కానిస్టేబుల్​పై పోక్సో కేసు ..పోలీసుల కండ్లు కప్పి పరార్​

కానిస్టేబుల్​పై పోక్సో కేసు ..పోలీసుల కండ్లు కప్పి పరార్​
  •     రిపబ్లిక్​ డే ఉత్సవాల్లో ఉండగా జారుకున్న పీసీ
  •     నిజామాబాద్​ రూరల్​ పీఎస్​లో ఘటన

నిజామాబాద్, వెలుగు : బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ కానిస్టేబుల్​ను పోలీసులు అదుపులోకి తీసుకోగా వారి కండ్లు కప్పి పారిపోయాడు. శుక్రవారం ఠాణా సిబ్బంది రిపబ్లిక్​ డే వేడుకల్లో ఉండగా జారుకున్నాడు. నిజామాబాద్ ​శివారులోని ఓ గ్రామంలో నాన్ ​బెయిలబుల్​ వారెంట్​ ఇవ్వడానికి  గురువారం రూరల్ ​ఠాణాకు చెందిన  కానిస్టేబుల్​ మహేశ్​ వెళ్లాడు. సదరు వ్యక్తి ఇంట్లో లేకపోవడంతో పక్కంటికి వెళ్లి కూర్చున్నాడు. ఆ ఇంట్లో మంచినీళ్లు ఇవ్వడానికి వచ్చిన 15 ఏండ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. బెదిరిపోయిన ఆమె లోపలకు పరిగెత్తి తల్లిదండ్రులకు చెప్పింది. వారు వచ్చేలోపు మహేశ్​ ​బైక్​పై పారిపోయాడు. పేరెంట్స్​తో కలిసి రూరల్ ​స్టేషన్ లో   బాలిక ఫిర్యాదు  చేయగా కానిస్టేబుల్​పై పోక్సో కేసు నమోదు చేసిన ఎస్ఐ లింబాద్రి గురువారం రాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రిపబ్లిక్ డే వేడుకల్లో ఎస్ఐతో పాటు సిబ్బంది ఉండగా మహేశ్​పారిపోయాడు. దీన్ని సీరియస్​గా తీసుకున్న సీపీ కల్మేశ్వర్​సింగనెవార్​ నిందితుడిని పట్టుకోడానికి స్పెషల్​టీం ఏర్పాటు చేశారు. 

సస్పెండ్​ అయి ఇటీవలే డ్యూటీలో చేరి...

సెప్టెంబర్​లో రూరల్​ పీఎస్​కు వచ్చిన ఇద్దరు భార్యాభర్తల కేసులో మితిమీరి జోక్యం చేసుకున్న కానిస్టేబుల్​మహేశ్​​ను అప్పటి సీపీ సత్యనారాయణ సస్పెండ్​చేశారు. ఇంట్లో గొడవపడి ఠాణాకు రాగా సహాయం చేస్తానని వివాహిత  ఫోన్​నంబర్​ తీసుకొని ఆమెకు తరచూ ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు సీపీ సత్యనారాయణకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది. ఈ కారణంగా మహేశ్​ను మూడు నెలలు పాటు సస్పెండ్​ చేశారు. తర్వాత ఒక ప్రజాప్రతినిధి పైరవీతో మళ్లీ రూరల్​ పోలీస్​స్టేషన్​లోనే డ్యూటీ వేయించుకున్నాడు. మళ్లీ బాలికతో అసభ్యంగా ప్రవర్తించి పనిచేసే స్టేషన్​లోనే కేసు ఎదుర్కొంటూ పరారయ్యాడు.