బీజేపీ నేత తిరుపతిరెడ్డి కిడ్నాప్ అయ్యాడా..? కాలేదా..? కేసులో కొత్త ట్విస్టులు..!

హైదరాబాద్ అల్వాల్ లో బీజేపీ నేత ముక్కెర తిరుపతిరెడ్డి కిడ్నాప్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తిరుపతిరెడ్డి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. అల్వాల్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట తన  భర్తను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం (జులై 13న) కిడ్నాప్ చేశారని తిరుపతిరెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు చెప్పిన వివరాల ప్రకారం.. 

గురువారం (జులై 13న) రోజు అల్వాల్ MRO ఆఫీసు దగ్గరకు కారులో వచ్చిన తిరుపతిరెడ్డి.. ఐదు నిమిషాల్లోనే ఒక ఆటోలో సెల్ఫ్ గా ఎక్కి వెళ్లాడు. ఒక్కడే ఆటోలో వెళ్తున్నట్లు అక్కడి సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. ఆటోడ్రైవర్ తో 700 రూపాయలకు కిరాయి మాట్లాడుకుని ఘట్ కేసర్ వైపునకు వెళ్లినట్లు గుర్తించారు. అయితే.. ఘట్ కేసర్ లో దిగిన తిరుపతిరెడ్డి అక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాడు అనేదానిపైనా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఘట్ కేసర్ టౌన్ లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నాలుగు టీమ్స్ గా ఏర్పడి తిరుపతిరెడ్డి ఆచూకీ కోసం SOT, అల్వాల్ పోలీసులు వెతుకుతున్నారు. మామిడి జనార్ధన్ రెడ్డి అనే వ్యక్తికి, తిరుపతిరెడ్డికి భూ వివాదాలు ఉన్న మాట వాస్తవమేనని పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు చెప్పారు. 

తిరుపతిరెడ్డి భార్య వివరాల ప్రకారం..

కుషాయిగూడలో కుటుంబ సభ్యులతో ఉంటున్న ముక్కెర తిరుపతిరెడ్డికి పాకాల కుంటలో విలువైన స్థలం ఉంది. కొన్ని నెలల క్రితం స్థలం విషయంలో వివాదం తలెత్తడంతో పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు తిరుపతిరెడ్డి. ఈ క్రమంలోనే గురువారం (జులై 13న) మధ్యాహ్నం అల్వాల్ తహశీల్దార్ కార్యాలయానికి కారులో తన డ్రైవర్ తో కలిసి వెళ్లాడు. ఆ తర్వాత ఆయన సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ ఉండడంతో తిరుపతిరెడ్డి భార్య అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థలం వివాదంలో తమ ప్రత్యర్థి వర్గమే తన భర్త తిరుపతిరెడ్డిని కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు తిరుపతిరెడ్డి భార్య. మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచరులపై ఫిర్యాదు చేశారు. 

మామిడి జనార్థన్ అనే వ్యక్తిపై తిరుపతిరెడ్డి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా జనార్థన్ రెడ్డికి, తిరుపతిరెడ్డికి మధ్య సివిల్ తగాదాలు ఉన్నాయని చెబుతున్నారు. తిరుపతిరెడ్డికి చెందిన మూడు ఎకరాల భూమిని మామిడి జనార్థన్ రెడ్డి కబ్జాకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. 

మామిడి జనార్థన్ రెడ్డిపై మూడు కమిషనరేట్ల పరిధిలో 15కుపైగా భూకబ్జా కేసులు ఉన్నాయి. జనార్థన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అండతో మామిడి జనార్థన్ రెడ్డి అల్వాల్ లో పలు భూ కబ్జాలు చేశాడని తిరుపతి రెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన భర్తకు ఏదైనా జరిగితే ఎమ్మెల్యే మైనంపల్లి, జనార్థన్ రెడ్డే బాధ్యులని హెచ్చరిస్తోంది తిరుపతి రెడ్డి భార్య.