనింగ్ శిథిలమైంది. సిమెంట్ఊడిపోయి రాళ్లు పడిపోతున్నాయి. కింద వేసిన లైనింగ్ కొట్టుకు పోయింది. నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లోని పలు చోట్ల సిమెంట్పనులు పగుళ్లు వచ్చాయి. ప్రాజెక్టు నుంచి సాగు నీళ్లను రిలీజ్ చేసిన తర్వాత చివరి ఆయకట్టు వరకు రావడానికి చాలా రోజులు పడుతోంది. ఎల్లారెడ్డి మండలంలోని ఆయా గ్రామాల్లోని చివరి ఆయకట్టు వరకు నీళ్లు రాక పంటలకు తడులు అందడం లేదు. శిథిలమైన కెనాల్ లైనింగ్ పనులకు రిపేర్లు చేస్తే నీటి ప్రవాహంలో వేగం పెరిగి చివరి ఆయకట్టుకు నీళ్లు అందే అవకాశముందని రైతులు
పేర్కొంటున్నారు.
రిపేర్ చేస్తే మేలు
పోచారం ప్రాజెక్టు కాల్వ చాలా చోట్ల సిమెంట్పోయింది. ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలిన తర్వాత చివరి ఆయకట్టుకు వచ్చే సరికి ఐదారు రోజులవుతోంది. కాల్వలో ఒరవడిగా ప్రవహించేందుకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. కింద సిమెంట్పోయి భూమిలోకి నీళ్లు ఇంకుతున్నాయి. వెంటనే రిపేర్ చేయాలి
- రాజయ్య, ఎల్లారెడ్డి మండలం
సిమెంట్ కొట్టుకు పోయింది
15 ఏండ్ల కింద కాల్వకు రెండు వైపుల రాళ్లతో కట్టడం, కింద సిమెంట్ వేసిన్రు. అప్పట్లో చివరి ఆయకట్టు వరకు నీళ్లు సరిగ్గానే వచ్చినయ్. ఇప్పుడు కాల్వ కింది భాగంలో వేసిన సిమెంట్ పోయింది. నీళ్లు భూమిలోకి ఇంకుతున్నాయి.
- బాల్‌రాజు, ఎల్లారెడ్డి మండలం