శంషాబాద్, వెలుగు: నకిలీ సర్టిఫికెట్ల తయారు చేసి అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్జీఐఏ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, సెక్టార్ ఎస్ ఐ సుమన్ తెలిపిన ప్రకారం.. వనపర్తి జిల్లా చారుకొండకు చెందిన బావండ్ల దేవేందర్, నాగర్ కర్నూల్ జిల్లాకు, చెందిన కనుకంటి సిద్దు యాదవ్ , ఏపీలోని కర్నూలు జిల్లా, వడ్డేమాన్ కు చెందిన బొమ్మన్న శివశంకర్ రెడ్డి లు ముఠాగా ఏర్పడి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి అమాయకులకు అమ్ముతున్నారు. వీరికి శంషాబాద్ ఆదర్శనగర్‌కు చెందిన నాగేశ్వరరావు, అతని స్నేహితుడు సాయిబాబాతో పరిచయమైంది.
దూరవిద్య ఎంఎస్సీ అనలిటికల్ సర్టిఫికెట్ల కోసం శంకర్ రెడ్డి, సిద్దూ యాదవ్, దేవేందర్ లను నాగేశ్వర్ రావు కలిశారు. దీనికి వాటికి సంబంధించిన పరీక్షలు రాయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఒక్కో సర్టిఫికెట్ కు రూ. 20 వేలు అవుతుందని నాగేశ్వరరావును నమ్మించారు. అతని వద్ద రూ. 20 వేలు తీసుకుని శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ అనంతపూర్, ఎంఎస్ (అనలిటికల్ కెమిస్ట్రీ) ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ ఎమ్మెస్సీ (అనలాటికల్ కెమిస్ట్రీ) సర్టిఫికెట్లు ఇచ్చారు.
ALSO READ :కోర్టుకు పోయిండని ఆఫీస్కు రానియ్యట్లే!
దీంతో అవి నకిలీ సర్టిఫికెట్లు అని గుర్తించిన నాగేశ్వరరావు శంషాబాద్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. రాజేంద్రనగర్, శంషాబాద్ ఎస్వోటీ, ఆర్జీఐఏ పోలీసులు నిందితులను పట్టుకున్నారు. రెండు కలర్ ప్రింటర్స్, రెండు మానిటర్స్, రెండు హార్డ్ డిస్క్ లు, ఉస్మానియా, జేఎన్టీయూ, ఆంధ్ర, ఆచార్య నాగార్జున యూనివర్సీటీ, బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, డిపార్టుమెంట్ ఆప్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ సర్టిఫికెట్, శ్రీ ఇందు కాలేజీ ఇంజినీరింగ్, శ్రీ కృష్ణ దేవరాయల యూనివర్సీటీ, వెంకటేశ్వర యూనివర్సిటీతో పాటు పలు పాఠశాలలు, ఇంజినీరింగ్ కళాశాలల సర్టిఫికెట్లు నకిలీవి తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో ఆయా యూనివర్సీటీల నకిలీ ఫేక్ సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల్లో బావండ్ల దేవేందర్ కీలక సూత్రధారి అని ఇతను పేజీ మేకర్ ఫొటో షాప్, డీటీపీల ద్వారా ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి రూ.20 వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.