సర్పంచ్, బీజేపీ లీడర్లను అరెస్టు చేసి..డబుల్​బెడ్రూం ఇండ్ల పంపిణీ

సర్పంచ్, బీజేపీ లీడర్లను అరెస్టు చేసి..డబుల్​బెడ్రూం ఇండ్ల పంపిణీ

అనర్హులకు ఇండ్లు కేటాయించారంటూ లీడర్ల ఆరోపణ

యాదగిరిగుట్ట, వెలుగు : డబుల్​బెడ్రూం ఇండ్ల పంపిణీని అడ్డుకుంటారని ముందస్తు జాగ్రత్తగా సర్పంచ్, బీజేపీ లీడర్లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఇండ్లను పంపిణీ చేశారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వం 40 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. 40 ఇండ్లకుగానూ ఆఫీసర్లు 29 మందిని ఎంపిక చేశారు. మరో 11 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే అర్హులను కాకుండా బీఆర్ఎస్ కు సంబంధించిన వ్యక్తులను, అనర్హులను ఎంపిక చేశారని ఆరోపిస్తూ గతంలో సర్పంచ్ పడాల వనిత, బీజేపీ నాయకులు పలుసార్లు ఆందోళనలు చేపట్టారు.

బుధవారం ఎంపికైన లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని అడ్డుకుంటారనే అనుమానంతో సర్పంచ్ పడాల వనిత సహా బీజేపీ మండల అధ్యక్షుడు కొక్కొండ లక్ష్మీనారాయణ గౌడ్, సర్పంచ్ భర్త పడాల శ్రీనివాస్, బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా సర్పంచ్ అని కూడా చూడకుండా లాక్కెళ్లి పోలీస్ వాహనంలో ఎక్కించారు. అనంతరం భువనగిరి పోలీస్ స్టేషన్ కు అక్కడి నుంచి ఆలేరు పీఎస్ తరలించారు. డబుల్ ఇండ్ల పంపిణీ పూర్తయ్యేవరకు పీఎస్ లోనే నిర్బంధించారు.

డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఆలేరులో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. అర్హులకు కాకుండా అనర్హులకు, బీఆర్ఎస్ కు సంబంధించిన వ్యక్తులకు డబుల్ ఇండ్లను కేటాయించారని ఆరోపించారు. 40 ఇండ్ల కోసం 29 మందిని సెలక్ట్ చేసిన ఆఫీసర్లు.. మిగతా 11 మంది లబ్ధిదారులను ఎందుకు ఫైనల్ చేయలేదని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని విప్ సునీత దృష్టికి తీసుకెళ్తామని చెప్తే మొదట పోలీసులు అంగీకరించారని, కానీ తీరా ఇండ్ల పంపిణీ కోసం ఎమ్మెల్యే సునీత వచ్చే సమయంలో.. కమ్యూనిటీ బిల్డింగ్ వద్ద ఎమ్మెల్యే కోసం ఎదురుచూస్తున్న తమను అరెస్ట్ చేసి బలవంతంగా పోలీస్ వాహనంలో ఎక్కించి భువనగిరి, ఆలేరు పీఎస్ ల చుట్టూ తిప్పారన్నారు.

ఇండ్లను పంపిణీ చేసిన విప్ సునీత

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఎంపిక చేసిన 29 మంది లబ్ధిదారులకు డబుల్ ఇండ్లకు సంబంధించిన పట్టాలను అందజేశారు. మిగతా 11 మంది లబ్ధిదారులను త్వరలోనే ఫైనల్ చేసి ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ.. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అర్హులైన వారికే డబుల్ ఇండ్లు కేటాయించామని చెప్పారు. డబుల్ ఇండ్లు రానివారు అధైర్య పడొద్దని, సొంత జాగ ఉంటే ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తుందన్నారు.