కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి కోల్బెల్ట్ప్రాంతాలైన మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాల్లో ఆర్నెళ్ల క్రితం చేసిన చోరీల దొంగలను పోలీసులు ఇప్పటికీ పట్టుకోలేపోయారు. పట్ట పగలే దోపిడీలు జరిగిన వరుస చోరీలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. అప్పటి నుంచి వారి ఆచూకీ కోసం వెతికినా ఆధారాలు దొరకలేదు. దీంతో పోలీసు అధికారులు తలలుపట్టుకుంటున్నారు. చోరీలు జరిగిన టైమ్‌లో కార్మికవాడల్లో సీసీ కెమెరాలు లేక దొంగలను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ముమ్మర పెట్రోలింగ్, పహారా కాసినా దొంగలు చిక్కకుండా కంటిన్యూగా పోలీసులకు సవాల్‌విసిరారు. రెండు పట్టణాల్లో రోజుకో చోటా చోరీలు చేస్తూ పోలీసులను ముప్పుతిప్పాలు పెట్టారు. చోరీలు జరిగిన చోట సేకరించిన ఆధారాలతో పాత నేరస్తుల ఫింగర్ప్రింట్స్సరిపోక, ఇతర ఆధారాలు ట్యాలీ కాక ఇవి కొత్తవారి పనేనని నిర్ధారణకు పోలీసులు వచ్చారు. అయితే వారు ఎక్కడి నుంచి, ఎలా వచ్చి తప్పించుకొని పోతున్నారనే విషయంలో పోలీసులు మదనపడుతున్నారు.
ఇంటి యజమానులు తాళం వేసి బయటకు వెళ్లిన కొద్ది నిమిషాల్లో దొంగలు కన్నం వేయడం.. ఓ ప్రాంతంలో వరుసగా చోరీలు జరుగుతుండడంతో స్థానికుల సహకారం ఉందనే కోణంలో సైతం ఆరా తీశారు. పాత నేరస్తులను విచారించినా ఫలితం లేకుండా పోయింది. ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు చోరీలకు పాల్పడుతున్నారని, ముఠాల పని కాదనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టినా వారి ఆచూకీపై ఇప్పటికీ క్లారిటీకి రాలేకపోయారు. గతేడాది ఆగస్టు నుంచి అక్టోబర్వరకు మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాల్లో సుమారు 15 నుంచి 20 ఇండ్లలో చోరీలు జరిగాయి. దొంగలు భారీగా గోల్డ్, క్యాష్‌ను ఎత్తుకెళ్లడం సంచనం సృష్టించింది. దొంగలు దొరుకుతారని, కోల్పోయిన తమ సొత్తు దక్కుతుందనే ఆశతో బాధిత కుటుంబాలు నాలుగు నెలలుగా ఎదురుచూస్తున్నాయి. చోరీ జరిగిన ప్రతి చోట పోలీసుల హడావుడి మాత్రం బాధితుల్లో ఆశలు రేపేలా సాగింది. తాజాగా ఇటీవలే మందమర్రిలో పట్టపగలే ఒక వ్యాపారి ఇంట్లో చోరీ జరగడం స్థానికులను మరోసారి ఉలిక్కిపాటుకు గురిచేసింది.
70 తులాల గోల్డ్, రూ.లక్షల క్యాష్చోరీ
మందమర్రి, రామకృష్ణాపూర్పట్టణాల్లో వరుస గా జరిగిన సంఘటనల్లో సుమారు 70 నుంచి 100 తులాల వరకు గోల్డ్, వెండి, రూ.లక్షల క్యాష్చోరీకి గురైనట్లు ప్రచారంలో ఉంది. రామకృష్ణాపూర్ లో చోరీల సంఖ్య ఎక్కువగా ఉంది. పట్టణంలో ట్రాఫిక్ కానిస్టేబుల్తిరుమాలచారి, అక్కల రమేశ్, రాగుల రాజేశ్వరి, నగల వ్యాపారి రంగు సత్యనారాయణ, కట్కోజ్వుల సత్యనారాయణ, ఠాకూర్ సబితా, లింగాల శంకరయ్య, ఆటో డ్రైవర్షేర్ లింగమూర్తి, రిటైర్డు ఎంప్లాయ్జంగిల్ కిష్టయ్య, మందమర్రి పట్టణానికి చెందిన సింగరేణి కార్మికుడు రాజ్‌కుమార్, రమేశ్, రాజేశ్వరి(చైన్‌స్నాచింగ్), వ్యాపారి శ్రీనివాస్ ఇండ్లు, నగల దుకాణాల్లో జరిగిన చోరీలపై ఫిర్యాదు చేశారు. ఇవే కాకుండా మరికొన్ని జరిగి కొద్దిపాటి నష్టం జరగడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించలేరు. కూలీ నుంచి మొదలు సింగరేణి ఉద్యోగులు, పోలీసులు, వ్యాపారుల వరకు దొంగల బారిన పడిన బాధితులే.
ఇంకా ఆచూకీ దొరకలే...
మందమర్రి, రామకృష్ణాపూర్ తోపాటు సమీప ప్రాంతాల్లో దొంగలు తాళాలు వేసిన ఇంటి వెనుకవైపు నుంచి ప్రవేశించడం, పలుచోట్ల కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన కొద్ది గంటల వ్యవధిలోనే వరుసగా చోరీలు చేశారు. పాత నేరస్తుల కదలికలు, భారీగా నిర్మాణాలు జరుగుతుండటంతో కోల్బెల్ట్ప్రాంతాల్లో కొత్త వ్యక్తుల సంచారంపై నిఘా పెట్టి ప్రత్యేక గస్తీ టీంలను ఏర్పాటు చేసి నాలుగు నెలలుగా వెతుకుతున్నా ఆచూకీ లేకుండాపోయింది. పోలీసులు అవగాహన కల్పించడంతో కాలనీల్లో పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం చోరీలు కొంత తగ్గుముఖం పట్టాయి. మందమర్రిలో ఇటీవల జరిగిన ఒకటి రెండు కేసులను చేధించినా, రామకృష్ణాపూర్లో మాత్రం ఎలాంటి చర్యలు లేవు. ఇటీవల లక్సెట్టిపేటతోపాటు పక్కా జిల్లాలోని గోదావరిఖని ప్రాంతంలో వరుస చోరీలు వెలుగులోకి రావడంతో మళ్లీ కోల్‌బెల్ట్ ప్రాంత వాసులు, ఉద్యోగులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.